రాలుతున్న పసికందులు (గుంటూరు)

Date:11/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
జీజీహెచ్ లో కనీససౌకర్యాలు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా పిడియాట్రిక్ట్ వార్డులో  పసిపిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది వ్యవధిలో 875 పసి జీవితాలు కడతేరిపోయాయి. చిన్నారుల మరణ మృదంగానికి అడ్డుక్ట పడటం లేదు. శిశు మరణాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా గుంటూరు సర్వజనాసుపత్రిలో నిత్యం కనీసం ఇద్దరు శిశువులు మరణిస్తూనే ఉన్నారు.ఏడాది లోపు చిన్న పిల్లలకు వైద్యసేవలు అందించడంలో వైద్యులతో పోలిస్తే 24 గంటలూ అందించే నర్సింగ్‌ సేవలు చాలా కీలకం. ప్రత్యేకించి నెల రోజుల లోపు పిల్లలకు ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో సేవలు అందించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి శిశువు ఆరోగ్య పర్యవేక్షణకు ఒక నర్సు ప్రత్యేకంగా అవసరం. సర్వజనాసుపత్రిలో ప్రతి రోజూ 70 మంది పిల్లలు ఎన్‌ఐసీయూలో చికిత్స పొందుతుంటారు.
వీరికి సేవలు అందించడానికి ప్రతి శిశువుకు ఒక నర్సు చొప్పున 70 మంది తప్పనిసరిగా ఉండాలి. కానీ పనిచేస్తున్నది ఐదుగురే. నర్సింగ్‌ సిబ్బంది కొరత కారణంగా అవసరమైన మేర విధుల్లో ఉండటంలేదు. ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలకు అత్యవసర సేవలు అందించాల్సి వస్తే, మిగిలిన వారి పరిస్థితి గాలిలో దీపంలా మారుతోంది. నర్సింగ్‌ సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించాలని కోరినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ బిడ్డలను తిరిగి క్షేమంగా దక్కించగలిగే శక్తి నడయాడే దేవుళ్లకే ఉందన్నది తల్లిదండ్రుల విశ్వాసం. అందుకు తగ్గట్లు డాక్టర్ల వ్యవహార సరళి ఉంటోందా? ఇది వైద్యులు ఆత్మశోధన చేసుకోవాల్సిన అంశం. అసలు పిల్లల వార్డులో విధులు చక్కబెట్టాల్సిన సిబ్బందిలో ప్రేమ, కరుణ, సేవాభావం ఉండాలి.
తమ బాధ ఇదీ అని చెప్పుకోలేని పసికందుల పట్ల డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సేవానిరతి మదర్‌ థెరెసాను మరపించే స్థాయిలో ఉండాలి. అలా లేకపోవడమే అన్నింటికన్నా ప్రధాన సమస్య.
ప్రాణాపాయ స్థితిలో అత్యవసర వైద్యసేవల కోసం నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎన్‌ఐసీయూ)లో చేరిన పసి బిడ్డల్లో ఎక్కువ మందికి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష తప్పనిసరిగా అవసరమవుతుంది. ఈ పరికరం ఆ విభాగంలో అందుబాటులోలేక ప్రాణవాయువు అందించే సిలిండరు బిడ్డకు తగిలించి దూరంగా ఉన్న స్కానింగ్‌ కేంద్రానికి తరలించాల్సి వస్తోంది. ఆ సమయంలో మరణాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులే హెచ్చరిస్తుండటం గమనార్హం. ఆ పరికరం ఖరీదు సుమారు రూ.6 లక్షలు ఉంటుంది. దాన్ని ఆ విభాగంలోనే ఏర్పాటు చేస్తే అవసరమైన శిశువులకు అక్కడే ఆ పరీక్ష నిర్వహించవచ్చని సూచిస్తున్నారు.
Tags:Falling babies (Guntur)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *