Famine fangs

కరవు కోరలు

Date:27/11/2018
నెల్లూరు ముచ్చట్లు:
జిల్లాలో కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తీవ్ర వర్షాభావం నెలకొంది. రిజర్వాయర్లలో నీరు తగినంతగా లేదు. ఆయకట్టు రైతులకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. విస్తీర్ణాన్ని ఎంత నియంత్రించాలని అధికారులు ప్రయత్నించినా రైతులకు అవగాహన రావటం లేదు. జిల్లాలో చాలా చోట్ల అనధికారిక ఆయకట్టు పరిధిలోనూ రైతులు నార్లు పోసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. సాగు నీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగు విస్తీర్ణం నియంత్రణకు ఎలాంటి కసరత్తును వ్యవసాయ శాఖ చేపట్టడం లేదు.  కీలక పొట్ట దశలో తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో జిల్లాను వర్షాలతో ఆదుకుంటుందని ఎదురుచూసిన గజ తుపాను ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉంది. సాగుకు ఊపిరి వస్తుందని ఆశించినా.. నేల తడవటమే కష్టమన్నట్లు ఉంది. ఎప్పటిలా కాలువల్లో నీటి కోసం రైతుల మధ్య యుద్ధం మొదలైంది. ఇదే సమయంలో సాగు మొదలుపెట్టడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది. దీనికి వ్యవసాయశాఖ గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి.
డిసెంబరు మొదటి వారం వరకు నాట్లు వేయటానికి అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గజ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని.. కరవు సమస్య పరిష్కారం అవుతుందని ఆశతో ఎదురుచూశారు. తీరా తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా కనిపించలేదు. అడపాదడపా కురిసిన వర్షాలతో పెద్దగా ప్రయోజనం లేదు.  జలాశయంలోకి ఎలాంటి ప్రవాహమూ రావటం లేదు. నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో 11.5 టీఎంసీల నీరు వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం సుమారు 40 టీఎంసీల నీరు సాగుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2017-18 మొదటి పంటకు ఐఏబీ సమావేశంలో 4.92 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వాలని నిర్దేశిస్తే 4.93 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చారు. ప్రస్తుత సంవత్సరం(2018-19)లో మాగాణి కింద 1.91 లక్షల ఎకరాలు, ఆరుతడి కింద 1.3 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు.
31 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని తేల్చారు. అయితే కర్నూలు జిల్లా నుంచి గత ఏడాది పులకనీరు(వినియోగించిన తర్వాత దిగువకు వచ్చే నీరు) భారీగా వచ్చింది. రోజుకు సుమారు 2 వేల క్యూసెక్కుల వరకు కేసీ కాలువ నుంచి ప్రవాహం వచ్చింది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో సైతం వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో అక్కడి నుంచి పులకనీరు వచ్చే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఐఏబీ సమావేశంలో 3.2 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని ఇస్తామని జలవనరుల శాఖ అధికారులు తేల్చిచెప్పారు. నేతలు మాత్రం పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇస్తామని.. నార్లు పోసుకోవాలని చెబుతున్నారు.
రైతులు ఎడాపెడా సాగు మొదలుపెడితే.. కీలకమైన పొట్ట దశలో నీరు ఇవ్వటం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రధానంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నీరు అవసరం ఉంటుంది. ఈ సమయంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. కాలువల్లో నీరు పారటం కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.  ఐఏబీ సమావేశంలో తీర్మానించిన విధంగా 3.2 లక్షల ఎకరాల వరకు నీరు ఇవ్వటమే కష్టంగా ఉంటుందని పేర్కొంటున్నారు. డెల్టా పరిధిలో సాధారణ విస్తీర్ణం సుమారు 2.5 లక్షల ఎకరాల వరకు ఉంది. ఇందులో 1.90 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాల్సి ఉంది. పూర్తి విస్తీర్ణంలో సాగు చేసుకోటానికి నేతలు హామీ ఇస్తున్నారు.  అనధికారిక ఆయకట్టును నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. అధికారిక.. అనధికారిక ఆయకట్టును తేల్చటం కష్టంతో కూడిందని అధికారులు చెబుతున్నారు.
Tags:Famine fangs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *