ప్రేవేట్ కాలేజీల ఫీజు పాట్లు 

Date:13/02/2018
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, బీఎడ్‌, బీపీఈడీ, లా తదితర ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ఇవి సర్కారుకు గుదిబండగా, రాష్ట్రంలోని దాదాపు వెయ్యి ప్రొఫెషనల్‌ కాలేజీలకు శరాఘాతంగా మారుతున్నాయి. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంఽధించి పెండింగ్‌లో ఉన్న రూ.252 కోట్లు కలుపుకుంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ కాలేజీలకు మొత్తం రూ.2,158కోట్లు బకాయి ఉంది. బీసీలకు రూ.898కోట్లు, ఈబీసీలకు రూ.580కోట్లు, ఎస్సీలకు రూ.415కోట్లు, ఎస్టీలకు రూ.95కోట్లు, మైనారిటీలకు రూ.167కోట్లు, పీహెచ్‌లకు రూ.3కోట్లు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో ఉంది.ఫీజు బకాయిలు చాంతాడులా పేరుకుపోతున్నా సంక్షేమ శాఖల అధికారులు మాత్రం స్పష్టత ఇవ్వకుండా దాగుడుమూతలు ఆడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ప్రొఫెషనల్‌ కాలేజీలు కోరుతుండగా, నాలుగు క్వార్టర్లలో ఈ మొత్తాన్ని విడుదల చేస్తామని సర్కారు చెబుతోంది. ఆచరణలో చూస్తే, క్వార్టర్ల వారీగా కూడా అన్ని కాలేజీలకు, అన్ని కేటగిరీలకు ఫీజులు విడుదల చేయడం లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభమై 8నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఏ ఒక్క కాలేజీకీ అన్ని క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌ కాలేదు.గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రూ.252కోట్లు బకాయి ఉంది. ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాలేజీల ఖాతాలకు జమచేసి, స్కాలర్‌షి్‌పలను విద్యార్థుల ఖాతాల్లో వేయా ల్సి ఉంది. ఈ రెండూ పూర్తి స్థాయిలో జరగలేదు. దీంతో 70శాతం కాలేజీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని సింహభాగం ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ వృత్తి విద్యా కాలేజీల్లో పనిచేసే టీచర్లకు గత 6నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే అవకాశం ఇవ్వమంటే, అలా కుదరదంటున్నారని చెబుతున్నాయి.సిబ్బంది జీతాలతోపాటు ఇంటిపన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లించలేకపోతున్నామని, ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇన్‌కమ్‌టాక్స్‌, బ్యాంక్‌ రుణాలపై వడ్డీలు, ఇంటర్నెట్‌ చార్జీలు.. తదితర చెల్లింపులన్నీ పెండింగ్‌లో పెట్టాల్సిన అసాధారణ పరిస్థితి ఏర్పడిందంటున్నాయి. దీనివల్ల తమ విద్యాసంస్థల ఆస్తులను జప్తు చేస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఫీజుల బకాయిలు రూ.కోట్లకు పెరిగిపోతున్నాయని, ఈ పరిస్థితుల్లో కాలేజీలను నిర్వహించలేమని ఏపీ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Tags: Fee of pre-feasible colleges

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *