అందరి సహకారం తో పండుగ లా  ఉత్సవాలు – బియ్యపు మధుసూదన రెడ్డి

శాంతి భద్రతలు, సేవాభావంతో నిర్వహిస్తాం– సుప్రజ
శానిటేషన్, రవాణా పై దృష్టి పెట్టాలి– కనక నరసా రెడ్డి
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
శ్రీకాళహస్తి  మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు  మన ఇంటి పండుగలా  అందరి సహకారం తో శ్రీకాళహస్తి పేరు నిలబెట్టేలా , పది కాలాల పాటు  చెప్పుకునే విధంగా  ఉత్సవాల నిర్వహణ వుండాలని  స్థానిక శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి  అన్నారు.  శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మొత్సవాలు – 2022 నిర్వహణ పై వివిధ శాఖలతో సమన్వయ సమవేశం   ఉదయం ఆర్ డి ఓ  కనక నరసా రెడ్డి, మధ్యహ్నం శ్రీకాళహస్తి  శాసన సభ్యులు  నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.   శాసన సభ్యులు బియ్యపు మధుసూధన రెడ్డి  మాట్లాడుతూ  గత సంవత్సరం అనుభవాలను  దృష్టిలో వుంచుకొని లోపాలు సరిదిద్దుకొని   ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు.  ప్రధానంగా విధ్యుత్ కాంతులు ఏర్పాటు  బాగుండాలని, పట్టణంలో ఓం నమః శివాయ నినాదం మారు మ్రోగేలా సౌండ్ సిస్టం వుండాలని  సూచించారు. 14 రోజుల పూల అలంకరణ విషయంలో 7 రోజులు కర్ణాటక , మరో 7 రోజులు తమిళనాడు వారి సహకారంతో చేపట్టనున్నామని అన్నారు.    గత సంవత్సరం కన్నా  ఈ సారి  రవాణా కోసం  బస్సులు పెంచాలని, మెడికల్  క్యాంపులను బస్టాండ్ లో కుడా ఏర్పాటు చేయాలి, అంబులేన్స్ లు  గతం లో రెండు మాత్రమె  అందుబాటులో ఉంచారని,  ఈ సారి అవి 4 అందుబాటులో వుండాలని  తెలిపారు.  మహాశివరాత్రి  పర్వదినాన  విధులు నిర్వహిస్తున్న  సిబ్బంది  తన బంధువులు,  తెలిసిన వారిని పంపడం వంటివి మానుకోవాలని,  సామాన్య భక్తులకు  సౌకర్యాలు కల్పించి పది కాలాల  పాటు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా వున్నాయని చెప్పుకునే విధంగా సేవా కార్యక్రమాలు  నిర్వహించాలని తెలిపారు.  లింగోద్భవ దర్శనంలో తోపులాట జరగకుండా చూడాలని, గుడిలో నుండి  బయటకు వచ్చే  భక్తులకు ప్రత్యెక ద్వారంపై దృష్టి త్వరగా బయటకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు వుండాలని సూచించారు.
 
 
 
అడిషనల్ ఎస్ పి సుప్రజ మాట్లాడుతూ  మాడ వీధుల్లో  గుడిలో వున్న 260 సి సి కెమెరాలతో పాటు అదనంగా  మరో 60 ఏర్పాటు, మెగా కంట్రోల్  రూమ్ కు అనుసంధానం , కాల్ సెంటర్ ఏర్పాటు వంటివి  చేపట్టనున్నామని, శాంతి భద్రతల విషయం లో సిబ్బంది, అధికారులు సమన్వయము తో పని చేస్తారని తెలిపారు.  తిరువీధుల్లో ఉత్సవాల ఊరేగింపు సమయంలో హారతి ఇవ్వడానికి ప్రత్యేక స్థలాల గుర్తింపు చేయ గలిగితే ట్రాఫిక్ తగ్గుతుందనిసూచించారు . తిరుపతి ఆర్ డి ఓ కనకనరసారెడ్డి మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు, శాంతి భద్రతలు  ప్రధానమని అన్నారు.  శానిటేషన్ విషయం లో మెరుగ్గా వుండాలని, అవసరమైన పరికరాలు, వస్తువులు కావాల్సినవి తెలియజేస్తే  జిల్లా కలెక్టర్  వారి దృష్టి లో వుంచి  ఏర్పాటు చేస్తామని సూచించారు.  నిరంతరం  విద్యుత్ వుండేలా  విద్యుత్ శాఖ, ఫైర్ సేఫ్టీ కి సంబంధించి  అగ్ని మాపక అధికారులు అప్రమత్తంగా వుండాలని అన్నారు.  ఐ సి డి ఎస్  ప్రధానం గా బాల్య వివాహాలు  జరగకుండా, ఉత్సవాలలో  చిన్న పిల్లలు తప్పిపోకుండా  చూసేందుకు సిబ్బందికి విధులు కేటాయించాలని సూచించారు.
 
 
ఇ ఓ  పెద్దిరాజు మాట్లాడుతూ ఈ నెల 24నుండి మార్చి 9 వరకు  జరిగే ఉత్సవాల ఏర్పాట్ల పై, నిర్వహణ విధానం  వివరించారు.   గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న విదంగా నే మహాలఘు  దర్శనం ఏర్పాటు ఉంటుందని,  ఉచిత దర్శనం  రంగుల గోపురం నుండి, స్థానికులకు  ఇచ్చే 200/- దర్శనం,  రూ. 50/- ల దర్శనం  శివయ్య గోపురం నుండి రూ. 500/- టోకెన్  దర్శనం  సంపద మండపం నుండి  ప్రవేశం ఉంటుందని వివరించారు.   పార్కింగ్  స్థలాలు  మార్కెట్ యార్డ్ , ఎ పి సీడ్స్ , నారాయణ స్కూల్ , స్కిట్ కాలేజి, కృష్ణ మందిరం వెనుక, ఎం జి ఎం  లాండ్స్ లో ఏర్పాటు  వుంటుందని,  బస్టాప్ ల నుండి  స్కూల్ బస్సుల ద్వారా  భక్తులకు ఉచిత  ఏర్పాటు ఉంటుందని వివరించారు. ఉత్సవాల నిర్వహణ లో అందరూ భాగస్వాములు కాలనీ కోరారు .సమావేశంలో ఐ సి డి ఎస్   బాల్య వివాహాల నిషేధం, గుడి మల్లం  మహాశివరాత్రి  ఉత్సవాల గోడ పత్రికలను ఆవిష్క రించారు.   ఈ సమీక్ష లో  స్వామి గురుకుల్,  మునిసిపల్ కమీషనర్  బాలాజీ నాయక్ , ఇరిగేషన్ అధికారి గోపాల్, ఆర్ టి సి  డి ఎం సుబ్రహ్మణ్యం, ఐ సి డి ఎస్ పి డి  నాగపద్మజ,  సి డి పి ఓ  శాంతి దుర్గ , ఎలక్ట్రికల్  ఇ ఇ వాసు రెడ్డి, తహసిల్దార్ షేక్ జరీనా , డిప్యుటీ ఇ ఓ  కృష్ణా రెడ్డి, ఇ ఇ వెంకట నారాయణ, పోలిస్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
Tags: Festival Law Celebrations with the Cooperation of All – Rice Madhusudana Reddy

Natyam ad