కందిపోతున్న అన్నదాతలు (కృష్ణాజిల్లా)

Date:19/06/2018
తిరువూరు  ముచ్చట్లు:
ప్రభుత్వ మద్దతు ధర పొందాలనే గంపెడు ఆశలతో కొనుగోలు కేంద్రాల్లో కందులు విక్రయించిన రైతులు నగదు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. పంట ఉత్పత్తి విక్రయించిన రెండు, మూడు రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తామని చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు కోసం నాలుగు నెలలుగా నిరీక్షిస్తూ చెప్పులరిగేలా కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఎప్పుడు అడిగినా రేపుమాపంటూ సమాధానంతో కాలం వెళ్లదీస్తున్నారు. స్పష్టమైన సమాధానం చెప్పేవారే లేకపోవటంతో రైతులు కన్పించిన ప్రతి ఒక్కరికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావటంతో విత్తనాలు, ఎరువులు, దుక్కులు వంటి వాటికి అవసరమైన పెట్టుబడులకు చేతిలో చిల్లగవ్వ చేతిలో లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ఈ ఏడాది 45 వేల టన్నుల కందుల సేకరణకు మాత్రమే కేంద్రం అనుమతి ఇవ్వడం రైతులను ఆందోళనకు గురిచేసింది. రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర సర్కారు అదనంగా మరో 55 వేల టన్నులు కొనుగోలుకు అనుమతి కోరుతూ లేఖ రాసినా కేంద్రం అంగీకరించలేదు. దిగుబడి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 55 వేల టన్నుల సేకరణకు అనుమతించింది. కందుల సేకరణ బాధ్యతను మార్క్‌ఫెడ్‌, నాఫెడ్‌కు అప్పగించారు. సేకరణ ప్రక్రియ ముగిసే నాటికి మార్క్‌ఫెడ్‌ రూ.527 కోట్ల విలువైన 96,774 మెట్రిక్‌ టన్నులు, నాఫెడ్‌ రూ.303 కోట్ల విలువైన 55,616 మెట్రిక్‌ టన్నుల కందులను సేకరించాయి.
నాఫెడ్‌ సేకరించిన కందులకు పూర్తిస్థాయిలో నగదు చెల్లించగా, మార్క్‌ఫెడ్‌ అప్పురూపంలో తీసుకున్న రూ.200 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేసింది. ప్రభుత్వం నుంచి రూ.300 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంది. రైతుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఇటీవల మార్క్‌ఫెడ్‌ అధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మొదటి విడతగా రూ.250 కోట్లు సర్దుబాటు చేసి, మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులోపు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బహిరంగ మార్కెట్‌లో దళారులు, వ్యాపారుల నుంచి కాపాడుతూ రైతులకు మద్దత ధరలు కల్పించటానికి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఐదు కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరిలో మహాశివరాత్రి పర్వదినం అనంతరం ఎ.కొండూరు, గంపలగూడెం, జగ్గయ్యపేట, కంకిపాడు, పెద్దాపురంలో విడతల వారీగా ప్రారంభించారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో వెయ్యి క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వింటాకు రూ. రూ.5,450 మద్దతు ధర ప్రకటిస్తూ మొదట జిల్లా వ్యాప్తంగా 500 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. జిల్లాలో రెండు వేల హెక్టార్లలో కంది పంట సాగుచేయగా వెయ్యి మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
మొదట కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తిని విక్రయించటానికి నిబంధనలు అవరోధంగా మారడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనలను సడలించింది. రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు పండించిన పంట ఉత్పత్తిని పూర్తిస్థాయిలో సేకరించారు. సకాలంలో నగదు చెల్లింపులను మాత్రం విస్మరించారు.
Tags:Flaming elder brothers (Krishna Ganesla)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *