Folklore with folklore!

జానపదంతోనే జాతి వెలుగులు!

Date: 14/12/2017

తెలంగాణ ముచ్చట్లు:

ప్రపంచ దేశాలతో పోటీపడి జానపద కళల్లో పరిశోధన జరుగాల్సిన అవసరం ఉంది. పరిశోధన, పరికల్పనలు, ప్రదర్శనా నిర్వహణలు కళలను ఉచ్ఛస్థితికి చేర్చగలిగిన ఆయుధాలు. కళా ప్రదర్శనలతో పాటు నిరంతర సాధన, పరిశోధనలతో తెలంగాణ ప్రపంచంలోనే కళాకేంద్రంగా కీర్తి పొందే దిశగా అడుగులు వేయాలి. కళారూపాలన్నింటికీ ప్రభుత్వం ఇతోధికంగా సాయమందించి ఆదరించాలి. ప్రపంచ జానపద దినోత్సవ సంబురాల్లో తెలంగాణ పతాకం వినీలాకాశంలో రెపరెపలాడాలి. జనానామ్ పదమ్ నపదమ్ జనులు నివసించే చోటునే జనపదం అంటారు. జనపదం అంటే పల్లెటూరు. జనపదంలో ఉండేవాళ్ళే జానపదు లు. జానపదం అనే పదానికి పండిత, పామరులు ఎన్నో రకా ల అర్థాలను సూచించారు. 19వ శతాబ్దానికి చెందిన విద్వాంసులు జానపదులంటే విద్యా విహీనులైన కర్షకులనీ, గ్రామీణులని అభిప్రాయపడ్డారు. అరణ్య జీవనస్థితి, అనాగరికస్థితి, నాగరిక స్థితి అనే మూడు దశల్లో జానపదులు అనాగరికస్థితికి చెందినవారని వారి అభిప్రాయం. అమెరికాకు చెందిన ఆధునిక ప్రసిద్ధ జానపద విద్వాంసుడు అలెన్‌డెండస్ జానపదానికి ప్రత్యేక నిర్వచనాన్ని ఇచ్చాడు. అతని ప్రకారం, జానపదులంటే ఏ ఒక్క విషయంలోనైనా భాగస్వామ్యం కలిగిన జన సముదాయం. వీళ్లు ఒకే భాషకు సంబంధించినవాళ్లు కావచ్చు, ఒకే ప్రదేశంలో నివసిస్తున్నవాళ్లు కావచ్చు. ఒకే జాతికి, మతానికి, వృత్తికి సంబంధించినవాళ్లు కావ చ్చు. కానీ, జనసముదాయం తమదేనని చెప్పుకోదగిన కొన్ని సంప్రదాయాలు కలిగి ఉండాలి. ఈ ఆధునిక నిర్వచనాన్ని అనుసరిస్తే జానపదులంటే సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గిరిజనులైనా, గ్రామీణులైనా, నగరవాసులైనా జానపదులే అవుతారని భావించవచ్చు. పాశ్చాత్య జానపద విద్వాంసులు జానపదం అనే పదానికి సమానార్థంగా ‘ఫోక్’ అనే పదాన్ని సూచించారు. ఈ ఫోక్ అనే పదాన్ని మొదటిసారి 1846లో బ్రిటిష్ రచయిత అయిన విలియం జాన్ థామ్స్ సూచించారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి ఆయా దేశ, కాల, భాషలకు అనుగుణంగా జానపద సంస్కృతి వెలసింది. ఈ సంస్కృతి మొత్తాన్ని జానపద విజ్ఞానం తనలో ఇముడ్చుకున్నది. ఈ విజ్ఞానాన్నంతా సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా అమెరికాకు చెందిన జానపద విద్వాంసుడు రిచార్డ ఎం. దర్శన్ జానపద విజ్ఞానాన్ని నాలుగు భాగాలుగా వర్గీకరించా డు. అవి: (1) మౌఖిక జానపద విజ్ఞానం: ఈ విభాగంలో జానపద గేయాలు, కథా గేయాలు, జానపద పురాణాలు, ఐతిహ్యాలు, గద్య కథలు, సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు, తిట్లు, ఒట్లు మొదలైనవి ఉంటాయి. (2)సాంఘిక జానపద ఆచారాలు: పుట్టుక, వికాసం, మరణం మొదలైనవాటికి చెందిన ఆచారాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, పండుగలు, వినోదాలు, ఆటలు, జానపద వైద్యం, మతం, నమ్మకం మొదలైనవి ఈ విభాగానికి చెందుతాయి. (3) వస్తు సంస్కృతి: భౌతిక జీవనానికి సంబంధించిన అన్ని వస్తువులు ఈ వర్గానికి చెందుతాయి. చిత్రం, శిల్పం, వాస్తు, వృత్తులు, దుస్తులు, పరికరాలు, అలంకరణ, ఆభరణాలు, ఆహార, పూజా సామాగ్రి మొదలైనవి. (4) జానపద కళలు : గాత్ర సంగీతం, వాద్య సంగీతం, నృత్యం, నాటకం మొదలైన ప్రదర్శన కళలన్నీ ఈ విభాగానికి చెందినవి. ఈ వర్గీకరణలోని ప్రతి విభాగం మనిషి జీవితాన్ని పెనవేసుకొని ఉన్నాయి. ఏ దేశమైనా, ప్రాంతమైనా, ఎలాంటి వేష భాషలైనా అక్కడి ప్రజల జీవన విధానానికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. అదేవిధంగా జానపదం తెలంగాణ ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగం. ఇక్కడి ప్రజల వేషభాషలు, ఆశలు, ఆశయాలు, ఆలోచనాసరళి అన్నీ తనలో అంతర్లీనం చేసుకొని అభివ్యక్తం చేస్తుంది జానపదం. కాకతీయుల కాలం నుంచి నేటివరకు ఆయా కాలమాన పరిస్థితులకు నిదర్శనాలుగా నిలిచి తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక పాత్రను పోషించాయి జానపద కళారూపాలు. జానపద కళాకారులు తమ ఆటపాటలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు. తమ ప్రదర్శనల ద్వారా తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని, అణచివేతను సామాన్య ప్రజానీకానికి చేరవేసి ఉద్యమానికి కళా సారథ్యాన్ని వహించారు. ధూం ధాం పాటలు, ఉద్యమ గీతాలు, ఒగ్గు విన్యాసాలు, చిందు నాటకాలు, బోనాల జాతరలు, బతుకమ్మ ఆటలు, డప్పుచప్పుళ్లు, పగటి వేషాలు ఇలా ప్రతీ కళారూపం ఉద్యమంలో ప్రాతినిధ్యం వహించి తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసి కళా ప్రాముఖ్యా న్ని, వైభవాన్ని చాటి తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్రను పోషించాయి. జనం మధ్య నుంచి పుట్టాయి కాబట్టే ఈ కళారూపాలు ఇంత శక్తిమంతమైనవిగా రూపుదిద్దుకున్నాయి. ఏ రాజ్యంలో కళాపోషణ జరుగుతుందో అక్కడ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని అంటారు. అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేడు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందంటే ప్రభుత్వం జానపద కళారూపాలకు పూర్వవైభవాన్ని కల్పించడమే ముఖ్య కారణమని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా నేడు జానపద కళాపోషణ జరుగుతున్నది. పూర్వం గడీలకే పరిమితమైన బతుకమ్మ నేడు వాడవాడలా పూవై పూసి బంధువై నిలుస్తున్నది. గోల్కొం డ, లష్కర్, లాల్‌దర్వాజాలకే పరిమితమైన బోనాలు అశేష జనాదరణ పొందుతున్నాయి. కురుమల సంప్రదాయ విశేషంగా ఒరవడి పొందిన ఒగ్గుడోలు ఒక ఊపు ఊగుతోంది. కుల ప్రదర్శనకే పరిమితమైన చిందు నాటకం సకల జనాకర్షణీయంగా రూపుదిద్దుకున్నది. డప్పుచప్పుళ్లు లేని కార్యక్రమం కనుమరుగైపోయింది. జానపద గీతాలు సాంస్కృతిక సారథ్యం వహిస్తున్నాయి. కళాకారులు కళాప్రదర్శనలో నిమగ్నమై ఉన్నారు. అయితే కళలకు ఎల్లలు లేవు. మన కళ మనవరకే పరిమితం కాకుండా ఖండాంతరాలుగా వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ దేశాలతో పోటీపడి జానపద కళల్లో పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. పరిశోధన, పరికల్పనలు, ప్రదర్శనా నిర్వహణలు కళలను ఉచ్ఛస్థితికి చేర్చగలిగిన ఆయుధాలు. కళా ప్రదర్శనలతో పాటు నిరంతర సాధన, పరిశోధనలతో తెలంగాణ ప్రపంచంలోనే కళాకేంద్రంగా కీర్తి పొందే దిశగా అడుగులు వేయాలి. కళారూపాలన్నింటికీ ప్రభుత్వం ఇతోధికంగా సాయ మందించి ఆదరించాలి. ప్రపంచ జానపద దినోత్సవ సంబురాల్లో తెలంగాణ పతాకం వినీలాకాశంలో రెపరెపలాడాలి.

Tag: Folklore with folklore!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *