Former boxer as taxi driver

ట్యాక్సీ డ్రైవర్‌గా మాజీ బాక్సర్

Date:10/01/2018

పంజాబ్ ముచ్చట్లు:

ఐదు సార్లు జాతీయ ఛాంపియన్‌షిప్, ఏషియన్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్, మాజీ సైనికుడు అయిన బాక్సర్ లక్ష్యసింగ్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయాల్సిన ఈ మాజీ బాక్సర్ పొట్టకూటీ కోసం స్టీరింగ్ పట్టాడు. అదీ నెలకు రూ. 8 వేల వేతనంపై. తన ఆర్థిక పరిస్థితి గురించి బాక్సింగ్ ఫెడరేషన్‌కు అదేవిధంగా పంజాబ్ ప్రభుత్వానికి పలుమార్లు లేఖ రాసినట్లు తెలిపాడు. కానీ ఇంతవరకు అటువైపు నుంచి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన లక్ష్యసింగ్ 1984లో తన 19 ఏళ్ల వయస్సులో ఇండియన్ ఆర్మీలో జవానుగా చేరాడు. 1994లో తెహ్రాన్‌లో జరిగిన ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ గెలుపొందాడు.ఇదే క్రమంలోనే మరుసటి ఏడాది తాష్కెంట్‌లో జరిగిన ఛాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. కాగా 1998 సమయంలో సింగ్ జీవితం పెద్ద కుదుపునకు గురైంది. ఇతనితో పాటు మరో బాక్సర్ దేవేంద్ర తప్పా వరల్డ్ మిలటరీ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ జంట టెక్సాస్ ఎయిర్‌పోర్టులో కనిపించకుండా పోయారు.దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆర్మీ వీరిని బహిష్కరించింది. దీనిపై లక్ష్యసింగ్ స్పందిస్తూ.. తాను చేసిన పొరపాటు ఒక్కటేనన్నారు. ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్న సమయంలో టెక్సాస్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి తనను మోసగించి బయటకు తీసుకువెళ్లినట్లు చెప్పాడు.దీనిపై ప్రభుత్వానికి, ఆర్మీకి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తన విజ్ఞాపనలు పట్టించుకోకుండా బహిష్కరించినట్లు పేర్కొన్నాడు. తన సేవలను గుర్తించి, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తనను ఆదుకోవాల్సిందిగా ఈ మాజీ ఛాంపియన్ కోరుతున్నాడు.

Tags : Former boxer as taxi driver

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *