కండక్టర్‌ నుంచి ‘కాలా’ రజనీ వరకూ..

ఈనాడు.

Date : 31/12/2017

ఇంటర్నెట్‌డెస్క్‌:

వెండితెరపై ఆయనది చెరగని ముద్ర. ఆయన స్టైల్‌గా నడిచి వచ్చినా చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఆన్‌స్క్రీన్‌పై సూపర్‌స్టార్‌ అయిన రజనీకాంత్‌ ఒక్కసారి పేకప్‌ చెప్పి.. మేకప్‌ తీసేస్తే అతి సామాన్యుడు. ఎందుకంటే ‘నిజ జీవితంలో నటించడానికి నాకెవరూ డబ్బులు ఇవ్వరుగా..’ అంటూ నవ్వుతూ చెబుతారు. గత కొద్దికాలంగా తమిళ రాజకీయాలలోనే కాదు.. యావత్‌ దేశ రాజకీయాల్లో కూడా రజనీ రాజకీయ ప్రవేశం గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అని అడిగినప్పుడల్లా ఆయన చెప్పే సమాధానం.. ‘దేవుడు శాసిస్తే..’ అంటూ చేతులు ఆకాశానికి చూపుతుండేవారు. కానీ 2017 చివరి రోజు తన రాజకీయ రంగ ప్రవేశం గురించి స్పష్టత ఇచ్చి అందరి అనుమానాలనూ పటాపంచలు చేశారు. ‘దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తా. 234 స్థానాల్లోనూ పోటీ చేస్తా. డబ్బు, పదవి ఆశతో మాత్రం రాజకీయాల్లో నేను రావడం లేదు’ అంటూ అభిమానులతో ఆదివారం జరిగిన సమావేశంలో వెల్లడించారు. అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి రజనీ.. అశేషంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదంతా కేవలం ఒక్కరోజులో వచ్చింది కాదు.. ఎన్నో ఏళ్ల శ్రమ, కృషి ఫలితం..

రజనీకాంత్‌ 1950 డిసెంబరు 12న జన్మించారు. ఆయన పూర్తి పేరు శివాజీ రావ్‌ గైక్వాడ్‌ తల్లిదండ్రులు మహారాష్ట్రకు చెందిన వారు. తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌. బెంగళూరులో నివసించేవారు. శివాజీ ఐదేళ్ల ప్రాయంలో తల్లిని పోగొట్టుకున్నారు. అక్కడి నుంచి కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది. అదే సమయంలో శివాజీ పలు ఉద్యోగాలు చేశారు. చివరకు కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో కండక్టర్‌గా ఉద్యోగం చేశారు. అదే ఆయన కెరీర్‌కు మలుపు తిప్పడానికి తొలిమెట్టు అయింది. బస్సు కండెక్టర్‌గా శివాజీ టికెట్లు ఇచ్చే విధానం.. ప్రయాణికులను పలకరించే తీరు అందరినీ ఆకట్టుకునేవి. శివాజీ కండక్టర్‌గా ఉన్న బస్సు ఎక్కేందుకు ప్రయాణీకులు ఆసక్తి చూపేవారంటే అతిశయోక్తి కాదేమో. టికెట్లు కట్‌ చేయటం.. చిల్లర ఇవ్వడం.. విజిల్‌ వేయడం ఏదైనా సరే శివాజీ స్టైల్‌గా చేసేవారు. అదే సమయంలో అప్పుడప్పుడూ నాటకాలు వేస్తూ ఉండేవారు. ఒకసారి దుర్యోధనుడి పాత్రలో శివాజీని చూసిన ఆయన స్నేహితుడు మంత్రముగ్ధుడైపోయాడు. శివాజీ ఇక్కడ ఉండాల్సి వాడు కాదంటూ సినిమాల్లో ప్రయత్నించమని, గొప్ప నటుడివి అవుతావంటూ డబ్బులిచ్చి మరీ మద్రాసు పంపారు. అలా మద్రాసు చేరిన శివాజీ మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటనకు మెరుగులు దిద్దుకున్నారు.

శివాజీ నుంచి రజనీకాంత్‌గా…
ఓ స్టేజ్‌పై శివాజీ నటనను చూసిన దర్శకుడు కె.బాలచందర్‌ ‘అపూర్వరాగంగళ్‌’ చిత్రంలో తొలి అవకాశం ఇవ్వడమే కాదు.. మరో మూడు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు శివాజీగా ఉన్న పేరును రజనీకాంత్‌గా మార్చారు బాల చందర్‌. తొలినాళ్లలో ప్రతినాయకుడిగా రజనీ స్టైల్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. అక్కడి నుంచి కథానాయకుడిగా ఎదిగి, భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు. ‘దళపతి’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహా’, ‘శివాజీ’, ‘రోబో’ చిత్రాలు రజనీని అంతర్జాతీయ నటుడిని చేశాయి.

96 నుంచి రాజకీయాల్లో కీలకశక్తిగా..
రజనీకాంత్‌ ఇప్పుడేమీ కొత్తగా రాజకీయాల్లో రాలేదు. అదే విషయాన్ని రజనీ కూడా చెప్పారు.. తాను 1996లోనే రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో ఆయన చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ‘జయలలిత సీఎం అయితే తమిళనాడు రాష్ట్రాన్ని దేవుడు కూడా రక్షించలేడు’ అంటూ ఆయన చేసిన ప్రకటన పెను సంచలనం సృష్టించింది. డీఎంకే-జీకే మూపనార్‌ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ కలిసి ఆ నాటి ఎన్నికల్లో పోటీ చేసి, భారీ మెజార్టీని సొంతం చేసుకున్నాయి. అయితే ఆ తర్వాత రజనీ అంతగా ప్రభావం చూపలేకపోయారు. 1998 ఎన్నికల్లో రజనీ భాజపా మద్దతుగా నిలిచారు.అయితే బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు గానూ డీఎంకే-భాజపా కూటమి 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అనంతరం ఏ పార్టీకి మద్దతు ప్రకటించకుండా మౌనంగా ఉండిపోయారు. ఆయనను తమ వైపునకు తిప్పుకునేందుకు భాజపా, కాంగ్రెస్‌లు తీవ్రంగా కృషి చేసినా లాభం లేకపోయింది.

ఇప్పుడు రజనీకాంత్‌ రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీని స్థాపిస్తానని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లోనూ పోటీ చేస్తానన్నారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 150 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆమె మరణాంతరం అనేక అనూహ్య పరిణామాల నేపథ్యంలో పన్నీర్‌సెల్వం.. ఆ తర్వాత ఇప్పుడు కె.పళనిస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మళ్లీ 2021లో రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సుమారు మూడేళ్ల సమయం ఉంది. మరి రజనీ ప్రభావం ఏ మేర ఉంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. చూద్దాం! ప్రస్తుతానికి ‘దేవుడు శాసించాడు.. రజనీ పాటించాడు’.

సరైన సమయమిదే..
రజనీకాంత్‌ తమిళరాజకీయాల్లో ప్రవేశించడానికి ప్రస్తుతం సమయం సరైనదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జయలలిత కన్నుమూసిన అనంతరం అన్నాడీఎంకేలో అంతటి ప్రజాకర్షకణ గల నేత ఎవరూ లేరు.అదే సమయంలో డీఎంకే అగ్రనేత కరుణానిధి వయోభారంతో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారు. ఆయన కుమారుడు స్టాలిన్‌ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో శశికళ మేనల్లుడు దినకరన్‌ స్వతంత్ర అభ్యర్థిగా భారీ విజయం సాధించడంతో రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ సమయంలో నిజాయితీపరుడిగా పేరొందిన రజనీకాంత్‌ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా ద్రవిడ రాజ‌కీయాల పునర్‌వైభవం వైపు పయనించే అవకాశముందని ఆయన అభిమానులు ఆశాభావంతో ఉన్నారు.

Tags ; From the conductor to ‘Kala’ Rajani ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *