మహాకూటమి దిశగా అడుగులు

Date:16/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ర్టాలలో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల విజయం మరోసారి మహాకూటమిపై చర్చకు తెరతీసింది. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన సమాజ్‌వాది పార్టీ ఏడాది తిరగకుండానే లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు నమోదు చేయడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని ఓడించేందుకు మహాకూటమి ఏర్పడవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇందుకు అనుగుణంగానే యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బుధవారం రాత్రి నుంచి వివిధ పార్టీల నేతల మధ్య సంప్రదింపులు, చర్చలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఇందుకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు మహా కూటమి ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీల్లో నైతిక స్థయిర్యాన్ని కల్పించాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ఎంపీ మజీద్ మెమన్ పేర్కొన్నారు. మహాకూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఇప్పటికే చర్చలు ప్రారంభించారని ఆయన వెల్లడించారు. యూపీ, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శరద్‌పవార్‌తో మాట్లాడారు. ఈ నెల 28న రాహుల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఢిల్లీలో భేటీ కానున్నారు. మహాకూటమి వాస్తవ రూపం దాల్చుతున్నది అని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. బీఎస్పీ మద్దతుతో ఎస్పీ అభ్యర్థులు విజయాలు సాధించడాన్ని ఆయన గుర్తుచేస్తూ మహాకూటమి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడుతాయో యూపీలో స్పష్టమైందని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఇటీవల ఢిల్లీలో ఇచ్చిన విందుకు ఎన్సీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటు కోసమే ఆ విందు నిర్వహించినట్టు తెలుస్తున్నది. యూపీ, బీహార్ ఫలితాలు భావసారూప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమయ్యేలా ప్రభావం చూపుతాయని సీపీఐ నాయకుడు డీ రాజా అన్నారు. అయితే మహాకూటమిపై సాగుతున్న చర్చల గురించి సమాజ్‌వాదీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ మాత్రం వేచి చూడండి అని అన్నారు. ఈ ఫలితాలపై తమ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని, వారు సంతృప్తి పడితే మరిన్ని ఓట్లు పడుతాయని చెప్పారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని రాహుల్‌గాంధీ గురువారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాన్షీరాం గొప్ప సామాజిక సంస్కర్త అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండటం, యూపీలో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ విజయం సాధించిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆయన స్నేహ హస్తం అందించేవిగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మద్దతుతో రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఇక ముందు కూడా ఆ పొత్తును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతాన్ని మరచిపోవాలని, బీఎస్పీతో తమ సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నది. బద్దవిరోధులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు బీజేపీని ఓడించేందుకు ఈ ఎన్నికల్లో చేతులు కలిపాయి. గోరఖ్‌పూర్ సీటును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫూల్పూర్ నియోజకవర్గాన్ని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేయడంతో ఆ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన వెంటనే రెండు పార్టీల కార్యకర్తలు మాయావతి, అఖిలేశ్‌ను ఉద్దేశించి బువా భతీజా (మేనత్త, మేనల్లుడు) జిందాబాద్ అని నినాదాలు చేయడం రానున్న రోజుల్లో ఎస్పీ, బీఎస్పీల స్నేహం మరింత బలపడనుందనడానికి సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్పీ మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని గ్రహించిన అఖిలేశ్ యాదవ్ ఫలితాలు వెలువడిన వెంటనే బుధవారం సాయంత్రం స్వయంగా మాయావతి ఇంటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఇక కాంగ్రెస్‌తో తమ సంబంధాలు ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నాయని అఖిలేశ్ పేర్కొన్నారు. రాహుల్, తాను యువకులమని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు తామిద్దరం కలిసి పరిష్కారాలు వెతుకాల్సి ఉంటుందని చెప్పారు. యూపీ, బీహార్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. అహంకారం, అసహనం, అతి విశ్వాసం వల్లనే బీజేపీ ఓటమిపాలైందని ఆయన పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. అహంకారం, అసహనం, అతి విశ్వాసం ప్రజాస్వామిక రాజకీయాలను ఖూనీ చేస్తాయని నేను పదే పదే చెప్తూనే ఉన్నాను. అవి ట్రంప్‌లో ఉన్నా లేక మిత్రపక్షాలు లేదా ప్రతిపక్ష పార్టీలలో ఉన్నా నష్టమే అంటూ శత్రుఘ్న ట్వీట్ చేశారు.
Tags: Fronts towards the marshmallow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *