నిధులు ఫుల్… జోష్ గా పేట వాసులు

Date:19/06/2018
నల్గొండ ముచ్చట్లు:
సూర్యాపేటకు నిధుల వరద పారుతోంది. వివిధ అభివృద్ధి పనుల కోసం కేవలం ఎనిమిది నెలల్లోనే రూ.849 కోట్లు విడుదల కాగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ.485కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాలకు అనుమతులు లభించగా సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.75 కోట్లు, తండాలు, గ్రామ పంచాయతీలకు రూ.10,15 కోట్ల చొప్పున విడుదలయ్యాయి. అలాగే మూసీ కాల్వల ఆధునీకరణకు రూ.65 కోట్లతో పనులు చేపడుతుండగా గత వారం రోజుల్లో మూసీ, ఏపూరు వాగులపై రూ.120 కోట్లతో చెక్‌డ్యాంలు, పుల్లారెడ్డి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.17.58 కోట్లతో చివరి జీఓ వెలువడింది.. కేవలం సూర్యాపేట మున్సిపాలిటీయే కాకుండా నియోజకవర్గ పరిస్థితి కూడా అలాగే ఉంది. అలాంటి ఈ నియోజకవర్గానికి గత నాలుగేళ్లుగా నిధుల వరద పారుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఏదైతే జరుగుతుందని అంతా భావించారో అది కళ్లకు కట్టినట్లుగా సూర్యాపేట ప్రజలకు కనిపిస్తుంది. సూర్యాపేట నుంచి గెలుపొంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగదీష్‌రెడ్డి గత నాలుగేళ్లల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం నియోజకవర్గంలో దాదాపు రూ.2500 కోట్లకుపైనే ఖర్చు చేశానని, దీనిని కాదని చెప్పే దమ్ము ఎవరికైనా ఉంటే తాను కాదు జిల్లా అధికారులే లెక్కలతో సహా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ విసిరిన విషయం విదితమే. ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉద్యమం నాటి నుంచి ఉన్న అనుబంధంతో ఎన్నివేల కోట్లు అయినా తీసుకురాగలుగుతున్నారని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఉదాహరణే గత అక్టోబర్‌లో సూర్యాపేట జిల్లా నూతన కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన నిమిత్తం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ఆరు హామీలు ఇచ్చి అన్నింటికీ నిధులు విడుదల చేయించడం.సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కేవలం ఎనిమిది నెలల్లోనే ఆరు పనుల కోసం రూ.849 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, తండాలకు రూ.15, 10లక్షల చొప్పున మంజూరు చేయగా నేడు అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయలు కల్పిస్తున్నారు. మిగిలిన హామీల్లో సూర్యాపేటకు మెడికల్ కళాశాలను మంజూరు చేయగా రూ.485 కోట్లతో పూర్తి చేసేందుకు రాష్ట్ర పరిధిలో అన్ని అనుమతులూ రాగా ప్రస్తుతం భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. సూర్యాపేట మున్సిపాలిటీలో మౌలిక సదుపాయల కల్పన కోసం ఇచ్చిన హామీ మేరకు రూ.75 కోట్లు విడుదలవగా రోడ్లు, మురికి కాల్వలు, పార్కులు ఇతరత్రా పనులు జరుగుతున్నాయి. రూ.65 కోట్లతో మూసీ కాల్వల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటితో పాటు తాజాగా కేవలం వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి ఇచ్చిన చివరి రెండు హామీలు కార్యరూపం దాల్చుతున్నాయి. రూ.120 కోట్ల వ్యయంతో మూసీ, ఏపూరు వాగులపై 19 చెక్‌డ్యాంల నిర్మాణానికి జీఓ విడుదల కాగా, సూర్యాపేట మున్సిపాలిటీలోని పుల్లారెడ్డి చెరువును రూ.17.58 కోట్లతో మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ఈ నెల 5న చివరి జీఓ విడుదలైంది.
Tags:Funds full … Josh as Pat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *