Natyam ad

ఎక్కడ చూసినా చెత్తే

పారిశుద్ధ్య పనులు షురూ చేసిన సిబ్బంది
 
వరంగల్ ముచ్చట్లు:
 
సమ్మక్క సారలమ్మ జాతర ముగియడంతో మేడారం ఖాళీ అయ్యింది. నాలుగు రోజుల పాటు గుడారాలు వేసుకొని అమ్మవార్ల సన్నిధిలో ఉన్న భక్తులు.. వ్యాపారస్తులు ఇంటిముఖం పట్టారు. షాపులన్నీ ఖాళీ చేసుకొని వెళ్లిపోతున్నారు. నిన్నటిదాకా జనసంద్రంగా ఉన్న మేడారం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. వనదేవతలు గద్దెలపై లేకపోయినప్పటికీ ఆదివారం సైతం భక్తులు అమ్మలను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించారు. వచ్చే బుధవారం నిర్వహించే తిరుగువారం పండగ వరకు ప్రతిరోజు భక్తులు మేడారం వచ్చి తల్లులకు మొక్కులు చెల్లిస్తారని దేవాదాయ శాఖ ఆఫీసర్లు, గిరిజన పూజారులు చెబుతున్నారు. రోజులపాటు జరిగిన జాతరలో 60 లక్షల మంది భక్తులు వచ్చారు. ఖాళీ స్థలాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొని వంటావార్పు చేసుకున్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో భక్తులు విడిది చేసిన ప్రదేశాలలో భక్తులు ఉపయోగించిన భోజన పదార్థాలు, తినిపడేసిన వస్తువులు, కోళ్లు, మేకలు కోయగా వచ్చే వ్యర్థాలన్నీ ఎక్కడపడితే అక్కడే కన్పిస్తున్నాయి. ఈగలు, దోమలు వాలి తీవ్ర దుర్వాసన వస్తోంది. ఆరుబయట చేసిన మలమూత్ర విసర్జనలతో మేడారం పరిసరాలన్నీ దుర్గంధ భరితమయ్యాయి. చేతిపంపులు, నల్లాల చుట్టూ బురదనీరు కన్పిస్తోంది. పంచాయతీరాజ్‌‌శాఖకు చెందిన ఆఫీసర్లు మేడారంలోనే ఉండి శానిటేషన్‌ ‌వర్క్‌‌ చేయిస్తున్నారు. రాజమండ్రి ఏరియా నుంచి సుమారు 1,500 మంది వర్కర్లను మేడారం తీసుకొచ్చారు. ములుగు జిల్లా కలెక్టర్‌‌ కృష్ణ ఆదిత్య వీరికి మేడారంలోనే వసతి కల్పించారు. వీరితో పాటు మేడారంలో పనిచేయడానికి వరంగల్‌ ‌మున్సిపల్‌‌ కార్పొరేషన్‌ ‌నుంచి శానిటేషన్‌‌ వర్కర్లను రప్పిస్తున్నట్లుగా ములుగు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య చెప్పారు. ఈ నెలాఖరు వరకు శానిటేషన్‌‌ పనులు చేసి మేడారం పరిసరాలను శుభ్రం చేస్తామనివివరించారు. మేడారం మహాజాతర ముగియడంతో ఆదివారం పోలీస్‌‌ ఆఫీసర్లు వన్‌ ‌వే రూట్‌ ఎత్తేశారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించే భక్తుల విడిది కోసం వెంగళాపూర్‌‌ నుంచి మేడారం, కన్నెపల్లి , ఊరట్టం నుంచి మేడారం, తాడ్వాయి నుంచి మేడారం వరకు వెహికల్స్ను అనుమతించారు. మేడారం జాతరకొచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి దర్శనం కోసం గద్దెల వద్దకు నేరుగా వెళ్లారు. కొద్దిసేపు క్యూలైన్లలో ఉంటే చాలు దర్శనాలు జరిగాయి.
 
Tags: Garbage everywhere you look