ముందుకు సాగని….గ్యాస్ దీపం….

Date:13/02/2018
నల్గొండ  ముచ్చట్లు:
మూడు సంవత్సరాల క్రితం దీపం పథకానికి దరఖాస్తులు తీసుకుంటున్నా పేదలకు మాత్రం లబ్ధి అందటం లేదు. ఒకసారి రాజకీయ జోక్యం అన్నారు. తరువాత పారదర్శకత కోసం దీపం మంజూరులో మార్పులు చేర్పులు చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. గతంతో ఎంపీడీవో ద్వారా దరఖాస్తులు స్వీకరించేవారు. తాజాగా తహసీల్దార్‌లకే దీపం మంజూరు అధికారాలు ఇచ్చి దరఖాస్తులు తీసుకుని పేదలందరికి దీపం కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెలువడిన కొద్ది రోజులకే ప్రభుత్వం భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వ్యవహారం మొత్తం రెవెన్యూ శాఖదే కావటం, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావటంతో వారు ఇతర పనులను పక్కనబెట్టి అందులోనే తలమునకలయ్యారు. దీంతో దీపం పథకం ఒక్క అడుగు కూడా ముందుకు సాగ లేదు. అధికారులు మాత్రం దరఖాస్తులు తీసుకోవాలని గ్యాస్‌ ఏజెన్సీల నిర్వహకులకు సూచించారు. వారు దరఖాస్తులు తీసుకుంటున్నా వాటిని ఆన్‌లైన్‌ చేసే పని తహసీల్దార్‌ కార్యాలయంలో జరగాల్సి ఉంటుంది. వారు భ ూసర్వే వివరాలు నమోదులో బిజీగా ఉండటం వల్ల ఆ కార్యక్రమం ముందుకు సాగడం లేదు.దీపం పథకానికి ఆది నుంచి అన్ని అడ్డంకులే. మొదట ఈ పథకం విడుదల కాగానే రాజకీయ జోక్యంతో అసలు లబ్ధిదారులకు కాకుండా రాజకీయ అండదండలు ఉన్నవారికే కనెక్షన్లు మంజూరు అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా గత సార్వత్రిక ఎన్నికల ముందు హడావుడిగా లబ్ధిదారులను ఎంపిక చేసినా రాజకీయ జోక్యంతో అసలు కనెక్షన్లు మంజూరు చేయలేకపోయారు. ఆ తరువాత మంజూరు చేసిన 60 వేల   కనెక్షన్లలో 37,516 పంపిణీ చేశారు. మిగతావి పంపిణీ జరగలేదు. కరవు పరిస్థితుల నేపథ్యంలో అసలు దీపం కనెక్షన్లకు ఆ రోజుల్లో దరఖాస్తులే అందలేదు. తరువాత దీపం పథకం మరింత పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో అప్పటి వరకు ఎంపీడీవోల ద్వారా అమలైన లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను తహసీల్దార్‌లకు అప్పగించింది. దరఖాస్తులను స్వీకరించి కోటా ప్రకారం కాకుండా అర్హులందరికీ దీపం కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పేదలందరికి గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వటం వల్లనే కాలుష్య నివారణ పూర్తిస్థాయిలో జరుగుతుందని నిర్ణయించింది. 5 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించింది.ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సిబ్బంది దస్త్రాల శుద్ధీకరణలో ఉన్నారు. మార్చి 11 నుంచి పట్టాదార్‌ పాస్‌పుస్తకాల పంపిణీ¨ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాతే దీపం దరఖాస్తుల పరిశీలన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికలు, ముందస్తు ఎన్నికల ప్రక్రియనో ప్రారంభం అయితే ఇప్పట్లో దీపం పథకానికి మోక్షం లభించడం కష్టమే అన్న అభిప్రాయాలు  వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం డీలర్లు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ విషయంపై ప్రచారం లేకపోవడంతో పెద్దగా స్పందన లేదని డీలర్లు చెబుతున్నారు.
Tags: Go ahead …. gas lamp ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *