ఆ స్కోరు చూసి హోటల్‌కు వెళ్లిపోవాలనుకున్నా..

ఈనాడు.

Date :06/01/2018

కేప్‌టౌన్‌: 12/3.. భారత్‌తో శుక్రవారం జరిగిన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో ఒకానొక సమయంలో సఫారీ జట్టు స్కోరు. టెస్టుల్లో ఇలాంటి స్కోరును చూస్తే ఎవరికి మాత్రం అసంతృప్తిగా ఉండదు చెప్పండి. ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ డేల్‌ బెన్క్‌స్టెయిన్‌ కూడా ఈ స్కోరు బోర్డును చూసి తీవ్ర నిరాశ చెందాడు. దీంతో ఇక మ్యాచ్‌ చూడలేక తిరిగి బస చేసే హోటల్‌కు వెళ్లిపోదామనుకున్నాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పాడు.మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన సఫారీ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. భువనేశ్వర్‌ ధాటికి ఆ జట్టు 12పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మ్యాచ్‌ను గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఆ జట్టు కోచ్‌ డేల్‌కు ఇక అక్కడ ఉండాలనిపించలేదట. వెంటనే క్యాబ్‌ను పిలుచుకుని హోటల్‌కు తిరిగి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ చేతిలో ఫోన్‌ లేకపోవడంతో ఇక చేసేది ఏమీ లేక అక్కడే కూర్చుండిపోయాడు. ఆటగాళ్లతో పాటు సిబ్బంది మ్యాచ్‌ కోసం స్టేడియం వద్దకు చేరుకోగానే నిర్వాహకులు వారి ఫోన్లను తమ ఆధీనంలోకి  తీసుకుంటారన్న విషయం తెలిసిందే కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *