దుగ్గరాజపట్నం పాలిటిక్స్

Date:13/02/2018
నెల్లూరు ముచ్చట్లు:
కేంద్రం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటి నుండి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య భేదాభిప్రాయాలు రోజుకో ప్రత్యేకశైలితో బహిర్గతమవుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు చూసేవారికి పార్టీలు రెండూ భాగస్వామ్య పక్షాలేనా అనే సందేహం తలెత్తేలా చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంతో జిల్లాకు చెందిన దుగరాజపట్నంలో ఏర్పాటు చేయదలచిన పోర్టు అంశం కేంద్ర బిందువుగా మారడం విశేషం. మార్చి 5వ తేదీలోగా కేంద్రం నుండి రాష్ట్రానికి సానుకూల ప్రకటనలు వెలువడుతాయని భావిస్తున్న తరుణంలో దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు గురించి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటుకు సమీపంలో ఇస్రో రాకెట్ లాంచింగ్ కేంద్రం నుండి అభ్యంతరాలు ఉన్నాయని కేంద్రం నుంచి వస్తున్న సమాచారంతో పోర్టును రామాయపట్నం తరలించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి కేంద్రం అటువంటి అభ్యంతరాలు సూచించలేదని, రాష్ట్ర ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి మద్దతుగా పోర్టును దుగరాజపట్నంలో ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటోందని జిల్లా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత రెండు నెలలుగా కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలకు వ్యతిరేకంగా, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు అనుకూలంగా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో పలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో కేంద్రం నుండి దుగరాజపట్నం పోర్టు వీలుకాదనే సమాధానం వచ్చిందని పత్రికల్లో వస్తున్న కథనాలు జిల్లా బీజేపీ నేతలను ఇరుకునపెట్టాయి. వెంటనే తేరుకున్న వారు కేంద్రం అటువంటి ప్రకటన చేయలేదని కుండబద్ధలు కొడుతున్నారు. దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వమే మోకాలడ్డుతోందని, ఇంతవరకూ డిపిఆర్ ఇవ్వలేదని, భూసేకరణ చేపట్టలేదనీ, ఇంతకన్నా నిదర్శనాలు ఏముంటాయని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కోసం, వారి లాభాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయపడుతున్నట్లుగా ఉందని వారు తీవ్ర ఆరోపణలు చేసే స్థాయికి వచ్చారు. మరి కేంద్రం నుండి అటువంటి ప్రకటన తాము చేయలేదని, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు తాము అనుకూలమనే సంకేతాలతో కూడిన ప్రకటన తమ పార్టీ జాతీయ నేతల ద్వారా ఎందుకు వెల్లడించలేకపోతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు మరో పోర్టు రావడం తమకెంతో ఆనందదాయకమని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి, పారిశ్రామికంగా మరో అడుగు ముందుకు వెళతామని, కానీ ఇస్రో చెబుతున్న అభ్యంతరాల కారణంగా కేంద్రం అక్కడ పోర్టు ఏర్పాటుకు వెనకడుగు వేస్తోందని, రామాయపట్నంలో ఏర్పాటుచేసే ఆలోచనలో ఉందంటున్నారు. రామాయపట్నం కూడా జిల్లా సరిహద్దుల్లో ఉండడంతో జిల్లాలో ఉత్తర ప్రాంతం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వారి వాదన. అయితే పోర్టు ఏర్పాటుకు రెండు నెలలుగా ఆందోళనలు చేపడుతున్న బీజేపీ నేతలు మాత్రం పోర్టును రామాయపట్నం తరలించకుండా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు కేంద్రంలోని తమ పార్టీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇరు పార్టీల నడుమ గత కొన్ని రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధాన్ని వైకాపా నేతలు వేడుకగా తిలకిస్తుండడం కొసమెరుపు.
Tags: Goodness Politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *