ఇంటర్ లో గ్రేడింగ్ ఉన్నట్టా… లేనట్టే…

Date:15/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పరీక్షల ముందు ఒక మాట, పరీక్షలు ముగిసిన తర్వాత మరో మాట అన్నచందంగా వ్యవహరిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్ పద్ధతి పాటిస్తామని చెబుతూ వస్తున్న ఇంటర్ బోర్డు తీరా ప్రయోగ పరీక్షలు ప్రారంభం అయ్యేసరికి మాట మార్చింది. వార్షిక పరీక్షల దగ్గర పడుతున్నా నేటికీ గ్రేడింగ్ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో పక్క తెలుగు అమలుకు సిద్ధం కావడంపై విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల నుండి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ భాష పదో తరగతి వరకే అమలులో ఉందని, తెలంగాణలో మాత్రం ఇంటర్ వరకూ ఎలా అమలుచేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగు అమలు విధానంలోనూ, జంబ్లింగ్ విషయంలో బోర్డు అనుసరిస్తున్న పద్ధతి దారుణమని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రాలో నిర్బంధ తెలుగు కేవలం పదో తరగతి వరకే అమలు చేస్తున్నారని, ఇంటర్‌లో దానిని అమలు చేయడం ఏ విధంగానూ సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఎవరో ఏదో నిర్ణయిస్తే దానిని నిర్బంధంగా విద్యార్థులపై రుద్దాలని చూడటం సరికాదని అన్నారు. కేరళ, పంజాబ్, కర్నాటక , బెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక భాషలు పదో తరగతి వరకూ అమలులో ఉన్నాయని, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌లలో కూడా స్థానిక భాష పదో తరగతి వరకూ అమలు చేసే వీలుందే తప్ప ఇంటర్‌లో అమలు కావడం లేదని ఆయన వివరించారు. పదో తరగతి వరకూ తెలుగు చూడని వారికి ఇంటర్‌లో అక్షరాలు నేర్పిస్తామని చెప్పడం ఎంత వరకూ సాధ్యమో ప్రభుత్వమే చెప్పాలని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష అమలుపై ప్రేమ ఉండాలే తప్ప, అమలుకు సాధ్యం కాని రీతిలో దానిని నిర్బంధం చేయడం సరికాదని అన్నారు. తెలుగు అమలు చేయడం అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంవిధానానికి మేలు చేయాలని, తెలుగును స్కోరింగ్ సబ్జెక్టుగా మార్చమని పదే పదే ప్రభుత్వం చెప్పడం కూడా విద్యార్థులను మోసగించడమేనని ఆయన పేర్కొన్నారు. అలాగే గ్రేడింగ్ విధానం కూడా ఇదిగో అదిగో అంటూ ఏళ్లు గడిపేసిందని అన్నారు.
Tags; Grading in Inter …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *