Greater plan ..

 గ్రేటర్ ప్లాన్..

Date:12/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో ఎన్నికల కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్. పట్టణ-గ్రామీణ బేధం లేకుండా మొత్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పుంజుకునేందుకు.. పార్టీని పటిష్టం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ప్రజలకు చేరువయ్యే ప్లానింగ్ పై దృష్టి సారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు గ్రేటర్ హైదరాబాద్ కూ ప్రత్యేక ప్రణాళికనే సిద్ధం చేసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రేట‌ర్ లో అధిక స్థానాలు సాదించడం తప్పనిసరి. దీంతో గ్రేటర్ శివారులో  గెలిచి తీరాల‌న్నాప‌ట్టుద‌ల‌తో అడుగులు ముందుకు వేస్తోంది. ప‌ట్టున్న ప్రాంతాల‌ను నిలుపుకునేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకున్న పార్టీ ఎంపిక చేసుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే  ప్ర‌చారాన్ని సైతం ప్రారంభించింది.
తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మ‌క అడుగులు వేస్తోంది. తెలంగాణ ఇచ్చినా గ‌త ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొంద‌లేక‌పోయింది హస్తంపార్టీ. అయితే ఈ దఫా మిస్ కాకూడదన్న పట్టుపై ఉంది. దీనికోసం నియోజ‌క వ‌ర్గాల వారిగా ప‌క్కా లెక్కతో బరిలోకి దిగాలని అనుకుంటోంది. మంచి ప‌ట్టున్న నియోజ‌క వ‌ర్గాల‌ను తిరిగి ఈ ఎన్నిక‌ల్లో కైవ‌సం చేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంది.  గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిదిలో మొత్తం ఇర‌వై నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. ఏ లెక్క‌న చూసుకున్నా ఈ నియోజ‌క‌వ‌ర్గాలు కీల‌క‌మే. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఇక్క‌డ పెద్ద‌గా ఎమ్మెల్యేల‌ను గెలుచుకోలేక‌పోయినా, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో కాంగ్రేస్ కూడా ఇక్క‌డ ఒక్క స్థానాన్ని కూడా ద‌క్కించుకోలేక‌పోయింది.
2014 నాటికి ప్రస్తుత ప‌రిస్థితికి పొంతనలేదు. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌ట్టం క‌ట్టిన గ్రేట‌ర్ ఓట‌ర్లు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్ కు అండ‌గా నిలిచారు.  నాలుగేళ్ల ముందు  గ్రేట‌ర్ లో కాంగ్రెస్ కు కూడా మంచి ప‌ట్టు ఉండేది. శేరిలింగం ప‌ల్లి, జూబ్లిహిల్స్, ఉప్ప‌ల్, ఎల్బిన‌గ‌ర్, ఖైర‌తాబాద్, ముషీరాబాద్, మేడ్చెల్, మ‌హేశ్వ‌రం వంటి నియోజ‌క‌వ‌ర్గాలు కాంగ్రెస్ ఖాతాలో ఉండేవి. కానీ తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో వ‌చ్చిన 2014ఎన్నిక‌ల్లో మాత్రం ఇక్క‌డి ఓట‌ర్లు ఆ పార్టీని పూర్తిగా తిర‌స్క‌రించారు. గ‌్రేట‌ర్ లోని మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో సెటిల‌ర్ల ప్ర‌భావం అధికంగా ఉంటుంది. వారంతా కాంగ్రేస్ ను వ్య‌తిరేకించారు. ఇక తెలంగాణ జిల్లాల నుంచి వ‌ల‌స వ‌చ్చి ఇక్క‌డ స్థిర‌ప‌డ్డ వారి సంఖ్య కూడా న‌గ‌రంలో భారీగానే ఉంటుంది.
వారంతా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఆయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీతో జ‌ట్టుక‌ట్టి హ‌స్తం పార్టీ ఈసారి ఎన్నిక‌లో బ‌రిలో నిలువ‌బోతోంది. కాంగ్రేస్ కేడ‌ర్ కు తోడు టీడీపీ ఓటు  బ్యాంక్ త‌మ‌కు షిఫ్ట్ అయితే గెలుపుత‌ధ్య‌మ‌ని లెక్క‌లు వేస్తున్నారు కాంగ్రేస్ నాయ‌కులు. అయితే ఇటీవ‌ల జ‌రిపిన స‌ర్వేల్లో న‌గ‌ర‌శివారు నియోజ‌క వ‌ర్గాల్లో కాంగ్రేస్ పార్టీ కి మంచి ఫ‌లితాలొచ్చాయ‌ట‌. అక్క‌డ దృష్టి సారిస్తే గెలువ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాద‌ని స‌ర్వే రిపోర్టులు తేల్చాయ‌ట‌. దాంతో ఇప్పుడు న‌గ‌రంలోని సీట్ల‌ను చుట్టి వ‌స్తూనే న‌గ‌ర శివారు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టింది కాంగ్రేస్.
Tags:Greater plan ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *