టెక్నాలజీతో గ్రేటర్ పాలన

Date:15/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టెక్నాలజీ వినియోగించుకుని మహానగరవాసులకు మెరుగైన పౌరసేవలను అందించటంలో దేశంలోని అన్ని స్థానిక సంస్థలకన్నా జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో వుంది. ఇప్పటికే ఎక్కడా లేనివిధంగా ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు, బర్త్, డెత్ సర్ట్ఫికెట్లను జారీచేయటంతో పాటు ప్రజల ఫిర్యాదులను సైతం ఆన్‌లైన్‌లో పరిష్కరిస్తున్న జీహెచ్‌ఎంసీ వాట్సప్‌ను ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుని అరచేతిలో పరిపాలనను కొనసాగిస్తోంది. దీంతో ఎప్పటికపుడు అభివృద్ధి పనులను పర్యవేక్షించటంతో పాటు పౌరసేవలను మరింత మెరుగ్గా ప్రజలకు అందిస్తోంది. దాదాపు 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 30 సర్కిళ్లు, ఐదు జోన్లు, 20లక్షల గృహాలున్న నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం మామూలు విషయం కాదు. కానీ జీహెచ్‌ఎంసీకి ఉన్న సిబ్బంది, ఉద్యోగులను, అలాగే జీహెచ్‌ఎంసీతో సంబంధమున్న ఎంఏయుడీ వంటి ముఖ్యమైన శాఖలను, మున్సిపల్ శాఖ మంత్రి వంటి ముఖ్యమైన, కీలకమైన శాఖలను కలుపుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు అంతర్గతంగా వందకు పైగా, ఇతర శాఖలతో సమన్వయం కోసం మరో 69 వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేసి ఎప్పటికపుడు ఉత్తర, ప్రత్యుత్తరాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వర్తించే ఏ అధికారిని గమనించినా, గంటలో కనీసం అరగంట కన్నా ఎక్కువ సమయం సెల్‌ఫోన్ వైపు చూస్తునే గడుపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలు, సలహాలతోపాటు కింది స్థాయి ఉద్యోగులకు సమాచార పరంగా కావల్సిన సహాయ సహకారాలను అందిస్తూ అధికారులు బిజీగా ఉంటున్నారు. ఈ గ్రూప్‌లలో ఆయా అంశాలవారీగా సంబంధిత కింది స్థాయి, క్షేత్ర స్తాయి అధికారుల నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ వరకు సమాచారం క్షణాల్లో వెళ్లిపోతోంది. వివిధ అంశాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు, సర్కిల్, జోనల్, కేంద్ర కార్యాలయం నుంచి అందే ఆదేశాలు ఎప్పటికపుడు కింది స్థాయి సిబ్బందికి వారు ఊహించని సమయంలో సమాచారం చేరటంతో పాటు విషయం అప్‌డేట్ కూడా అవుతోంది. ఒక్కో గ్రూప్‌కు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి సర్కిల్ స్థాయి వరకు, అలాగే క్షేత్ర స్థాయి అధికారి వరకు భాగస్వాములను చేస్తూ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. అంతేగాక, వివిధ అభివృద్ది, ప్రజావగాహన కార్యక్రమాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జీహెచ్‌ఎంసీకి నిధులను అందజేస్తున్న ఎంఎన్‌సీ, కార్పొరేట్ సంస్థలను కలుపుతూ కూడా ఓ గ్రూప్‌ను క్రియేట్ చేశారు.జీహెచ్‌ఎంసీ క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్‌లలో అత్యంత కీలకమైంది, ముఖ్యమైంది ఎంఏయూడీ గ్రూప్. ఈ గ్రూప్‌లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు, మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్, జలమండలి, హైదరాబాద్ మెట్రోరైలు, మున్సిపల్ పరిపాలన కమిషనర్ తదితర సంబంధిత విభాగాల అధికారులున్నారు. ఏదైనా ముఖ్య అంశాన్ని, ఆదేశాలను మంత్రి ఈ గ్రూప్‌లో పోస్టు చేయగానే కింది స్థాయి వరకు సమాచారం క్షణాల్లో చేరుతోంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినపుడు మంత్రి జారీచేసే అత్యవసర నిర్ణయాలు, ఆదేశాలు చాలా వరకు అధికారులకు, ప్రజలకు మేలు చేశాయనే చెప్పాలి.
Tags: Greater rule with technology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *