'Gutka' in the bedroom room

చిన్నమ్మ గదిలో ‘గుట్కా’

సాక్షి

Date :14/01/2018

రహస్య లేఖలు

కోర్టుకు సమర్పించేనా

17న పిటిషన్‌ విచారణ

సాక్షి, చెన్నై : అత్యంత రహస్యంగా పంపిణీ గుట్కా లేఖలు చిన్నమ్మ శశికళ గదిలో బయట పడడం ఆదాయ పన్ను శాఖ వర్గాల్ని విస్మయంలో పడేసింది. తమ దాడుల్లో బయట పడ్డ ఆ లేఖల్ని కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో గుట్కా, హాన్స్‌ తదితర మత్తు పదార్థాల విక్రయాలకు నిషేధం విధించిన చాప కింద నీరులా మార్కెట్లో లభిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది రెడ్‌హిల్స్‌ సమీపంలో మాదక ద్రవ్యాల నిరోధక విభాగం జరిపిన దాడులు చర్చకు దారి తీశాయి. మాధవరావు అనే వ్యక్తి వద్ద లభించిన డైరీ ఆధారంగా ఈ గుట్టుకు సహకరిస్తున్న వారి జాబితా బయట పడడం కలకలం రేపింది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఓ మంత్రి, ఐపీఎస్‌ బాసులు ఉండడంతో ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలోపడ్డాయి. అలాగే గుట్కా గుట్టు వ్యవహారం నిగ్గు తేల్చాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది.

ఈ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్‌ ముందు సాగుతూ వస్తున్నది. పిటిషన్‌ విచారణలో భాగంగా సెంట్రల్‌ ఎక్సైజ్‌ వర్గాలు తమ తరఫు నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ పరిస్థితుల్లో ఆదాయపన్ను శాఖ తరఫున సైతం కోర్టుకు ఓ నివేదిక సమర్పించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకుతగ్గ కొత్త సమాచారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ అధికారులు, పోలీసు బాసుల్లో ఆందోళన బయలుదేరి ఉండడం గమనార్హం. ఇందుకు నిదర్శనం, గతంలో రహస్యంగా ఆదాయపన్ను శాఖ పంపిన లేఖలు పోయెస్‌గార్డెన్‌లోని చిన్నమ్మ శశికళ గదిలో లభించి ఉండడమే.

ఆ లేఖలు ఇక్కడికి ఎలా వచ్చాయో..?
2016 ప్రారంభంలో తాము పంపిన లేఖలు, కొన్ని నెలల అనంతరం మాయం కావడాన్ని ఆదాయ పన్ను శాఖ తీవ్రంగానే పరిగణించింది.  ప్రభుత్వ అధికారులు ఈ లేఖలు అప్పట్లో సీఎంగా ఉన్న జయలలిత దృష్టిలో పడకుండా జాగ్రత్తలే తీసుకున్నట్టున్నాయి. ఇందుకు తగ్గ పరిణామాలు తాజాగా వెలుగులోకి రావడం చర్చకు దారి తీసింది. ఆదాయ పన్ను శాఖ వర్గాలు తరచూ పోయెస్‌ గార్డెన్‌లోని జయలలిత నివాసంలో తనిఖీలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ వేదా నిలయంలోనే చిన్నమ్మ శశికళకు ప్రత్యేక గది  ఉంది. ఇందులో తాము పంపిన రహస్య లేఖలు బయట పడడంఆదాయ పన్ను శాఖ వర్గాల్ని విస్మయంలో పడేసినట్టు సమాచారం.

ఈ లేఖలు ఇక్కడకు ఎలా వచ్చాయో, గుట్కా గుట్టు పూర్తిగా రట్టు చేయడానికి ఆ విభాగం వర్గాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈనెల 17వ తేదీన హైకోర్టులో గుట్కా కేసు విచారణకు రానున్న సమయంలో తమ తరఫున ఓ నివేదికను కోర్టు ముందు ఉంచేందుకు ఐటీ వర్గాలు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో పలువురు పోలీసు బాసులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో ఆందోళన బయలు దేరింది.

గుట్కాపై లేఖలు
గుట్కా వ్యవహారం చిలికి చిలికి అతి పెద్ద స్కాంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాది రూ. 250 కోట్ల మేరకు టర్నోవర్‌ రహస్యంగా సాగి ఉండడం ఇందుకు నిదర్శనం. ఆదాయ పన్ను శాఖ వర్గాలు ఈ గుట్కా గుట్టును 2016 ప్రారంభంలోనే తేల్చి ఉన్నారు. ఇందులో ఉన్న అధికారులు ఎవ్వరెవ్వరో వివరిస్తూ, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని రహస్య లేఖల్ని పంపారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మెహన్‌ రావు, అప్పటి డీజీపీలకు ఈ రహస్య లేఖలు పంపినట్టు సమాచారం. ఈ లేఖల్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదాయ పన్ను శాఖ సూచించింది.

ఢిల్లీలోని ఉన్నతాధికారుల నుంచి సైతం కొన్ని రహస్య సమాచారాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, ఈ లేఖలపై ఎలాంటి చర్యలు లేవని చెప్పవచ్చు. ఈ సమయంలో అమ్మ అనారోగ్యం బారిన పడడంతో ఆ లేఖ వ్యవహారం కాస్త తెర మరుగు అయిందని చెప్పవచ్చు. ఈ కాలంలో పలుమార్లు ఆదాయ పన్ను శాఖ నుంచి ప్రభుత్వ అధికారులకు సంకేతాలు వచ్చినా, లేఖలు కన్పించడం లేదన్నట్టు సమాధానాలు వెళ్లి ఉన్నాయి. ఆ తదుపరి పరిణామాలతో ఈలేఖలు పూర్తిగా తెర మరుగు అయినా, 2017లో రెడ్‌ హిల్స్‌లో సాగిన తనిఖీల పర్వంతో గుట్కా బండారం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే, ప్రభుత్వ అధికారులకు పంపిణీ లేఖలు అప్పట్లో మాయమైనా, ప్రస్తుతం అవి మళ్లీ ఆదాయ పన్ను శాఖకు చేరడం గమనార్హం.

Tags: ‘Gutka’ in the bedroom room

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *