హజ్ రద్దు చేశారు… జెరుసెలాం కు గ్రీన్ సిగ్నల్ ఇస్తన్నారు…

Date:14/02/2018
కోహిమా  ముచ్చట్లు:
హజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు ఇచ్చే రాయితీలను రద్దు చేస్తున్నట్టు నెల రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, హజ్ యాత్రికులకు రాయితీని రద్దుచేసిన బీజేపీ సర్కారు, నాగాలాండ్‌లోని అధికారం కోసం క్రైస్తవులు జెరూసలేం వెళ్లడానికి ఉచిత సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. హజ్ యాత్రికులకు ఇస్తోన్న రాయితీలను రద్దు చేస్తున్నామని, మైనార్టీలకు సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన కేంద్రం, ఎన్నికల్లో లబ్ది పొందడానికి క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం తీసుకెళ్తామని హామీ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ సదుపాయం దేశంలోని మొత్తం క్రైస్తవులకా, లేదా కేవలం నాగాలాండ్‌కే పరిమితమా? అనే విషయం స్పష్టతలేదు.ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ లబ్ది కోసం బీజేపీ ఈ హామీ ఇచ్చింది. మేఘాలయా జనాభాలో దాదాపు 75 శాతం, నాగాలాండ్‌లో 88 శాతం మంది క్రైస్తవులే. ఈ హామీపై మైనార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హజ్ యాత్రికులకు రాయితీలను రద్దుచేసిన బీజేపీవి అవకాశవాద, వంచన రాజకీయాలని మండిపడుతున్నారు. దీనిపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేస్తూ… ‘క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం తీసుకెళ్తామని బీజేపీ వాగ్దానం చేస్తోందని, తనకు అవసరముంటే ఆ పార్టీ రాయితీలను కొనసాగిస్తుందనేది మరోసారి రుజువైంది… ఇలాంటి వాగ్దానం చేయడం దేశంలోనే ఇదే తొలిసారి’ మండిపడ్డారు.హజ్ యాత్రికులకిచ్చే రాయితీలను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.700 కోట్లు ఆదా అవుతుందని, మొత్తాన్ని మైనార్టీ వర్గాలకు చెందిన బాలికల విద్యకు ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. కేంద్రం ఈ ప్రకటన చేసిన తర్వాత సీపీఎం పార్టీ స్పందిస్తూ.. మతపరమైన యాత్రీకులకు రాయితీ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకం, కానీ హజ్ యాత్రకు రాయితీ రద్దుచేసిన ఎన్డీఏ నిర్ణయాన్ని సమర్ధించలేమని అన్నారు. అంతేకాదు 2012లో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు పదేళ్ల లోపు దీన్ని అమలు చేయాలని తెలిపిందని గుర్తుచేశారు.హజ్ యాత్రికులకు ఇచ్చే రాయితీని రద్దుచేయడాన్ని సమర్థిస్తున్నాం… కానీ అన్ని మతాల వారి విషయంలోనూ సమానత్వం పాటించాలని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రాయితీలను రద్దుచేసిన ప్రభుత్వం, మానససరోవర యాత్రకు వెళ్లే హిందువులకు మాత్రం కొనసాగించడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం వివక్షత చూపుతోందని ఆయన దుయ్యబట్టారు.
Tags: Haj canceled … gave the green signal to Jerusalam .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *