Hate the animal violence!

జంతు హింసను ద్వేషిద్దాం!

-పండుగల పేరిట మారణకాండ?

-గ్రామాల్లో మూగజీవాల ఊచకోత

-భారీగా క్రయ విక్రయాలకు ఏర్పాట్లు

Date: 14/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పట్టణాల్లో ఉద్యోగాలు చేసేవారు పుట్టింటికో, అత్తగారింటికో ప్రయాణమయ్యారు. బస్సులు కిటకిలాడుతున్నాయి. రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా పండుగ కోలాహలమే. వస్త్ర దుకాణాలు కళకళలాడుతున్నాయి. పతంగుల అమ్మకాలు జోరందుకున్నాయి. స్కూల్‌, కాలేజీ, పుస్తకాలు తప్ప మరే వ్యాపకం లేకుండా బిజీబిజీగా చదివేస్తున్న పిల్లలు కూడా ఈ నాలుగు రోజులు పతంగుల ఆటలో సేద దీరుతున్నారు. ముగ్గుల పోటీలు కనివిందు చేస్తున్నాయి. చూడముచ్చటగా కొలువుదీరేందుకు అటకమీది బొమ్మలూ ముస్తాబవుతున్నాయి. ఈ పండుగ వేళ మన పల్లెలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ప్రతి పండుగా సమస్తవృత్తులవారికి ఓ శుభసందర్భమే కదా? నిజమే. పండుగలు మనిషికీ మనిషికీ మధ్య స్నేహవారధులు. మనలోని ఐకమత్యానికి ప్రతీకలు. మధ్యమధ్యలో ఈ పండుగలనేవి లేకపోతే మన జీవితాలు మరీ యాంత్రికంగానూ, నిస్సారంగానూ మారిపోయేవేమో! ఈ ఆధునిక యుగంలో, ఈ యాంత్రిక జీవితంలో, ఈ పరుగుపందెంలో అలసిసొలసిపోతున్నవారిని మళ్లీ మళ్లీ రీచార్జ్‌ చేస్తున్నవీ పండుగలే కదా! ఇంటిల్లిపాదీ కలిసి మెలిసి భోజనం చేయడానికి, కులాసాగా కబుర్లు చెప్పుకోవడానికీ, ఒకరి యోగ క్షేమాలు మరొకరు యోచించడానికి, నావాళ్లంతా నాచుట్టూనే వున్నారన్న భరోసాను వృద్ధతరంలో కల్పించడానికి ఈ పండుగల ఓ చక్కటి సందర్భమే కదా! మన మధ్య ఓ మధురమైన అనుబంధాన్ని, ప్రగాఢమైన సంబంధాన్ని ప్రోధి చేస్తున్న ఈ పండుగల వేళ ఓ అభ్యంతరకర క్రీడ నర్తిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో మన మధ్య పెరుగుతున్న భయంకర వ్యసనమొకటి మనలోని నాగరికతకు, మానవీయతకు, సున్నితత్వానికీ మచ్చ తెస్తోంది. అవే పందేలు. జంతువులతో ఆడుతున్న పందేలు. ఈ పండుగ వేళ ఎద్దులతోనూ, కోళ్లతోనూ మనం ఆడుతున్న క్రీడలు, ఆ పేరుతో సాగిస్తున్న జూదాలు మన పండుగలను మనం ఏ మలుపు తిప్పుతున్నామన్న ఆవేదననూ కలిగిస్తున్నాయి. ప్రతి సంక్రాంతి సీజన్‌లోనూ గోదావరి జిల్లాల్లో సాగే కోడి పందాలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, ఉన్నత విద్యావంతులు కూడా ఈ కోడి పందాల్లో పాల్గొని, శక్తికొద్దీ జూదమాడతారు. లక్షల్లో పందేలు కాస్తారు. ఈ మూడు రోజుల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. తమ ఇంటిల్లిపాదీ ఏడాది పొడుగునా కష్టపడి కూడబెట్టిన సొమ్మును ఈ మూడు రోజుల్లో కోడిపందాలకు ఊడ్చిపెట్టేవారెందరో? పండుగ పూట సాగే సామాజిక కోలాహలం భయంకర వ్యసనంగా మారి, కుటుంబాలను వీధినపడేస్తుంటే వాడి లక్‌ బాగోలేదంటూ సరిపుచ్చుకుందామా? ఇంత భయంకర రూపం దాల్చిన ఈ వ్యసనాన్ని సంస్కృతి పేరుతో ఇంకా సమర్ధిద్దామా? కోడి పందేల చుట్టూ ఇప్పుడో మాఫియా సాలెగూడు విస్తరిస్తుండడం మరో ప్రమాదకర పరిణామం. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు పాతిక స్థలాల్లో కోడి పందేలు నిర్వహించే బరులు వుంటాయి. ఒక్కొక్క బరిలో రోజుకి 30 నుంచి 40 పందేలు నడుస్తాయని అంచనా. కోడి పందేల్లో పాల్గొనే జూదరులు బరి నిర్వాహకులకు పది శాతం ఫీజు కట్టాల్సి వుంటుంది. ఫీజుల రూపంలో బరి నిర్వాహకులు రోజుకి 30 నుంచి 40 లక్షల రూపాయలు సంపాదిస్తారని అంచనా. ఈ మూడు రోజుల్లో బరి నిర్వాహకులు కనీసంలో కనీసం కోటి రూపాయలు జేబులో వేసుకుంటారు. రెండు జిల్లాల్లోని పాతిక బరిల ద్వారా నిర్వాహకులకు వచ్చే ఆదాయం పాతిక కోట్ల పైమాటేనంటే ఆశ్చర్యపోకండి. గోదావరి జిల్లాల్లో బరి నిర్వాహకులు ఇప్పుడు పవర్‌ ఫుల్‌ లాబీయింగ్‌లు నడపగల స్థితిలో వున్నారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఫండింగ్‌ చేసి, వారిని తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. కోడి పందేల నిర్వాహకులకీ, రాజకీయ నాయకులకీ మధ్య విడదీయరాని గాఢానుబంధం ఎప్పుడో ఏర్పడిపోయింది. వీరిమధ్య ఏర్పడ్డ ఈ బంధం ఓ అనాగరిక సంస్కృతిని గ్లామరైజ్‌ చేసి పెడుతోంది. ఈ కోడి పందెల సమయంలో నకిలీ నోట్లు భారీగా చలామణిలోనికి వస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకీ కీడు జరుగుతోంది. రెండు కోళ్ల గోళ్లకు కత్తులు కట్టి, వాటి మధ్య పోటీ పెట్టి, అవి కొట్టుకుంటూ, నెత్తురు కక్కి చస్తుంటే వినోదించడం మనిషిలోని అనాగరిక ప్రవృత్తికి నిదర్శనం. మన మధ్య జరుగుతున్న కోడి పందెలు, ఎడ్ల పందాలు మనలోని సున్నితత్వపు పొర చెరిగిపోతోందనడానికి సాక్ష్యాలు. సరికొత్త సమాజానికీ, సరికొత్త విలువలకీ దిశానిర్దేశం చేయాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమలోని సున్నితత్వపు పొరను చెరిపేసుకుని, జంతు పందెల్లో మునిగితేలుతుండడం ఏరకంగానూ సమర్ధనీయం కాదు. కోళ్లు, ఎడ్లు, కుక్కలు లాంటి జంతువుల మధ్య పోటీలు పెట్టడాన్ని మన రాజ్యాంగం కూడా అనుమతించడం లేదన్న విషయాన్ని ఎవరమూ విస్మరించకూడదు. ప్రతి మనిషీ తనలోని మొరటు తనాన్ని సంహరించుకుని, సున్నితత్వాన్ని మేల్కొపుకోగలిగిననాడే మనం చేసుకునే పండుగలకు సార్ధకత. అప్పుడే మనం చేసుకునే సెల్రబేషన్స్‌ మనకీ, మన పిల్లలకీ, అనుభవాలతో తలపండిన మనింటి వృద్ధులకీ ఓ మధురానుభూతిని పంచిపెడతాయి. రండి. కనీసం పండగపూటైనా జంతు హింసను ద్వేషిద్దాం.

Tags: Hate the animal violence!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *