తెలంగాణలో వారసులొస్తారు

Date:15/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై తాజాగా నాలుగో విడత సర్వే చేపట్టారు. ఎమ్మెల్యేలకు మార్కులు కేటాయించే పనిలో భాగంగా నిఘావర్గాల ద్వారా వివరాలు సేకరించారు. ఫలితాల పర్సంటేజీలపై ఎమ్మెల్యేల కంటే వారి వెంట తిరిగే అనుచరులు, వారి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే వారసుల ప్రభావం ఎక్కువగా కనిపించిందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ముఖ్య ప్రజాప్రతినిధులకు రక్త సంబంధీకులే ప్రధాన అనుచరులుగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆయా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత, అధికారిక పనులు చక్కబెట్టడంలో వారే కీలకపాత్ర పోషిస్తున్నారట. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణలోని సీనియర్ నేతల్లో ఒకరు. వ్యవసాయం, దాని అనుబంధ శాఖల బాధ్యతలు చూసుకుంటున్న పోచారం, కేసీఆర్ క్యాబినెట్‌లో ముఖ్యుడు. ప్రభుత్వ విధానాలు అమలుచేయడం, నియోజకవర్గ వ్యవహారాలు చూసుకోవడంలో బిజీబిజీగా ఉంటారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యతలు చూసుకుంటున్న ఆయన ఆరు పదులు దాటిన వయసులోనూ ఉరుకులు, పరుగులు పెడుతుంటారు. ప్రభుత్వ పథకాల స్పీడు పెంచడంలో ముందుంటారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, మిషన్ భగీరథ వంటి పథకాలను జిల్లాలో మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గంలోనే ప్రారంభించారు. రాత్రి హైదరాబాద్‌లో ఉంటే, ఉదయం బాన్సువాడలో కనిపించే ఈ మంత్రిగారికి ఇంత సమయం ఎలా దొరుకుతుందని స్వపక్షీయులే ముక్కున వేలేసుకుంటారు. అయితే, అభివృద్ధి పథకాల అమలులో ముందున్న బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి పోచారంతోపాటు ఆయన తోడూనీడల పనితీరు ఈ సక్సెస్‌కి కారణమని నిఘావర్గాలు గుర్తించాయట. ఆలోచన మంత్రిగారిది అయితే ఆచరణ ఆయన వారసులదని స్థానికులు చెప్పుకుంటారు. ఆయన పెద్ద కొడుకు పోచారం సురేందర్‌రెడ్డి, చిన్నకొడుకు పోచారం భాస్కర్‌రెడ్డి తెరవెనుక ఉండి మంత్రి పనులను చక్కబెడతారు. దేశాయిపేట సింగిల్ విండో ఛైర్మన్‌గా కొనసాగుతున్న చిన్నకొడుకు భాస్కర్‌రెడ్డి “లోకల్ మంత్రి”గా చెలామణి అవుతున్నారు. “శీనన్నకు చెప్పాల్సిన విషయం భాస్కరన్నకు చెప్తే చాలు! పనైపోతుంది” అని పార్టీశ్రేణులు చెప్పుకుంటున్నాయి. అధికారులతో సమన్వయం, ప్రగతి పనుల పర్యవేక్షణ, నిధుల కేటాయింపులు తదితర పనులన్నీ ఈ చిన్న మంత్రి ద్వారానే సాగుతున్నాయట. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ర్యాంకింగ్ పడిపోయిన మంత్రి పోచారం ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టాపర్‌గా నిలవడానికి ఈ తోడూనీడల పనితీరే కారణమని తాజా సర్వేలో తేలిందట. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆయన తనయుడు జగన్ అండగా ఉంటున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు ఆయన తమ్ముడు రాజేశ్వర్‌రెడ్డి చూసుకుంటున్నారు. బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డికి తమ్ముడు అజయ్ తోడూనీడగా ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ వ్యక్తిగత పనులు ఆయన సోదరుడు సోహెల్ చూస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పర్సనల్ అసిస్టెంట్‌గా ఆయన కజిన్ రాకేశ్ వ్యవహరిస్తున్నారు. ఇలా ఒక్కో ప్రజాప్రతినిధికి వారి రక్త సంబంధీకులే సహాయకులుగా ఉంటున్నారు. వారి పక్షాన పనులను పర్యవేక్షిస్తున్నారు. వీరిలో కొందరు ఆయా నేతల రాజకీయ వ్యవహారాలను కూడా చూస్తుండగా, కొందరు మాత్రం కేవలం అంతర్గత పనులు చక్కబెడుతున్నారు. సదరు నేతలకు రాజకీయ వారసులమని చెప్పుకునే వారు తాజాగా అన్ని విషయాల్లోనూ తల దూరుస్తున్నారన్న సంగతి కూడా తాజా సర్వేలో తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేయడంలో ఇలాంటి వారసులు లేదా వ్యక్తిగత సహాయకుల ప్రభావం ఎక్కువగా ఉందని పరిశీలనలో తేలింది. పోలీసు, రెవిన్యూ అధికారుల బదిలీల్లో శాసనసభ్యుల కంటే వారి వారసుల ప్రమేయాలే ఎక్కువగా ఉంటున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులకు ఈ వారసుల వల్ల మైనస్ మార్కులు పడ్డాయట. “ఎమ్మెల్యే సాబ్ మంచోడే.. కానీ ఆయన తమ్ముడే గుర్రుగుర్రు మంటడు..” అని కార్యకర్తలు ఫిర్యాదు చేస్తున్నారట. ఏదైనా పని కోసం వెళ్తే తమ్ముణ్ణి కలవమని చెప్పడం ఒక ఎమ్మెల్యేకు అలవాటుగా మారింది. ఆయన చెప్పాడు కదా అని తమ్ముణ్ణి ఆశ్రయిస్తే కసురుకుంటున్నాడనీ, డబ్బుల లావాదేవీలైతే పర్సంటేజీ అడుగుతున్నాడనీ ఓ నియోజకవర్గ నేతలు వాపోతున్నారట. ఒకాయన అయితే ఫోన్ అసలే ఎత్తడనీ, గత్యంతరం లేక పీఏల ద్వారా మాట్లాడుతున్నామనీ ఆ ప్రాంత కార్యకర్తలు చెబుతున్నారట. ఒక ఎమ్మెల్యే వారసుడు రెండాకులు ఎక్కువ చదివాడట. ఏకంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ, పూర్తయిన వాటిని ప్రారంభిస్తున్నారట. ఎలాంటి పదవీ బాధ్యతలు లేకున్నా కొన్ని సందర్భాల్లో వేదికపై కూర్చొని ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారట. మరో ఎమ్మెల్యే వారసుడు ఇసుకదందా సాగిస్తూ, కాంట్రాక్టులలో పర్సెంటేజీలు లెక్కపెడుతూ ఖజానా నింపుకునే పనిలో ఉన్నాడు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పేరిట అనుమతులు ఇప్పిస్తూ ఇసుక అక్రమదందా సాగిస్తున్న ఈ వారసుడి గురించి నిఘావర్గాలు ప్రత్యేక నివేదిక తయారుచేశాయట. ఇలాంటి వారే అధికారులను కనుసన్నల్లో ఆడిస్తూ, కాంట్రాక్టులు, టెండర్ల వ్యవహారాల్లో ఉత్సాహం చూపుతున్నారు. సదరు ప్రజాప్రతినిధి తరఫున జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ ఇలాంటి వారసుల చేతుల మీదుగానే సాగుతున్నాయి. మొత్తానికి కొన్నిచోట్ల ఈ షాడోలు అటు ప్రభుత్వానికి, ఇటు ఎమ్మెల్యేకు రిమార్కు తెస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే- ఎమ్మెల్యేల పనితీరుపై మార్కులు వేస్తున్న సీఎం కేసీఆర్ ఆయన వెనకాల జరుగుతున్న తతంగానికి కూడా మార్కులు వేసి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని గులాబీ తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. అధినేత ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం..!
Tags: He will succeed in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *