నాసిరకం పనులు..నాణ్యతకు తూట్లు..

Date:12/03/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
ప్రతీ నియోజకవర్గానికి ఓ మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ సర్కార్ కృషిచేస్తోంది. ఈ మేరకు ప్రధాన చెరువులను గుర్తించి వాటి సుందరీకరణకు నిధులు వెచ్చిస్తోంది. అయితే ప్రభుత్వ లక్ష్యానికి కొందరు కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తూ నాసిరకం పనులు సాగిస్తున్నారు. దీంతో పలు చోట్ల మినీ ట్యాంక్ బండ్లలో నాణ్యతలేమి కనిపిస్తోంది. ఆదిలాబాద్ టౌన్ లోని ఖానాపూర్ చెరువు వద్ద పనులు సజావుగా సాగడంలేదని, పనుల్లో నాణ్యత లోపించిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ఈ కట్టడాల్లో లోపాలు జరుగుతుండడంపై చాలాకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ పెద్దగా లేదని.. వారి ఉదాసీనత కారణంగా పనులు నిబంధనలకు అనుగుణంగా సాగడంలేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా ఉపయోగించకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షకుల్లానే చూస్తోందని పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.  హైదరాబాద్‌ ట్యాంకుబండ్‌ మాదిరిగా ప్రతి నియోజక వర్గానికి ఒక చెరువు చొప్పున అభివృద్థి చేయాలని ప్రభుత్వం చాలాకాలం క్రితమే నిర్ణయించింది. మిషన్‌ కాకతీయ రెండో విడతలో ఆదిలాబాద్‌ నియోజక వర్గానికి పట్టణానికి ఆనుకుని ఉన్న ఖానాపూర్‌ చెరువు ట్యాంక్‌ బండ్‌ పనులకు 2016-17లో రూ.4.83 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలు తయారు చేశారు. నిర్మాణ పనులకు రూ.3.89కోట్లను కేటాయించింది ప్రభుత్వం. రూ.3.31కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారు ఈ నిధుల ద్వారా కట్టల మరమ్మతులు, చుట్టూ సెంట్రల్‌ లైటింగ్‌, ఆవరణ అంతా అలంకరణ మొక్కలతో పచ్చదనం, క్యాంటీన్‌ సౌకర్యం, బోటింగ్‌ ఏర్పాటు, వాకింగ్‌ ట్రాక్‌ వంటి పనులు జరిపించాలి. అయితే ఈ పనుల్లో నాణ్యత లేమి తాండవిస్తోంది. ఈ పనులను తనిఖీ చేయాల్సిన నాణ్యత పరిశీలన అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడడంలేదని స్థానికులు అంటున్నారు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. కళ్లముందే నాసిరకం పనుల ఆనవాళ్లు బయటపడుతున్నా.. సంబందిత ఇంజినీర్‌ అధికారి మాత్రం నాణ్యత ప్రమాణాల ప్రకారమే పనులు జరుగుతున్నాయని చెప్పడంపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత విభాగం ఉన్నతాధికారులు స్పందించి ట్యాంక్ బండ్ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags: Hello things ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *