ఇవాంకా కోసం హైదరాబాదీ వంటకాలు!

హైదరాబాద్ ముచ్చట్లు:

ఈ నెల 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ జరగబోతోన్న సంగతి తెలిసిందే. ఆ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ తో పాటు ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇవాంకా పర్యటించే మాదాపూర్ తదితర ప్రాంతాల సుందరీకరణ, రోడ్లకోసం తెలంగాణ సర్కార్ దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చు పెడుతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇవాంకా కోసం అమెరికా భద్రతా బలగాలు, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28న ఫలక్నుమా ప్యాలెస్లో ఇవాంకా బస చేయనున్నారు. ఫలక్నుమాలో నిజాం వంశీయుల కాలం నుంచి వస్తున్న టేబుల్ పై ఇవాంకా, మోదీ సహా 101 మంది ప్రముఖులు విందు ఆరగించనున్నారు.ఇవాంకా, ఆ సదస్సుకు వచ్చిన విశిష్ట అతిథులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 29న గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్నారు. ఆ విందు భోజనంలో ఇవాంకాకు ప్రఖ్యాత హైదరాబాద్ సంప్రదాయ వంటకాలు రుచి చూపేందుకు కేసీఆర్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. పత్తర్ కా గోష్, షీర్ ఖుర్మా, డబుల్ కా మీఠా వంటి ప్రత్యేక వంటకాలను ఆ విందులో వడ్డించనున్నారు. ఆ విందు కోసం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ చెఫ్ లను నిర్వాహకులు నియమించారు. బగారే బైగన్, దమ్ కా బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, ఇరానీ చాయ్.లు ఆ డిన్నర్ మెనూలో ఉన్నాయి. వీటితోపాటు ఇండియన్, చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరీబియన్ వంటకాలను ఆ విందులో అతిథులకు అందించనున్నారు. వాటికోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పేరుగాంచిన చెఫ్ లను నియమించారు. ఈ విందులో పాల్గొనే అతిథులకు తెలంగాణ సంప్రదాయాలు, వంటకాల రుచిని తెలియజేయనున్నారు.

 

Tag : Hyderabadi cuisine for Ivanca!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *