సమస్యలు పరిష్కరిస్తేనే..సదస్సుల లక్ష్యం నెరవేరేది

Date:21/06/2018
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ భూములు కొన్ని కబ్జా కోరల్లో చిక్కుకున్నట్లు స్థానికులు అంటున్నారు. ఈ విషయం తెలిసినా సంబంధిత అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉంటోందని ఆరోపిస్తున్నారు. విలువైన భూములు స్వాధీనం చేసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోందని చెప్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే భూ సదస్సుల్లో ఈ సమస్యను పరిష్కరించి.. అక్రమార్కుల చెరలోని భూములను స్వాధీనం చేసుకోవాలని స్పష్టంచేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు, దేవాదాయ అటవీశాఖ తదితర భూముల వివరాలపై ఇప్పటికీ చాలా చోట్ల పక్కా సమాచారం లేదన్నది స్థానికుల వాదన. ఈ లోపాన్ని క్యాష్ చేసుకుంటూ అక్రమార్కులు కొందరు అనేక చోట్ల భూములు కబ్జా చేశారని అంటున్నారు. కొన్నిచోట్ల ల్యాండ్‌ సీలింగ్‌ చట్టానికి లోబడి ఇచ్చిన భూములు వశపర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా సర్వే చేపడితే అనేక మందికి న్యాయం జరుగుతుందని అంతా అంటున్నారు. కబ్జాకోరల్లోవున్న ప్రభుత్వ, అటవీశాఖ, దేవాదాయ శాఖ భూములు స్వాధీనం చేసుకునేందుకు కూడా వీలు కలుగుతుందని చెప్తున్నారు. కొన్నిచోట్ల ఇటువంటి సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. వీటిని పరిష్కరించకుండా భూ సదస్సులు నిర్వహిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 20నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకూ గ్రామాల్లో భూసదస్సులు నిర్వహించనున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలోని కబ్జా కోరల్లో చిక్కుకున్న భూములను విడిపించాలని అంతా కోరుతున్నారు. కబ్జా చెరలో ఉన్న భూములను విడిపించాలని రైతులు చాలాకాంగా అధికారుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన వితనతుల్లో సగానికి సగం వినతులు భూ సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే భూ సమస్యలు కొలిక్కి వచ్చి ఉండేవి. ప్రత్యేకించి సదస్సులు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ సమస్యలను ఆసరాగా చేసుకుని అధికారులు చేతులు తడిపితే తప్ప పనులు చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం భూ సదస్సుల్లో ఐదు కేటగిరిలకు సంబంధించిన 22-ఎ జాబితాల సవరణ, అర్జీలు స్వీకరిస్తామని చెప్తున్నారు. ఈ అంశాలకు సంబంధించిన 22-ఎ జాబితాల సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్‌ కాలం నుండి వున్న డాట్స్‌ విధానాన్ని మారుస్తు, తాత, ముత్తాతల పేరుమీద ఉన్న భూమి వారసుల పేరు మీద మారుస్తామని అధికారులు అంటున్నారు. భూధార్‌ ద్వారా, ఆధార్‌, మొబైల్‌ నెంబరు రెగ్యులర్‌ ఖాతాకు నమోదు చేస్తారని సమాచారం. ఇదిలాఉంటే గ్రామ సభ నిర్వహణ తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దార్లు రెండు టీములుగా చేపడతారు. క్షేత్ర స్థాయి సిబ్బందితో షెడ్యూల్‌ ప్రకారం ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తారు. పెద్ద గ్రామాలకు పూర్తి రోజు, చిన్న గ్రామాలకు ఒక పూట కేటాయిస్తారు. ప్రత్యేక మీసేవ కౌంటర్‌ ఏర్పాటుచేసి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవల పట్టికను అక్కడ ఉంచుతారు. గత నాలుగేళ్లలో రెవిన్యూ శాఖలో చేపట్టిన కీలక సంస్కరణలు, విజయాలను కూడా వివరిస్తారు. వచ్చిన 22-ఎ పెండింగు దరఖాస్తులు, ఆమోదించినవి, తిరస్కరించినవి దరఖాస్తుల వివరాలు చదివి, వారికి వినిపిస్తారు. కొత్తగా వచ్చిన అర్జీలు స్వీకరించి రశీదు ఇవ్వనున్నారు. సదస్సుల తీరుతెన్నులు ఎలా ఉన్నా.. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలను ఈ సదస్సుల్లోనే పరిష్కరించాలని అంతా కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరిస్తేనే..సదస్సుల లక్ష్యం నెరవేరేదిhttp://www.telugumuchatlu.com/if-problems-are-solved-the-aim-of-the-schools-is-to-be-fulfilled/
Tags: If problems are solved, the aim of the schools is to be fulfilled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *