టార్గెట్ చేరుకోవాలంటే..వేగం పెంచాలి..

Date:13/02/2018

ఆదిలాబాద్‌ ముచ్చట్లు:
రాష్ట్రంలో జలవనరులు పెంచేందుకు తెలంగాణ సర్కార్ తీవ్రంగా కృషిచేస్తోంది. తాగు-సాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఏటా 20 శాతం చొప్పున అయిదేళ్లలో ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని చెరువులను పునరుద్ధరించాలని భావించింది. ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చి నాలుగేళ్లైంది. అయితే మంచి ఆశయంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్‌ పురోగతి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో ఆదిలాబాద్‌ ప్రాంతంలో జలవనరుల నిల్వ ఆశించినంతగా లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా అంతటా 7 వేలకు పైగా చెరువులను గుర్తించి అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. సంవత్సరానికి 20 శాతం చెరువుల చొప్పున అయిదేళ్లలో పూర్తిస్థాయిలో చెరువులను అభివృద్ధి పరచాల్సి ఉంది. చెరువుల్లో పూడిక తొలగించి ఇతర మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు మూడు దశలు మాత్రమే పూర్తయ్యాయి. నాలుగో దశలో పనులు మంజూరవుతున్నాయి. అయినా సగానికి సగం పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. పనులు అయిదో దశకు వచ్చినా సగం చెరువులు మరమ్మతులకు నోచుకోవనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.  మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 548 చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. 65116 ఎకరాలకు సాగునీటిని అందించడానికి ప్రభుత్వం రూ.222 కోట్లు మంజూరు చేసింది. రెండో దశలో 478 చెరువులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. రూ.186 కోట్లతో చెరువులను అభివృద్థి పరచి.. 55421 ఎకరాలకు సాగునీటిని అందించాలనేది లక్ష్యం. కానీ.. ఇప్పటివరకు 466 చెరువుల పనులు మాత్రమే మొదలయ్యాయి. ఇక గతేడాదిలోనే చేపట్టిన మూడో విడత పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చెరువుల్లో నీళ్లున్నాయనే ఉద్దేశ్యంతో కేవలం 252 చెరువు పనులు చేపట్టారు. రూ.100 కోట్ల ఖర్చుతో 26882 ఎకరాలకు నీళ్లివ్వాలి. కానీ.. 248 చెరువుల పనులు మొదలయ్యాయి. అందులో 125 చెరువుల పనులు మాత్రమే పూర్తయ్యాయి. కొత్త చెరువుల నిర్మాణాలతో పాటుగా నాలుగు విడతల్లో మంజూరైన చెరువుల పనులు వచ్చే ఏడాది మార్చి నాటికీ పూర్తిచేయాలి. ఆ తర్వాత అయిదో దశ పనులు మొదలవుతాయి. మరోవైపు ఐదో దశ పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి. ఐదో దశ పనుల వరకు వచ్చేలోపే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయితే.. ఈ పనులు చేపట్టడం కుదరదని అధికార వర్గాలే అంటున్నాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులు వేగంగా జరిపించాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags: If you want to reach the target ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *