మారుమూల అటవీ ఆవాసాలకు తక్షణం విద్యుత్ సదుపాయం
-త్వరితగతిన అనుమతులు ఇవ్వటంతో పాటు, పనుల పూర్తికి ఆదేశం
-అరణ్య భవన్ లో సమన్యయ సమావేశం,
-హాజరైన అటవీ, గిరిజన సంక్షేమం, విద్యుత్ శాఖ అధికారులు
హైదరాబాద్ ముచ్చట్లు:
మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వేగంగా అనుమతులు ఇవ్వటం, తక్షణం పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అటవీ, గిరిజన సంక్షేమం, విద్యుత్ శాఖల ఉన్నతాధికారుల సమన్యయ సమావేశం అరణ్య భవన్ లో జరిగింది. సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 232 ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సదుపాయం కల్పించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తు తెలిపారు. నిబంధనల మేరకు అనుమతుల ప్ర్రక్రియ పూర్తి చేసేందుకు అటవీ శాఖ వేగంగా స్పందిస్తుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (HoFF) ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. రక్షిత అటవీ ప్రాంతాలకు బయట యాభై (50) ఆవాసాలు ఉన్నాయని సంబంధిత జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అనుమతితో పనులు మొదలు పెట్టొచ్చన్నారు. ఇక రక్షిత అటవీ ప్రాంతాల్లో 182 (అదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో) ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం అందించాల్సి ఉందని, అన్ని రకాల అనుమతులను వేగవంతం చేసి, త్వరగా పనులు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.అదనపు పీసీసీఎఫ్ లు మోహన్ చంద్ర పర్గెయిన్, ఏ.కే. సిన్హా, సంబంధిత జిల్లాలకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, టైగర్ రిజర్వు కేంద్రాల ఫీల్డ్ డైరెక్టర్లు, జిల్లాల అటవీ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Tags: Immediate power supply to remote forest habitats
