ఆంధ్రకేసరి జ్ఞాపకార్థం… ప్రకాశం జిల్లా ఆవిర్భావం! జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహానేత టంగుటూరి

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లా ఆవిర్భవించిందని అందరికీ తెలిసినా… టంగుటూరి పోరాట స్ఫూర్తిని వర్ధమాన యువతకు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఒంగోలు జిల్లాకు ‘ప్రకాశం’ జిల్లాగా అప్పటి ప్రభుత్వం నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుందని మాత్రం బహుకొద్ది మందికే తెలుసు. సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు. టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు. టంగుటూరి ప్రకాశం 1872 ఆగస్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో సుబ్బమ్మ, వెంకట నరసింహం దంపతులకు జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్‌ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు. వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్‌ పాస్‌ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావునాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్లో చదివాడు. నాయుడు రాజమండ్రి కినివాసం మారుస్తూ, ప్రకాశంను తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్‌.ఏ.లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు. ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపదా ఆర్జించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు. అప్పట్లో ప్రకాశం సెకండ్‌ గ్రేడ్‌ ప్లీడరు. కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశంను కూడా బారిస్టరు అవమని ప్రోత్సహించాడు. ఆ సలహా నచ్చి, ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మాగాంధీ లాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశంకు జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి. 1907లో లండనులో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రధముడు. ప్రకాశం పౌర, నేర వాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్‌ కేసుల్లో ఆష్‌ హత్యకేసు ఒక ప్రసిద్ధిచెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్‌, 1907లో కాల్చిచంపబడ్డాడు. ఈ సంఘటన బెంగాల్‌ ప్రాంతానికి చెందిన జాతీయవాద నేత బిపిన్‌ చంద్ర పాల్‌ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశాడు. ప్రకాశం, లా టైమ్స్‌ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవాడు. అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్‌ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్‌ చంద్ర పాల్‌ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921లో స్వాతంత్య్ర సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసాడు. లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్‌ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్‌ లోనూ పర్యటించాడు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీలోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు. 1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్‌, మదన్‌ మోహన్‌ మాలవ్యా, జిన్నా మరియు జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు. 1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్‌ 29న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. 1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు. సైమన్‌ కమిషను, భారతదేశాన్ని సందర్శించవచ్చినప్పుడు కాంగ్రెసు పార్టీ సైమన్‌, గోబాక్‌ (సైమన్‌, తిరిగివెళ్లు) అన్న నినాదముతో ఆ కమిషన్ను బహిష్కరించటానికి నిర్ణయించింది. కాంగ్రెసు పార్టీ ఈ కమిషనును బహిష్కరించటానికి అనేక కారణాలున్నాయి అయితే ఆ కమిషనులో ఒక్క భారతీయ ప్రతినిధి కూడా లేకపోవటం ప్రధానమైనది. కమిషన్‌ వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి. 1928 మార్చి 2న కమిషన్‌ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. అయితే, ప్యారీస్‌ కార్నర్‌ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో మూక విపరీతముగా పెరిగిపోయినది. వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం, తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించి, కాల్చమని సవాలు చేశాడు. పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు ప్రకాశం, ఇతర అనుచరులకు తోవనిచ్చారు. ఈ సంఘటన తర్వాత ప్రజలు ఈయనను ఆంధ్ర కేసరి అన్న బిరుదుతో గౌరవించారు. 1930లో కాంగ్రెసు పార్టీ తమ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమన్నప్పుడు ప్రకాశం కూడా రాజీనామా చేశాడు కానీ పార్టీ ప్రత్యామ్నాయ ప్రణాళిక నచ్చక తిరిగి ఉప ఎన్నికలలో పోటీచేసి గెలిచాడు. మదన్‌ మోహన్‌ మాలవ్యా నేతృత్వములోని జాతీయ పార్టీలో చేరాడు. గాంధీ, కాంగ్రెసు పార్టీ దండి యాత్రతో ఉప్పు సత్యాగ్రహము చెయ్యాలని నిర్ణయించిన తర్వాత జాతీయ పార్టీకి రాజీనామా చేసి, తనతో పాటు ఇతరులను కూడా రాజీనామా చేయటానికి ప్రోద్బలం చేశాడు. ప్రకాశం శాసనసభ్యునిగా కూడా రాజీనామా చేసి మద్రాసులో స్వయంగా ముందుండి ఉప్పు సత్యాగ్రహం నడిపించాడు. అదే సమయంలో ప్రభుత్వము పెద్ద మొత్తములో ధరావత్తు నగదు ఆపేక్షించటంతో స్వరాజ్య పత్రికను నిలిపివేయాల్సి వచ్చింది. 1931లో ఇర్విన్‌ ఒడంబడిక తర్వాత పత్రికను పునరుద్ధరించాడు. కానీ ధన సమస్యల వల్ల తిరిగి నిలిపివేశాడు. 1935లో మరలా దీన్ని పునరుద్ధరించటానికి విఫలయత్నాలు సాగాయి. 1937లో కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధిగా ప్రకాశం ముందున్నప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు తిరిగివచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా, కాంగ్రెసు అధిష్టానవర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. రాజాజీ మంత్రివర్గములో ప్రకాశం రెవిన్యూ శాఖామంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఈయన చేసిన పనులలో ముఖ్యమైనది, బ్రిటీషు ప్రభుత్వము పాటించే జమిందారీ వ్యవస్థ వలన వ్యవసాయరంగములో జరుగుతున్న అవకతవకలను పరిశీలించటానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షత వహించటం. రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో కాంగ్రెసు మంత్రివర్గాలు, యుద్ధంలో భారతదేశం పాల్గొనటం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి. 1941లో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం ప్రధముడు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశంను అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945లో జైలునుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు. 1946లో కాంగ్రెసు పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది. ఈ తరుణంలో 1946 ఏప్రిల్‌ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్‌, జాతీయ నాయకులైన గాంధీ నెహ్రూల అభ్యర్ధి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు. అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది. సామాన్య ప్రజల సంక్షేమార్ధమై ప్రకాశం, తన వ్యక్తిగత భద్రతను, జవహర్‌ లాల్‌ నెహ్రూ చేసిన హెచ్చరికలనూ లెక్కచేయకుండా 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం సహాయసహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలిసి, రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. 1952లో ప్రజాపార్టీని స్థాపించి అధికారములో ఉన్న కాంగ్రెసు పార్టీ మంత్రులందరూ ఎన్నికలలో ఓడిపోయేట్టు చేశాడు. అయితే ప్రజాపార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే బలనిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది. అంతలో 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమం తీవ్రతరమైంది. ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్‌ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. 1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్‌ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్‌ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించినాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957 మే 20న పరమపదించాడు. ఆయన ఆత్మకథ నా జీవిత యాత్ర పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం రాసాడు. దీనిలో స్వాతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగస్టు 2006లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీలోకి కూడా అనువదింపబడింది. స్వాతంత్య్ర సమరయోధునిగా ప్రకాశం ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశంలో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్‌ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం, ఒంగోలు మండలానికి కేంద్రం. పూర్వము దీని పేరు వంగవోలు. ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ జాతి ఎద్దులలో ఇవి ఒకటి. ఆంధ్రప్రదేశ్లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రం. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది. ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరువాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి మరియు వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకి ని రాజధానిగా పాలించారు. కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు పట్టణాన్ని కర్ణాటక నవాబు హైదర్‌ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్‌ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది. ఒంగోలు పట్టణాన్ని మునిసిపాలిటీగా 1876లో వ్యవస్థీకరించారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు బాల్యం ఒంగోలులోనే గడిచింది. ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్తాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్‌, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు ఆంధ్రప్రదేశ్‌ లోపల వెలుపల ప్రాతాలలోని పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. మానవశక్తి, పెట్టుబడులు, విజయవంతంగా నడపటానికి కావలసిన నాయకత్వం కొరతే దీనికి కారణం. ఎనభై(80), తొభైయవ(90)దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్‌ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఒంగోలు విద్యాపరంగా అభివృద్దిలో ఉన్న ప్రదేశం. ఎనభైయ్యవ(80) దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్‌ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం తొమ్మిది కోస్తా ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలు. ఒంగోలు జిల్లా ఫిబ్రవరి 2, 1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల కొంత భాగాల నుండి ఆవిర్భవించినది. తరువాత డిసెంబర్‌ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామంలో పుట్టిన టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధం ప్రకాశం జిల్లాగా నామకరణము చేశారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ, సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్‌ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. జిల్లా చరిత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే. స్వాతంత్రోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల మరియు ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి మరియు దర్శి) మరియు కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం మరియు గిద్దలూరు) ఏర్పడినది. 1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా పేరు మార్చబడింది. ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 150.90, 160 డిగ్రీల ఉతర అక్షాంశాలు 79, 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉన్నది. ఉత్తరాన మహబూబ్‌ నగర్‌ మరియు గుంటూరు జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్‌ఆర్‌ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. త్యాగరాజు నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు గిద్దలూరు, మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు, వైఎస్‌ఆర్‌ జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ, మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి. నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలును తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురంలను కలుపుతుంది. గుండ్లకమ్మ, పాలేరు, మూసీ, మున్నేరు, సగిలేరు లు జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. తమ్మిలేరు, ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, యేడి మంగల వాగు వంటి వాగులు కూడా జిల్లాలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్‌- సెప్టెంబరు లో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు – డిసెంబరు లో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి. జిల్లా సగటు వర్షపాతం 764మిమి. ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు క్రమంగా 51% , 41%, 6% వరకు జిల్లాలో ఉన్నాయి. జిల్లా విస్తీర్ణంలో 4,42,500 హెక్టార్లలో (25.11% )అడవులు ఉన్నాయి. కోస్తా ప్రాంతంలో చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడు లలోజీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి. ఉలవపాడు లలో మామిడీ,సపొటా తోటలు ప్రసిద్ది. పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు మండలంలోని ఓబయనాపల్లి నుండి మార్కాపురం మండలంలోని కుళ్లపేట వరకు దొరుకుతుంది. భారతదేశం వుత్పత్తిలో దాదాపు 80 శాతం ఇక్కడేజరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్‌, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. ఇంకా క్వార్ట్జ్‌, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్‌ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది. జిల్లా విస్తీర్ణంలో 37 శాతం మాత్రమే వ్యవసాయభూమి. 72 శాతం ఆహర పంటలు ,28శాతం అహారేతర పంటలు పండుతున్నాయి. 3,10,433 కమతాలున్నాయి. వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి చెందింది. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పత్తి,శనగ, వేరుశనగ, ఆముదం ఇక్కడ పండే ఇతర పంటలు. పత్తివుత్పత్తిలో నాలుగో స్థానంలో వుంది. మొత్త సాగుభూమిలో 24 శాతానికి నీటి పారుదల సౌకర్యం వుంది. కాలువల ద్వారా 71000 హెక్టార్లు, చెరువుల ద్వారా 34000 హెక్టార్లు, గొట్టపు బావులద్వారా 65000 హెక్టార్లు భూమి సాగవుతున్నది. జిల్లాలోని 102 కి మీల సముద్ర తీరంలో సముద్ర ఉత్పత్తులు విరివిగా అవకాశాలున్నాయి. జిల్లాలో ఐరన్‌ ఓర్‌, గ్రానైట్‌, ఇసుక, సిలికా, బైరటీస్‌, సున్నపురాయి, పలకలకు సంబంధించిన గనులు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు చీమకుర్తి, ఆర్‌.ఎల్‌.పురం, బూదవాడల్లో 8.60 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు, వివిధ రంగుల గ్రానైట్‌ నిక్షేపాలు జిల్లాలోని ఉప్పుమాగులూరు, ఏల్చూరు, దర్శి, కనిగిరి, అద్దంకిల్లో 13.86 మిలియన్ల క్యూబిక్‌ మీటర్లు మరియు బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ నిల్వలు 0.435 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు ఉన్నట్లు అంచనా.ఇవేగాక ప్రత్తి జిన్నింగ్‌, పొగాకు , మంగుళూరు టైల్స్‌, పలకల తయారీ, జీడిపప్పు పరిశ్రమలు వున్నాయి. దేశానికి అవసరమైన రాతి పలకలో 80% మార్కాపురం నుండే 100కు పైగా పరిశ్రమలలో వుత్పత్తి చేయబడుతుంది. సముద్ర తీరం (చినగంజాం, పాకల, ఊళ్ళపాలెం, కేసుపాలెం, కరేడు మొదలైనవి.) పొడుగునా 5000 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పును పండిస్తారు. అవస్థాపన: జిల్లాలో ఆరు పారిశ్రామిక వాడలు ( ఒంగోలు, మార్కాపూర్‌, గిద్దలూరు, ఒంగోలు అభివృద్ధి కేంద్రము, ఒంగోలు ఆటోనగర్‌, వుడ్‌ కాంప్లెక్స్‌ ఒంగోలు లో వున్నాయి. జిల్లా పరిశ్రమల కేంద్రం పరిశ్రమాభివృద్ధికి తోడ్పడుతున్నది.

Tag : In memory of Andhra.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *