కాకినాడలో  దాహం కేకలు

Date:18/06/2018
కాకినాడ ముచ్చట్లు:
కాకినాడ నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నగరవాసులు దాహార్తితో తల్లడిల్లుతున్నారు. రిజర్వాయర్లను నీటితో నింపడం, అవి ఎప్పటి వవరకు సరిపోతాయి..? తిరిగి కాలువలకు నీరు విడుదల చేసే వరకూ ఎలాంటి  ప్రణాళిక అమలు చేయాలో చర్చించి తగిన విధంగా చర్యలు చేపట్టేవారు. ఈ ఏడాది అలాంటి చర్యలు చేపట్టలేదు.నగరపాలక సంస్థకు సంబంధించి సామర్లకోటలోని సాంబమూర్తి రిజర్వాయరు, అరట్లకట్ట జలాశయం ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచే డెల్టా కాలువలకు గోదావరి నీటిని విడుదల చేసినా ఈ రెండు రిజర్వాయర్లకు నీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. బలభద్రపురం, బిక్కవోలు ప్రాంతాల్లో గోదావరి కాలువ ఆధునికీకరణ పనులు కొనసాగుతుండడమే ఈ పరిస్థితికి కారణం.దీంతో కాకినాడ నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే సాంబమూర్తి, అరట్లకట్ట జలాశయాలకు నీటి సరఫరా ఆగిపోయింది. ఫలితంగా లక్షలాది మంది ప్రజలకు నీటిని అందించలేక అధికారులు చేతులెత్తేశారు. వారం రోజులుగా ఒకపూట మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కడియం నుంచి సామర్లకోట వరకు ఉన్న గోదావరి కాలువ నుంచి సాంబమూర్తి రిజర్వాయర్‌కు, మంజీర కాలువ నుంచి అరట్లకట్టకు నీటిని పొందుతారు. మంజీర కాలువకు నీరు సరఫరా అవుతున్నా అరట్లకట్ట రిజర్వాయరు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేదు. నేరుగా కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా జలాలను కాకినాడకు తరలిస్తున్నారు. ఇక్కడ శుద్ధి చేసి సరఫరా చేస్తున్నా ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. ఇక సామర్లకోటలోని సాంబమూర్తి రిజర్వాయరుకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇది ఎండిపోయింది. దీనికి కడియం నుంచి సామర్లకోట వరకు ఉన్న గోదావరి కాలువ నుంచి నీటిని నింపుతారు. ఈ కాలువలో జరుగుతున్న ఆధునీకరణ పనులతో నీటి సరఫరాను నిలిపివేశారు.కడియం వద్ద గోదావరి కాలువకు విడుదల చేశారని అధికారులు పేర్కొంటున్నా వారం రోజులకు గానీ సాంబమూర్తి చెరువు నిండే పరిస్థితి కనిపించడం లేదు.కాకినాడ నగర ప్రజలకు నిత్యం 45 ఎంఎల్‌డీల తాగునీరు అవసరం. ప్రస్తుతం 22 ఎంఎల్‌డీలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో ఒకపూట మాత్రమే సరఫరా జరుగుతోంది. సామర్లకోటలో సాంబమూర్తి రిజర్వాయరు పూర్తిగా అడుగంటి పోవడంతో అరట్లకట్టలోని మరో జలాశయంపైనే ఆధారపడుతున్నారు. దీని పరిస్థితీ అలాగే మారింది. మంజీర కాలువకు వస్తున్న నీటిని పైపుల ద్వారా తోడి కాకినాడకు తరలించిన అనంతరం శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. సామర్లకోట కాలువకు త్వరితగతిన నీరు రాకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ప్రస్తుతం తాగునీటి సరఫరాను ఒకపూటకు కుదించడంతో నగర శివారు ప్రాంతాల్లో తీవ్ర ఎద్దడి నెలకొంది. దీనిని అధిగమించేందుకు 11 ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
Tags:In the Kakinada the thirst is crying

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *