యూపీలో ఘోరం

Date:08/04/2018
లక్నో ముచ్చట్లు:
ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్ట్రెచర్ సౌకర్యం లేదని మనం తరచూ వింటూనే ఉంటాం. గతిలేని పరిస్థితుల్లో బంధువులే రోగిని భుజాలపై మోసుకెళ్లడం చూస్తూనే ఉంటాం. ఈ ఘటనలపై అధికారులు స్పందించడం… వెంటనే కొంతమందిని సస్పెండ్ చేయడం షరా మామూలే. ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా యూపీలోని ఆగ్రాలో కూడా ఇదే జరిగింది. స్ట్రెచర్ సౌకర్యం లేక రోగి కుమారుడు ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాలపై మోసుకెళ్లాడు. ఓ వృద్ధురాలు అనారోగ్యంతో ఆగ్రా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఊపిరి సరిగా అందకపోవడంతో ఆక్సిజన్ పెట్టారు.
వృద్ధురాలికి మెరుగైన చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆవరణలో ఉన్న మరో భవనానికి తరలించేందుకు ప్రయత్నించారు. వార్డు దూరం ఉండటంతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆమెను అంబులెన్స్ వరకు తీసుకొచ్చేందుకు కనీసం స్ట్రెచర్ కూడా లేదు. దీంతో ఏం చేయాలో వృద్ధురాలి కొడుక్కి అర్థంకాలేదు. బాధితురాలి మొహానికి ఆక్సిజన్ మాస్క్ అలాగే ఉంచుకోగా… కొడుకు సిలిండర్‌ను భుజాన వేసుకొని బయటకు తీసుకొచ్చాడు. ఈ సీన్ మొత్తాన్ని అక్కడున్న జనాలు మొబైల్‌లో రికార్డు చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి వెళ్లగా… దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని చెప్పారు.
Tags:In Uttar Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *