Indirama's home waste ...

ఇందిరమ్మ ఇళ్లు వృథా…

Date:31/12/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు నగర శివారు జగన్నాథ గట్టుపై నిర్మించిన ఇందిరమ్మ కాలనీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ఎందుకూ పనికి రాకుండా పోతోంది. కాలనీలో కనీస వసతులైన తాగునీరు, రోడ్లు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లలో చేరేందుకు ముందుకు రావడం లేదు. పదేళ్లుగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలకు నోచుకోక శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు దాదాపు రూ. 136.69 కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం శూన్యం. 11 ఏళ్ల కిందట ఇల్లు లేని నిరుపేదలకు ఇంటిగ్రేటెడ్‌ హౌసింగ్‌, స్లమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం 2006-07 కింద 8431 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయితే కేటాయించిన స్థలం నగరానికి దూరంగా కొండల్లో ఉండడం, నీరు, రహదారి వసతి లేకపోవడంతో లబ్ధిదా రులకు ఇంటిని నిర్మించుకోవడం కత్తిమీద సాములా మారిం ది. పిల్లర్లు వేసి, గోడలు నిర్మించినా క్యూరింగ్‌ చేసుకోవ డానికి ప్రత్యేకంగా ట్యాంకర్‌తో నీటిని తెప్పించు కోవాల్సి వచ్చేది. ప్రభుత్వ ఖర్చుతో సహా దాదాపు రూ.150 కోట్లు అయింది. 2009లో కర్నూలుకు వరదలొచ్చిన తర్వాత అప్పులు చేసి చాలా మంది ఇళ్లను పూర్తి చేసుకున్నారు.
అప్పట్లో విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో ఇళ్లల్లో చేరడానికి రెండేళ్లు ఎదురు చూశారు. 2012లో విద్యుత్‌ సౌకర్యం కల్పిం చారు. కానీ రహదారి, మంచినీటి సౌకర్యం కల్పించకపో వడంతో ఇళ్లలో ఎవ్వరూ చేరలేదు. దీనికి తోడు రేషన్‌ కార్డులు లేవని 1800 మందికి బిల్లులివ్వలేదు. బిల్లులు రాలేదని పునాదుల స్థాయిలో 3,970 మంది, లెంటల్‌ లెవల్‌లో 348 మంది, పైకప్పు స్థాయిలో 904 మంది నిర్మాణాలను వదిలేశారు. ప్రస్తుతం పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం స్లాబు వేయని లబ్ధిదారులకు అదనంగా రూ.25 వేలు చెల్లించింది. కానీ ఎవ్వరూ ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించలేదు. 2009లో ఇందిరమ్మ గృహాలు ఏ స్థితిలో ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఫలితంగా ఇళ్లల్లో చెట్లు మొలిచి, శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంత పెద్ద కాలనీలో జయలక్ష్మి (70) అనే వృద్ధురాలు తన 96 ఏళ్ల తల్లితో కలిసి 42వ నెంబర్‌ ఇంట్టో నివాసముంటోంది.
కర్నూలు నగర పరిధిలో లేదు. బండమీది తాండ్రపాడు పంచాయతీ పరిధిలోకి వస్తుందని చెపుతున్నారు. కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించే స్థోమత ఈ పంచాయతీకి లేదు. పైగా ఇక్కడ స్థలాలు పొందిన వారు ఎక్కువగా నగరవాసులే. కాలనీలో వసతులు, వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలంటే కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలోకి వస్తేనే సాధ్యమవుతుందని గృహ నిర్మాణ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల నగర పరిధిని పెంచడంతో ఈ కాలనీ ‘కుడా’ పరిధిలోకి వచ్చింది. గతేడాది గృహ నిర్మాణ శాఖమంత్రి కాల్వ శ్రీనివాసులు కాలనీని పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ స్లాబు వేసుకోవడానికి అదనంగా రూ.25 వేలు ఇస్తామని, అందుకు రూ.72 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వెంటనే నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.
కనీసం నీటి సౌకర్యం, బస్సు ఏర్పాటు చేస్తే వస్తామని సౌకర్యాలపై మంత్రిని నిలదీశారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడతానని మాట ఇచ్చి సంవత్సరం గడిచినా ఎలాంటి చర్యలూ లేవు. కనీస వసతుల్లేకనే ఎవ్వరూ నివాసం ఉండడానికి ముందుకు రావడం లేదు. ఈ కాలనీ ఇటీవల ‘కుడా’ పరిదిలోకి వచ్చింది. ఆగిన నిర్మాణాలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు రూ.72 కోట్లు కేటాయించారు. బోర్ల కోసం జిల్లా కలెక్టర్‌ రూ.20 లక్షలు కేటాయించారు. లబ్ధిదారులు త్వరగా చేరితే సౌకర్యాలూ వేగవంతంగా కల్పించే అవకాశం ఉంది.
Tags:Indirama’s home waste …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *