సాగునీరు లేక బోరుమంటున్నారు

Date:15/02/2018
నెల్లూరు ముచ్చట్లు:
 సీజన్‌లో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వమంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వరిపంట సాగుచేసిన రైతులు ప్రస్తుతం సాగునీరు అందక వేసిన పంట ఎండిపోవడానికి సిద్ధంగా ఉండడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతన్నలు పంట వెన్నుదశకు చేరుకున్న సమయంలో సాగునీరు లేక తమ కళ్ల ముందే పంట ఎండుతుండడంతో లబోదిబోమంటున్నాడు. రిజర్వాయర్లలో పుష్కలంగా నీరున్నా కాలువ ద్వారా నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమవటంతో రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. మనుబోలు మండల పరిధిలోని బండేపల్లి గ్రామంలో సుమారు 200 ఎకరాలలో వరిపైరు సాగునీరు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు అక్కంపేట, పర్లపాడు గ్రామాలలో ఇదే పరిస్ధితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం రాజోలపాడు వద్ద సుమారు 45లక్షల రూపాయల వ్యయంతో కండలేరు నుండి బండేపల్లి బ్రాంచి కెనాల్ ద్వారా బండేపల్లి చెరువుకు నీరిస్తామని హామీ ఇచ్చారు. అయితే జిల్లా కలెక్టర్ నుండి అనుమతి రాకపోవడంతో భూమి పూజతో పనులు ఆపివేసారని రైతులు చెబుతున్నారు. కనుపూరు కెనాల్ చివరి ఆయకట్టు ప్రాంతమైన బండేపల్లి బ్రాంచి కెనాల్ నుండి బండేపల్లి చెరువుకు సాగునీరు రావలసి ఉంది. అయితే వంతుల వారిగా కెనాల్ నుండి పలు గ్రామాలకు అధికారులు నీరు అందిస్తున్నారు. బండేపల్లి చెరువుకు సాగునీరు వచ్చి సుమారు 20రోజులు కావస్తుందని, దీంతో తమ పొలాలలో సాగునీరు లేకపోవడంతో పంట ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. రైతులు వేసిన పంట ప్రస్తుతం వెన్నుదశలో ఉండటంతో ఈ పంటకు రెండు తడులు నీరు ఇస్తేనే పంట చేతికి అందే పరిస్థితి ఉంది. బండేపల్లి చెరువు కింద ఉన్న మిట్టతూము కింద సుమారు 120ఏకరాల ఆయకట్టు ఉందని, ప్రస్తుతం సాగునీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని గ్రామ సర్పంచ్ ఆవుల వెంకటరమణయ్య తెలిపారు. మిగిలిన రెండు తూముల కింద కూడా రెండు, మూడు రోజులలో నీరు అందించకుంటే మరో 200 ఎకరాలలో పంట ఎండిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఎకరాకు సుమారు 20వేల రూపాయలకుపైగా ఖర్చు చేశారని, పంట ఎండిపోతే రైతుకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. గత ఏడాది కూడా ఈ ప్రాంతానికి ప్రభుత్వం సాగునీరు అందించకపోవడంతో పంట సాగు చేయని కారణంగా రైతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం పంటలకు సాగునీరు అందిస్తామని, ఒక్క ఏకరా కూడా ఎండనివ్వమని మంత్రులు, అధికారులు హామీ ఇవ్వడంతో అప్పులు తెచ్చి వరిపంట సాగు చేశామని, ప్రస్తుతం వెన్నుదశలో ఉన్న పంటకు సాగునీరు అందక ఎండిపోతోందని రైతులు వాపోయారు. పంటకు త్వరితగతిన సాగునీరు అందించకుంటే ధాన్యం తరకలుగా మారిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమ పరిస్ధితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారిందని వాపోతున్నారు. అధికారులు తక్షణం స్పందించి బండేపల్లి చెరువుకు అత్యవసరంగా సాగునీరు అందిస్తే తమకు పంట చేతికి దక్కుతుందని, ఖర్చులు మిగులుతాయని రైతులు కోరుతున్నారు.
Tags: Irrigation or boring

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *