బంగారు బాల్యాన్ని ప్రోత్సహించడం తప్పా?

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ప్రస్తుతం బాల్యం ఒక శాపం. మూడేళ్ళయినా నిండని చిన్నారులకు వీపుపై కేజీల కొద్దీ బరువులు, నిద్ర చాలకుండానే స్నానం చేయించి ఏడుస్తుండగానే తయారుచేసి వ్యాను ఎక్కించగా అందులోనే వారు ఏడ్చి ఏడ్చి అలసిసొలసి నిద్రపోవడం. ఇదే విధంగా పదవ తరగతి వరకూ వాళ్ళ జీవితం సాగుతుంది. ఇక్కడే తల్లిదండ్రులు పిల్లకేది ఇష్టమో అడగరు. వాళ్ళ కలలు నిజం చేసుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి తగిన విద్యను చదవాలని చెబుతారు. ఇష్టపడకుండానే చదవడం మొదలుపెడతారు. కొంతమంది పిల్లలకు మృదు నైపుణ్యాలుంటాయి. ఒక వ్యాస రచన వ్రాద్దామనుకుంటారు లేదా వక్తృత్వపు పోటీకి వెళ్లాలనుకుంటారు. లేదా అందమైన బొమ్మలు గీయాలనుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రిన్సిపాల్‌కి చెప్తారు. మా పాప/బాబుని మీరు ఎక్కడికీ పంపకండి. వాడు ఇంజనీరో, డాక్టరో అయితే చాలు. ఎంసెట్ ర్యాంకు వస్తే చాలని. కొండొకచో కొంతమంది పోటీకు వెళ్లడమే అవమానంగా భావిస్తారు. ఇక గ్రంథాలయంకి వెళ్ళే తీరికే ఉండదు. కనీసం కళాశాల గ్రంథాలయంలోని కొన్ని మంచి పుస్తకాలు చదివితే వత్తిడి తగ్గుతుందనుకుంటే జనరల్ బుక్స్ ఇవ్వం, ఏదైనా పాఠ్యాంశానికి సంబంధించినదైతే ఇస్తాం. పరీక్షలవ్వనీ అంటారు. ఆ పరీక్షలనేవి ఈ రెండేళ్ళు పూర్తయ్యేవరకూ రెండు మూడు రోజులకొకసారి వస్తూనే వుంటాయి. మరి వత్తిడి తగ్గేదెలా? ఇంటివద్ద ముగ్గులవీ వేసి అమ్మాయిలు వత్తిడి తగ్గించుకునేవారు. అపార్ట్‌మెంట్స్ వచ్చాక ఆ ఛాన్స్ లేదు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కూడా పార్లమెంటులో ఒత్తిడి తగ్గించుకోవడానికి పేపర్ తీసుకుని ముగ్గులు వేసేవారట. నాయకుల చరిత్రలు చదివే తీరిక నేటి యువతకు లేదు. ఎన్ని కష్టాలుబడైనా వాళ్ళు ఎలా గొప్పవాళ్ళయ్యారో ఎవరికీ తెలియదు. ‘చినిగిన చొక్కాయైనా తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి అన్నారని వ్యాసం నేర్పించి వారిని పుస్తకమే చదవనివ్వం. తెలుగు భాష మాట్లాడితేనే పాపమని నేర్పిస్తాం. ఇంటర్మీడియెట్‌లో సంస్కృతాన్ని తీసుకోమంటాం. సాహిత్యం చదువుకున్న వ్యక్తి దృఢమైన హృదయం కలిగి ఉంటాడు. తెలివైన నిర్ణయాలతో ముందుకు సాగుతాడు. అందుకే ఏ భాషా సాహిత్యమైనా యువత చదువుకునేలా ఇంట్లో తల్లిదండ్రులు, కళాశాలలో అధ్యాపకులు ప్రోత్సహించాలి. అపుడే మానసిక వత్తిడి తగ్గుతుంది. అందరితో కలిసిమెలిసి జీవించాలని నేర్పించాలి. ఆహారాన్ని పంచుకుని తినాలని బోధించాలి. మానవ జీవితానికి కుటుంబం ఊయలవంటిది అంటాడు అరిస్టాటిల్. అందుకే అది కుటుంబం నుండే రావాలి. పిల్లలకు కావలలసింది మమకారం, ప్రేమ, ఆప్యాయత. అవి నేడు మృగ్యం. మనసులో ఎంతో ఉంటుంది. అది వ్యక్తీకరించే సమయం లేదు. అందుకే వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆప్యాయంగా అమ్మా నాన్నలపై చేయి వేసుకుని ఆదమరచి నిద్రపోవడం లేదు. ఎవరి గదులు వారివి. అమ్మమ్మలు, నాన్నమ్మలు పిల్లల్ని మూడేళ్లవరకు పెంచేవరకే కావాలి. ఆ తరువాత వారు పనికిరాదు. వాళ్ళ దగ్గరకు పిల్లల్ని వెళ్ళనివ్వరు. సమయం వృధా చేస్తున్నారని చదువుకోమని గదుముతారు. ఇక వారికి ఆహ్లాదం ఎక్కడ? అయితే పూర్తిగా పై కారణాలేవీ అని చెప్పలేము. ఎందుకంటే నేటి యువతలో ఆత్మహత్య చేసుకునేంత కష్టంగా వారి దృష్టిలో అనిపించవచ్చు. సున్నితమైన హృదయాలకు, ప్రేమ వైఫల్యం, ర్యాగింగ్ అవమానం- ఇవన్నీ పంచభక్ష్య పరమాన్నాలు పెడితే తిని ఎవరైనా బ్రతుకుతారు. పచ్చడి మెతుకులు తిని కూడా జీవించగలగాలి. కష్టం భరించలేమని ఆత్మహత్య చేసుకుంటే పిడికెడు బూడిదగా మారతారు. చచ్చిపోయేంత బాధయినా ఓర్చుకుంటే మంచి జీవితం వస్తుంది. ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు ఆలంబనగా మిగలవచ్చు.అందరం కలిసి ఈ ఎయిడ్స్ కంటే భయంకరమైన ‘ఆత్మహత్య’ మహమ్మారిని తరిమి తరిమికొడదాం. అందరికీ జీవితకాలం బ్రతికే అవకాశాన్నిద్దాం. స్టూడెంట్స్ ఆత్మహత్య వైపు వెళ్ళడానికి ప్రధానంగా పది కారణాలను ఉదహరించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వాటిలో మొదటిది, ప్రేమరాహిత్యం, రెండోది, ఒంటరితనం ఇక, మూడోది, ఒత్తిడి, నాలుగోది, క్రీడలలో పాల్గొనలేకపోవడం, అయిదోది, ఇష్టంలేని చదువు, ఆరోది, భవాలను పంచుకునే అవకాశం లేకపోవడం, ఏడోది, ఏది చెబుదామన్నా వినని తల్లిదండ్రులు, ఎనిమిదోది, భయం, తొమ్మిదోది, ఆందోళన, చివరిగా పదోది, వ్యతిరేక ఆలోచనలు వంటివి. ఇలా ఇన్ని అవాంతరాలు, సమస్యల మధ్య బాల్యాన్ని ఎలా బతికిస్తామో కాస్త పెద్దలు ఆలోచించాల్సిందే.

Tag : Is it wrong to encourage golden childhood?


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *