Is the word 'water' okay?

మాటలు ‘నీటి’ మూటలేనా?

Date : 21/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న ఆనందం కంటే కూడా అక్కడి ప్రజల కష్టాలు ఎప్పటికి తీరనున్నాయో అన్న ఆందోళనే ఎక్కువవుతోంది. ఎన్నో ఏళ్ల నుండి తెలంగాణను సస్యశ్యామంల చేస్తామని ఎన్నికైన ప్రతీ ప్రభుత్వం మాటలు చెబుతూ వస్తోంది. కానీ ఆచరణలోకి వచ్చే సరికి ఫలితం శూన్యంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాజెక్టులు శంకుస్థాపనలకే పరిమితం అవుతున్నాయి. పూర్తయినా నీళ్లు లేనివి కొన్నయితే, మధ్యలోనే ఆగినవి మరికొన్ని, మిగతావి శిలాఫలకాల దశలోనే ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ కొత్త ఉత్సాహంతో బంగారు తెలంగాణ కోసం అడుగులు వేస్తున్నామంటున్నారు. తాజాగా ఇరిగేషన్‌పై కన్నేశారు. పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనకు సిద్ధమయ్యారు. వీటిని పూర్తి చేసి తెలంగాణను బంగారు పంటలు పండించే నేలగా తీర్చిదిద్దాలన్నది ఆయన ఆశయంగా చెబుతున్నారు. అయితే తెలంగాణా ప్రాంతంలో కాగితాల్లో తప్ప ఆచరణలో అడుగు కూడా ముందుకు పడని ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కొన్ని నత్తనడకన సాగుతుండగా పూర్తయినవి సాగునీరందించడం లేదు. కృష్ణా, గోదావరి నదులతో పాటు ఎన్నో చెరువులు, కుంటలు ఉన్న తెలంగాణలో సాగునీటికి కొదవలేదు. వాటిని ఉపయోగించుకోవడంలోనే పాలకులు సరియైన రీతిలో వ్యవహరించకపోవడం రైతాంగానికి శాపంగా మారింది. ఫలితంగా లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సిన ప్రాజెక్టులు పూర్తికాక తెలంగాణ రైతుల జీవితాలను వెక్కిరిస్తున్నాయి. దశాబ్దాల తరబడి సాగుతూ ఉన్న ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. సాగునీరే కాదు, తాగునీరు లేక నల్లగొండ తల్లడిల్లుతోంది. ఇక్కడ నాలుగు ప్రధాన ప్రాజెక్టులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాంకుడా మధ్యలోనే ఉన్నాయి. ఫ్లోరైడ్ నీటితో మసకబారుతున్న నల్లగొండ వాసులకోసం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంజూరు చేసి పనులు ప్రారంభించారు. ఎస్ఎల్‌బిసిగా పిలవబడే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేదు. 2,70,000 ఎకరాలకు సాగునీరందించడంతో పాటు తాగునీరందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అంచనాలు పెరిగి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 5,607 కోట్లరూపాయలకు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 2,656 కోట్ల రూపాయలు ఖర్చయినా కేవలం 25,000 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందిస్తోంది అంటే పాలకుల నిర్లక్ష్యానికి ఇంత కంటే ఉదాహరణ మరోటి ఉండదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండవ దశ పూర్తయితే నల్లగొండ వాసులకు సాగునీటి కష్టాలు తీరుతాయి. ఈ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. దీంతో పాటు శ్రీశైలం సొరంగమార్గం ప్రాజెక్టు పెండింగ్‌లోనే ఉంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ జిల్లాలోని 2,19,000 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. దీనికి అతీగతీ లేకుండా పోయింది. వీటితో పాటు మరో 11 చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు మంజూరైనా ప్రభుత్వాలు వాటి గూర్చి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తికాలేదు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనులు ప్రారంభించారు. 9,427కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 2005 జూలై నాటికి పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు. పైగా అంచనా వ్యయం పెరిగి తడిసిమోపెడవుతోంది. 5,61,000 ఎకరాలకు సాగునీరు, 480 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు దశాబ్దమైనా పూర్తికాలేదు. ఖర్చు మాత్రం మరో 1,976 కోట్ల రూపాయలు పెరిగింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాల వారి కల్పతరువు శ్రీరాంసాగర్. దీనిని తెలంగాణ వరప్రదాయిని అని పిలుస్తారు. 19,31,000 ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటికీ పూర్తిస్థాయి పనులు కాక పది లక్షల ఎకరాలకు కూడా సాగునీరందించడం లేదు. ప్రాజెక్టు రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాబావానికి తోడు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు కారణంగా ఈ ప్రాజెక్టు కింద చేయాల్సిన సాగు ప్రశ్నార్థకంగా మారింది. 45 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 25 టీఎంసీల నీరు మాత్రమే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు పూర్తికాక ఇప్పటికీ వర్షాధారంపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో చేపట్టిన ఏడు మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయి. గడిచిన 8 ఏళ్లలో వేలాది కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించలేక పోయింది. 2005లో మంజూరైన నీల్వాయి, ర్యాలీ వాగు, గొల్లవాగు, పెద్దవాగు, కొమురంభీం, మత్తడి ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులు సకాలంలో రాకపోవడం, నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇవి పూర్తయితే దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరందుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత -చేవెళ్ల ద్వారా 1,76,000 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. సాత్నాల ప్రాజెక్టు కాలువల నిర్మాణం పూర్తయితే 24,000 ఎకరాలకు సాగునీరందుతుంది. శ్రీరాంసాగర్ రెండవ దశ పనులు పూర్తికాలేదు. గడ్డన్న వాగు ప్రాజెక్టు పూర్తయితే ముథోల్ నియోజకవర్గంలో 14,000 ఎకరాలకు సాగునీరందించవచ్చు. 32 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంతరాష్ట్ర ప్రాజెక్టు పెన్ గంగ పూర్తి ఇంకా చేయాల్సి ఉంది. వీటన్నింటికి వేలాది కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, ఇల్లంతకుంట నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీరందించేందుకు చేపట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పనులు ప్రారంభించారు. 2,20,000 ఎకరాలకు సాగునీటికోసం 339 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కాంట్రాక్టర్ 20 శాతం పనులు చేసి వదిలేసారు. ఏడాది క్రితం మళ్లీ టెండర్లు పిలిచారు. 460 కోట్ల రూపాయలకు ఐవిఆర్సిఎల్ కంపెనీ పనులు దక్కించుకున్నప్పటికి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని 16 మండలాలకు సాగునీరు, 151 గ్రామాలకు తాగునీటికోసం 2005లో దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులకు శంఖు స్థాపన చేసారు. 1800 కోట్ల రూపాయలతో 56 నెలల్లో పూర్తి చేయాలని మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. పంపింగ్ స్టేషన్ పనులే ప్రాథమిక దశలో ఉన్నాయి. 140 కిలోమీటర్లు కాలువలు తవ్వాల్సి ఉంది. ప్రాజెక్టు పనుల కోసం తెచ్చి పడేసిన భారీ పైపులు, ఇనుము దొంగలపాలవుతోంది. ఇదొక్కటే కాదు 2008లో ప్రారంభించిన నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ లింక్ కెనాల్ పనుల పరిస్థితి అంతే. 19005 కోట్లతో చేపట్టిన ఈ పనుల జాడే కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో 6 ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనులకు ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. పనులేమి చేయకుండానే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరుతో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సాగునీరిచ్చేందుకు 120 కోట్ల రూపాయలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొదటి దశ పనులు ప్రారంభించారు. పనులు మొదలు పెట్టి ఎనిమిదేళ్లయినా ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికే 60 కోట్ల రూపాయల వ్యయం చేసారు. ఇప్పుడు అంచనాలు పెరిగి 200 కోట్లకు చేరింది. కాలువల నిర్మాణం, మైనర్, సబ్ మైనర్ పనులు చేపట్టాల్సి ఉంది. పోలవరం బ్యాక్ వాటర్ ఆధారంగా 1900 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం పనులు ప్రశ్నార్థకంగా మారాయి. దీని ద్వారా 15,000 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. చర్లమండలం తాలిమేరు ప్రాజెక్టుకు మరమ్మతు పనులు చేయాల్సి ఉంది. జపాన్ బ్యాంకు నుంచి 50 కోట్ల రుణం మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఇవి పూర్తయితే 20,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మెదక్ జిల్లా వాసులకు సింగూరు జలాశయం నీటిని అందించాలని, 2006లో సింగూరు ప్రాజెక్టునుంచి వరద కాలువ పనులు ప్రారంభించారు. దీనికోసం 88కోట్ల 89 లక్షల రూపాయలు మంజూరు చేసారు. 24 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 60 కిలోమీటర్ల మేర ఉప కాల్వలు నిర్మించాల్సి ఉండగా ఎనిమిదేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాలేదు. జాప్యం జరుగుతున్నా కొద్ది అంచనావ్యయం పెరుగుతుందన్న ఆశతో కాంట్రాక్టర్లు పనులను సాగదీస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో నల్లవాగు కుడి, ఎడమ కాలువల ద్వారా 5,330 ఎకరాలకు సాగునీరందించేందుకు 14 కోట్ల 19 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. ఇప్పటికి పనులు పూర్తికాకపోవడంతో నీళ్లు గోదావరిలోకి వృధాగా పోతున్నాయి. తడకపల్లి గ్రామంలో ప్రాజెక్టు నిర్మిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇది పూర్తయితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రాణహిత-చేవెళ్ల రిజర్వాయర్ పనులు సర్వేలకే పరిమితమయ్యాయి. సిఎం సొంత జిల్లా కావడంతో పనులు పూర్తవుతాయనే ఆశలు జిల్లా వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది. వేలాది కోట్లు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసారు. ఇంకా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టులు పూర్తయి, బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడాలంటే మళ్లీ వేలాది కోట్లరూపాయలు అవసరం. ఆ నిధులెలా సమకూరుస్తారు? ఇచ్చిన హామీల మేరకు లక్షలాది ఎకరాలకు సాగునీరెలా అందిస్తారనేది నూతన ప్రభుత్వంపై ముందున్న అతిపెద్ద సవాలు.

Tags : Is the word ‘water’ okay?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *