Is vegetable cultivation difficult?

కూరగాయల సాగు కష్టమేనా?

Date:19/06/2018
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
ఈ దఫా కూరగాయల సాగు కొంత భారంగా మారనుందని సిరిసిల్ల రైతాంగం అభిప్రాయపడుతోంది. రాయితీ విత్తనాల సౌకర్యం లేకపోవడంతోనే పలువురు రైతులు ఈ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఏటా పెరిగిపోతున్న కూరగాయల ధరలను అదుపులో ఉంచేందుకు దిగుబడి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూరగాయల సాగు కోసం కాలనీలు సైతం ఏర్పాటుచేయాలని అనుకుంది. ఇంత ప్రోత్సాహకర వాతావరణం కల్పించి విత్తనాలకు మాత్రం రాయితీ ఉండదని తేలడంతో రైతుల్లో నిరాశ అలముకుంది. దీంతో కూరగాయల ధరలు ఎప్పట్లానే పెరిగే అవకాశం ఉందని, రైతులకూ వీటి సాగు భారంగా మారనుందని పలువురు అంటున్నారు. ఇటీవలిగా కూరగాయల సాగు తగ్గుతోంది. దీంతో జనాభాకు సరిపడా కూరగాయులు అందుబాటులో ఉండడంలేదు. పొరుగురాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా కాయగూరల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఏదైతేనేం.. రైతులు, వినియోగదారులే నష్టపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఈ కష్టాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా.. విత్తనాలకు సబ్సిడీ ఇవ్వకపోవడంతో ఈ పంటలు పండించేవారు నిరాశలో కూరుకుపోయారు. జిల్లా భూములు అన్ని రకాల పంటల సాగుకు అనుకూలంగానే ఉంటాయి. అయితే అవగాహన లేక కొందరు ఆసక్తి లేక మరికొందరు రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపడంలేదు. దీంతోప్రజల అవసరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పొరుగురాష్ట్రాల్లో కారుచవకగా దొరికే విత్తనాలు ఇక్కడి రైతుల వద్దకు వచ్చేసరికి ప్రియం అవుతున్నాయి. రేట్ భారీగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితి గమనించిన ప్రభుత్వం ఏ జిల్లాకు అనుకూలమైన కూరగాయల సాగును ఆ జిల్లాలో ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు విత్తనాలు రాయితీపై రెండేళ్ల కిందటి వరకు పంపిణీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతం రాయితీకి బ్రేక్ పడింది. ప్రభుత్వం గతేడాది వరకు కూరగాయల విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేసేది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌కేవీవై నిధులు రాయితీకి వెచ్చించలేని పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఈ ఖరీఫ్‌లో కూరగాయలు సాగు చేసే రైతులు ప్రైవేట్‌గానే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో కూరగాయల సాగు భారమవుతుందని రైతులు వాపోతున్నారు.
Tags; Is vegetable cultivation difficult?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *