కొత్త మున్సిపాల్టీలకు ఇంకా టైముంది…

Date:22/05/2018
వరంగల్ ముచ్చట్లు:
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవనున్న 71 పురపాలికలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదే మిగిలి ఉండటంతో మునిసిపల్‌ ఎన్నికలు వాయిదా వేయడం ఖాయమని చర్చ జరు గుతోంది. మరో వైపు కొత్తగా ఏర్పాటవనున్న పురపాలికల్లో మూడేళ్ల వరకు ఆస్తి పన్ను పెంచొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ..ఎన్నికల నిబంధనల ప్రకారం పురపాలికల పాలక వర్గాల పదవీకాలం ముగిసిన 6 నెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే కొత్త పురపాలికల్లో ఎన్నికల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు అందలేదని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 73 పురపాలికల్లో మెజారిటీ పురపాలికల పదవీకాలం 2019 జూన్‌లో ముగియనుంది. దీంతో ఈ పురపాలికలతో కలిపే కొత్త పురపాలికలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటి తర్వాతే మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతాయని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.  71 పురపాలికలుగా ఆవిర్భవించనున్న 173 గ్రామ పంచాయతీలతోపాటు 5 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 36 మునిసిపాలిటీల్లో విలీనమవనున్న 136 గ్రామాల ప్రజలకు ఈ నిర్ణయంతో ఊరట లభించనుంది. ఐదేళ్లకోసారి ఆస్తి పన్నుల పెంపు అమలు చేయాల్సి ఉండగా మెజారిటీ పురపాలికల్లో 2002లో నివాస గృహాలు, 2007లో నివాసేతర భవనాలపై ఆస్తి పన్ను పెంచారు. జీహెచ్‌ఎంసీతో పాటు మిగిలిన పురపాలికల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నులు పెంచలేదు. ఐదేళ్ల కింద ఏర్పడిన 23 పురపాలికల్లో 2015 ఏప్రిల్‌ నుంచి పన్నుల పెంపు అమలు చేశారు.  దీంతో ఆ పురపాలికల పాలనను ప్రత్యేకాధికారుల చేతికిచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 173 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 71 చిన్న పట్టణాల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పురపాలక శాఖ చట్టాలకు ప్రభుత్వం గత నెలలో సవరణలు చేసింది. ఆయా పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే ఈ 71 పురపాలికలు అమల్లోకి రానున్నాయి. మే 31తో పంచాయతీల పదవీకాలం ముగియనుండ గా జూన్‌ 1 నుంచి ఈ పట్టణాలు ఏర్పాటవనున్నాయి.
Tags:It’s time for new municipalities …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *