Judges Committee on AP High Court

ఏపీ హైకోర్టుపై న్యాయమూర్తుల కమిటీలు

-ఫుల్‌కోర్టు సమావేశంలో ఎంపిక బాధ్యత అప్పగింత

-తాత్కాలిక చీఫ్ జస్టిస్‌ నాయకత్వంలో కమిటీల ఏర్పాటు

-సీఎం చంద్రబాబు లేఖతో మరింత పుంజుకున్న వేగం

Date: 04/01/2018

హైదరాబాద్ముచ్చట్లు:

రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హైకోర్టు మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుగానే దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న హైకోర్టు విభజనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటుచేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. ఏపీ హైకోర్టును నిర్వహించేందుకు అనువైన తాత్కాలిక భవనాలను పరిశీలించాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాసిన నేపథ్యంలో న్యాయమూర్తులు రంగంలోకి దిగారు. అందుబాటులో ఉన్న న్యాయమూర్తులతో బుధవారం సాయంత్రం ఫుల్‌కోర్టు సమావేశం నిర్వహించారు. హైకోర్టు సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీ ఒకింత వాడివేడిగా సాగిందని సమాచారం. ఏం చేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తంకావడంతో ఓటింగ్‌ దాకా వెళ్లినట్టు తెలుస్తోంది. ఓటింగ్‌లో పాల్గొన్నవారు ముందుగా తాత్కాలిక భవనాలను పరిశీలించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారని, అందుకోసం న్యాయమూర్తులతో సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారని విశ్వసనీయంగా తెలిసింది. దానితోపాటే ఉద్యోగుల విభజనపై కూడా మరో సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈ కమిటీల ఎంపిక బాధ్యతను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు ఫుల్‌కోర్టు సమావేశం అప్పగించినట్టు తెలుస్తోంది. భవనాలను పరిశీలించిన తర్వాత మరోసారి సమావేశంకావాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కమిటీల ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో ఏపీకి హైకోర్టు విషయంలో కసరత్తు మరింత వేగం పుంజుకున్నట్టేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. సుమారు గంటపావుపాటు సాగిన సమావేశంలో ఏపీ హైకోర్టు ఏర్పాటుపై ఆసక్తికర చర్చ జరిగిందని తెలిసింది. తాత్కాలిక భవనాల్లో ఏపీ హైకోర్టు ఏర్పాటుపై ఏపీ ప్రాంతానికి చెందిన, ఏపీ హైకోర్టుకు కేటాయించిన కొందరు న్యాయమూర్తులు అభ్యంతరాలు వ్యక్తంచేశారని సమాచారం. మౌలిక సదుపాయాలు, వసతులపై సందేహాలు లేవనెత్తుతూ ఒకింత ఆందోళన వ్యక్తంచేశారని తెలుస్తోంది. ఆందోళన వ్యక్తంచేసిన పలువురు న్యాయమూర్తులు తమ వాదనలకు మద్దతుగా హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టులో 2015లో దాఖలైన వ్యాజ్యంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం జారీచేసిన ఉత్తర్వులను ప్రస్తావించారని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన తర్వాతే హైకోర్టును తరలించాలని కోరారని తెలిసింది. శాశ్వత భవనం నిర్మించిన తర్వాతే హైకోర్టును తరలిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయని చెప్తున్నారు. తాత్కాలిక భవనంలోకి హైకోర్టును తరలిస్తే తమకు అమరావతిలో వసతి సౌకర్యాల మాటేమిటంటూ పలువురు న్యాయమూర్తులు గళమెత్తగా ఈ విషయాలపై తరువాత చర్చించవచ్చని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సూచించారని సమాచారం. న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తిన నేపథ్యంలో ఏసీజే ఓటింగ్‌ను నిర్వహించారని తెలిసింది. ఈ ఓటింగ్‌లో మెజార్టీ న్యాయమూర్తులు ముందుగా ఏపీ సర్కార్ ఎంపిక చేసిన భవనాలను పరిశీలించడానికి అంగీకరించారని సమాచారం. పరిశీలన నిమిత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సబ్‌ కమిటీని ఏర్పాటుచేయాలని, దానితోపాటే హైకోర్టు ఉద్యోగుల విభజన కోసం సబ్‌ కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్‌ కోసం మరో కమిటీని కూడా ఏర్పాటుచేయాలని ఫుల్‌కోర్టు నిర్ణయం తీసుకుందని సమాచారం. సబ్ కమిటీలను ఏర్పాటుచేసే బాధ్యతను ఏసీజేకు ఫుల్‌కోర్టు అప్పగించినట్టు తెలిసింది. అమరావతిలో జస్టిస్ సిటీ ఇంకా పూర్తికాని నేపథ్యంలో ఏపీ హైకోర్టును తాత్కాలిక భవనాల్లో కొనసాగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని సమావేశంలో కొంతమంది న్యాయమూర్తులు ప్రస్తావించారని చెప్తున్నారు. జూన్‌ నాటికి హైకోర్టు నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయడం సాధ్యంకాదనే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సమాచారం. హడావిడిగా హైకోర్టును ఏర్పాటుచేస్తే నిర్వహణ సమయంలో ఇబ్బందులు తలెత్తే ఆవకాశముందని పేర్కొన్నారని తెలిసింది. మరో రెండేళ్లలో శాశ్వత భవనాలు పూర్తయ్యే ఆవకాశముందని ఏపీ సర్కార్ చెప్తున్న విషయాన్ని కొంతమంది న్యాయమూర్తులు ప్రస్తావించారని, తమకు నివాస సముదాయాలు, సిబ్బందికి క్వార్టర్లు తప్పకుండా ఏర్పాటుచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారని సమాచారం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని న్యాయమూర్తులు అన్నట్టు తెలుస్తోంది. దీనితోపాటు ఉద్యోగులకు భత్యాలను పెంచే విషయాన్ని ప్రభుత్వానికి కచ్చితంగా చెప్పాలని మరికొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. సమావేశంలో భాగంగా హైకోర్టు విభజనలో న్యాయవాదులను భాగస్వాములనుచేసే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. న్యాయవాదులను భాగస్వాములనుచేస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, అయితే న్యాయవాదుల ప్రాక్టీస్‌కు ఇబ్బందులు లేకుండా చాంబర్లువంటి విషయాలపై వారి అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుందని న్యాయమూర్తులు సూచించినట్టు సమాచారం. ఉద్యోగుల విభజనపై సబ్ కమిటీని ఏర్పాటుచేసి, విధివిధాలను సైతం రూపొందించాలని నిర్ణయించారని తెలిసింది. తీవ్ర వాదోపవాదాల అనంతరం తాత్కాలిక భవనాల పరిశీలనకోసం కమిటీని ఏర్పాటుచేసే బాధ్యతను ఏసీజేకు అప్పచెప్పారని సమాచారం. త్వరలోనే సబ్‌ కమిటీని ఏర్పాటు చేసే ఆవకాశముందని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి.

Tags: Judges Committee on AP High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *