Kabbalah is limited computer education

కబుర్లకే పరిమితమైన కంప్యూటర్ విద్య

Date: 14/12/2017

దిల్లీ ముచ్చట్లు:

ప్రభుత్వ విద్య ఆధునికీకరణ యజ్ఞానికి పురిటి నొప్పులు తప్పడం లేదు. ఒకపక్క కేంద్రం, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగాన్ని ఉద్దరిస్తామనే మాటలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. కంప్యూటర్ విద్య కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చినా అవి టీచింగ్ స్టాఫ్ గేములు ఆడుకోవడానికి, వ్యక్తిగత పనులు నిర్వహించుకోవడానికీ ఎక్కువ శాతం ఉపయోగపడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘డిజిటల్ అక్షరాస్యత’ కార్యక్రమం ఇతర అక్షరాస్యత కార్యక్రమాలవలెనే కేవలం పేరు రాయగలిగితే చాలు ఆ వ్యక్తికి సర్టిఫికెట్ ఇచ్చేట్లుగా తయారయింది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ నాసిరకం ‘అక్షరాస్యుల’ సంఖ్య పెంచేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లయింది. రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు సమాచార టెక్నాలజీలో సర్టిఫికెట్ (ఆర్‌ఎస్-సిఐటి) తప్పనిసరి. ఇది 20 గంటల ఉచిత సర్టిఫికెట్ కోర్సు. ఇది ఆధార్‌కు అనుసంధానమయిన కోర్సు. ఇది ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం. 2019 మార్చి నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6 కోట్ల కుటుంబాలను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం దీని లక్షం. ఇందుకు రూ.2,351 కోట్లు కేటాయించాలని సంకల్పించారు. లక్షాన్ని చేరుకోవడానికి దేశంలోని రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను ఈ పథకం కిందకు చేర్చారు. ఒక్కో పంచాయతీలో 200-300 మంది అభ్యర్థులు రిజిస్టర్ అవుతారని భావిస్తున్నారు. ఈ పథకం అమలు పర్యవేక్షణకు 1956 కంపెనీల చట్టం ఇగవర్నెన్స్ సర్వీసుల కింద కేంద్రప్రభుత్వ ఐటి మంత్రిత్వ శాఖ ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పింది. వాటిని కామన్ సర్వీస్ సెంటర్లు అని పిలుస్తారు. సిఎస్‌సిలు ఆయా పంచాయతీల్లో పిఎంజిడిఐ, ఎస్‌హెచ్‌ఎ శిక్షణను ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం కింద అందిస్తాయి. శిక్షణ భాగస్వాముల కింద వివిధ ఏజెన్సీలు సహకరిస్తాయి. ప్రతి గ్రామ పంచాయతీలో శిక్షణ కేంద్రం గ్రామాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శిక్షణ కేంద్రాలు ఆ గ్రామాలకు చాలా దూరంగా ఉండడం అభ్యర్థులకు సమస్యగా మారింది. ఈ సరికే పనిచేస్తున్న ప్రయివేట్ కంప్యూటర్ శిక్షణ సంస్థలను కేంద్రాలుగా మార్చారు. గంటపాటు ఆన్‌లైన్‌లో ‘ఆబ్జెక్టివ్ పరీక్ష’ ఉత్తీర్ణులయిన ఒకో రిజిస్టర్డ్ అభ్యర్థికి రూ. 300 చొప్పున ఈ కేంద్రాలకు చెల్లిస్తారు. ప్రతి కేంద్రానికి వెబ్ క్యామ్, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదా ఐరిస్ స్కానర్ ఉన్న కనీసం మూడు కంప్యూటర్లను ఇస్తారు. వాటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఒక్కో అభ్యర్థి నుంచి ఆధార్‌ నెంబర్, బ్యాంక్ వివరాలను శిక్షకుడు తీసుకుంటాడు. పంచాయతీ సర్పంచ్ నుంచి వాటికి ధ్రువీకరణ పత్రాలను తీసుకోవాలి. అలాగే ఇ మెయిల్ అడ్రస్‌ను డిజిటల్ లాకర్స్ నుంచి సరిచూసుకోవాలి. ప్రతిరోజు 2 గంటల శిక్షణతోపాటు పురోగతి తెలిపే పత్రాలను శిక్షకుడు పూరించాలి. ఇటువంటి లాంఛనాల భారం వల్ల శిక్షణ కుంటుపడి డిజిటల్ అక్షరాస్యత తగినంతగా సమకూర్చలేకపోతున్నారు. ఈ లాంఛనాల సంఖ్య ఎంత పెద్దదంటే వాటిని పూరించడానికే సమయం సరిపోతోందని, దానితో గ్రామీణులకు డిజిటల్ అక్షరాస్యతలో తగినంత శిక్షణ ఇవ్వలేకపోతున్నామని ఒక శిక్షకుడు తెలిపాడు. ఒక్కో అభ్యర్థికి ఇచ్చే రూ. 300లో చేతికి అందేది రూ. 225 మాత్రమేనని, ట్రయినింగ్ భాగస్వాములు తమ కమీషన్ మినహాయించుకుని ఇస్తారని కూడా ఆయన తెలిపారు. సర్పంచ్ కూడా వాటా అడుగుతాడని, ఇవన్నీపోను ఒక్కోసారి తమ చేతిలోకి చాలా తక్కువ మొత్తం చేరుతుందని చెప్పారు. అంతతక్కువ డబ్బు కోసం ఎవరైనా ఎందుకు శ్రమపడతారు అని ఆయన అడుగుతున్నారు. చాలా మంది శిక్షకులు అభ్యర్థుల నుంచి కూడా రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఉచితంగా సాగాలి. ఆ లక్షానికే తూట్లుపడుతున్న పరిస్థితి ఉంది. కార్యక్రమం కింద 250 మంది అభ్యర్థులు నమోదు కాగానే అడ్మిషన్లు నిలిపివేస్తారు. ఆ 250 మందిలో సాధారణంగా ఎవరూ ఫెయిల్ అవరు. కానీ ఎవరైనా కొద్దిమంది ఫెయిల్ అయిన పక్షంలో వారి స్థానంలో కొత్తగా అభ్యర్థులను నమోదు చేస్తారు. ఈ ఆన్‌లైన్ పరీక్షలో 25 ప్రశ్నలు వుంటాయి. వాటిలో ఏడింటికి సరిగా సమాధానం ఇస్తే అభ్యర్థి ఉత్తీర్ణుడు అవుతాడు. ఆ విధంగా ఎక్కువ మంది ఉత్తీర్ణులను చూపించి పథకం విజయవంతం అయినట్లు చెప్పడం ప్రభుత్వ లక్షంగా కనిపిస్తోంది. ఉత్తీర్ణులు కాని అభ్యర్థులకోసం కేంద్రానికి ఏమీ చెల్లించరని ఒక గ్రామ శిక్షకుడు తెలిపాడు. 52.5 లక్షల మంది ప్రజలకు ఐటి శిక్షణ అందించడం దాని లక్షం. ఈ పథకాన్ని మూసివేసి ప్రస్తుత ప్రధాని పథకాన్ని ఆరంభించారు. ఎన్‌డిఎల్‌ఎంను సరిగ్గా పర్యవే క్షించకపోవడం వల్ల ప్రజలు దానిని దుర్వినియోగపరిచారు. ఎన్‌డి ఎల్‌ఎం కింద ఎన్‌రోల్‌మెంట్‌కు పరిమితి లేదు. శిక్షణ ఖర్చులు కూడా అధికం. ఎస్‌సి/ఎస్‌టి అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించాలి. అయితే ఒబిసి కేటగిరి వారు కేవలం రూ.300 చెల్లిస్తే చాలునని నిబంధన విధించారు. ఇది విమర్శలకు గురి అయింది. ఈ పథకం ద్వారా శిక్షకులు భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నారు. వారిపై సరైన అదుపు కొరవడింది. అభ్యర్థుల నుంచి ఆధార్ కార్డులను సేకరించి శిక్షకులే స్వయంగా పరీక్షలు నిర్వహించడం అవినీతికి దారితీసింది.సర్టిఫికెట్లను రాజస్థాన్‌లో మాదిరిగా దేశమంతటా ఉద్యోగాలకు తప్పనిసరి చేస్తే ఎలా అన్న భయాలు వ్యాపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ పథకం ఫలవంతం అవుతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్టిఫికెట్లను ఉద్యోగాలకు తప్పనిసరి చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అసల యిన డిజిటల్ అక్షరాస్యతను అందించడంలో పథకం విఫలం అయినట్లేనని చెబుతున్నారు. పర్యవేక్షణ లోపించే పథకాలు విజయవంతం అయిన దాఖలాలు లేవు. కేంద్రం తన కర్తవ్యాన్ని సమర్ధమంతంగా నిర్వర్తిస్తే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయనడంలో సందేహంలేదు.

Tag: Kabbalah is limited computer education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *