చిన్నశేషవాహనంపై శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
తిరుపతి ముచ్చట్లు:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది.రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం.
స్నపన తిరుమంజనం :
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.ఈ కార్యక్రమంలో జెఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, వైఖానస ఆగమ సలహాదారు విష్ణుభట్టాచార్యులు, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజి రంగాచార్యులు, కంకణ భట్టార్ శేషాచార్యులు పాల్గొన్నారు.
Tags: Kalyana Srinivasu in the decoration of Sri Murali Krishna on a small relic vehicle