KCR screen for water business!

నీటి వ్యాపారానికి కేసీఆర్ తెర!

-భగీదథ పేరిట తెలంగాణలో దోపిడి?
-తెదేపా చేయని సాహసానికి తెరాస రెడీ

Date :21/12/2017

తెలంగాణ ముచ్చట్లు: 

తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరథ అంటు, మిషన్ కాకతీయ అంటూ డబ్బాలు కొట్టి వేల కోట్ల రూపాయలు నీటి వనరుదల పేరిట ఖర్చుచేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఈ ముసుగులో దుర్వినియోగం అవుతున్న డబ్బు ఎంతో గానీ, అసలు ప్రభుత్వ లక్ష్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. భగీరథ పేరుతో తాగునీటి వ్యాపారానికి సర్కారు సిద్ధమవుతున్నట్లు తాజా పరిస్థితులు రుజువుచేస్తున్నాయి.తొమ్మిది గ్రామీణ జిల్లాలు (హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధి మినహాయించి) తలా ఒక్కంటికి రోజుకు వంద లీటర్లు చొప్పున 3 కోట్ల 19 లక్షల మంది ప్రజలు 25 వేల 139 గ్రామాలు (ఆవాస ప్రాంతాలు) 67 పట్టణాలకు ఇంటింటికీ తాగు నీరు అందించే లక్ష్యంతో తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లరు కార్పొరేషన్‌ (టీడీడబ్ల్యూఎస్‌సీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మిషన్‌ భగీరథ ద్వారా 2018 నాటికి ఇంటింటికీ తాగునీరు అందించకుంటే 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు అడగబోనని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. కానీ నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించి డబ్బులు ఎంత వసూలు చేయనున్నదీ మాత్రం చెప్పలేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన, వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు వల్ల 2 వేల ఏళ్లలో జరిగిన అభివృద్ధి 200 ఏళ్లలో, 200 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 20 ఏళ్లలో 20 ఏళ్లలో జరిగిన అభివృద్ది రెండేళ్లలో జరుగుతుందన్నది ప్రభుత్వ వాదన. ఇంత వరకూ కేసీఆర్, ఆయన అనుచరగణం చేస్తున్న విశ్లేషణ బాగానే ఉన్నా మిషన్‌ భగీరథ ద్వారా అందించే తాగునీటికి నాలుగేళ్లలో కాదు కదా రెండేళ్లలో కూడా అందించవచ్చు. అసలు విషయం ఇది కాదు. తాగునీటిని వ్యాపార సరుకుగా మార్చనున్నారా? లేదా?! మీటర్లు బిగించనున్నారా? లేదా?! ఎన్ని లీటర్లకు ఎన్ని డబ్బులు వసూలు చేయనున్నారు? ఈ ప్రశ్నలకు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేకపోలేదు. కృష్ణా, గోదావరి నదులపై ఇప్పటికే నిర్మించిన నాగార్జునసాగర్‌, శ్రీశైలం, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, కడెం తదితర ప్రాజెక్టుల నుండి నిర్మించబోయే ప్రాజెక్టుల నుండి 10 శాతం నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించడం ద్వారా 63 టీఏంసీ (1టీఏంసీ=2838.68 కోట్ల లీటర్లు)ల నీటిని గృహ అవసరాలకు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక యూనిట్లకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం లక్షా 25 వేల కిలోమీటర్ల మేర వివిధ సామర్ధ్యం కలిగిన పైపులైన్ల నిర్మాణం, 18 ఇంటెక్‌వెల్స్‌, 63 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌, 7లక్షల 50వేల లీటర్ల నీటినిల్వ సామర్ధ్యం కలిగిన 17,407 స్టోరేజీ ట్యాంక్స్‌, 62 మధ్యంతర ఎత్తిపోతల కేంద్రాలు, 186 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం ద్వారా 26 సెగ్మెంట్ల నుండి నీటిని సరఫరా చేయనున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అధిక ఫ్లోరైడ్‌, సాలినిటీ, నైట్రేట్స్‌, ఐరన్‌తో కూడిన నీటిలభ్యత వల్ల, హెచ్చుతగ్గులు గల వర్షపాతం, భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ఉపరితల నీటిశుద్ధి ద్వారా తాగునీరు అందించడం తప్పనిసరి. కానీ ఈ డిమాండ్‌ను ఆసరా చేసుకుని ప్రజా ఉద్యమానికి జడిసి నీటి మీటర్ల జోలికి పోని ప్రపంచ బ్యాంకు ఏజెంటు చంద్రబాబునాయుడు కూడా గతంలో చేయలేని పనిని, కాలువలు తవ్వి కట్టలు వదిలి వేసిన, కట్టలు కట్టి కాల్వలు వదిలేసిన వైఎస్‌ రాజశేఖరెడ్డి కాలం నాటి కాంట్రాక్టర్ల ద్వారా నీటి వ్యాపారానికి సాహసించడమే ఉద్యమనేత కేసీఆర్‌ ప్రత్యేకత. రైతుల భూములకు ఏలాంటి నష్టపరిహారం చెల్లించకుండా, కనీసం నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా పైప్‌లైన్ల నిర్మాణం చేస్తున్నారు. కాంట్రాక్టు పొందిన సంస్థలు తాగునీటి గ్రిడ్‌ల నుండి గ్రామ, పట్టణ పంపిణీ కేంద్రాల (వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు) వరకు బల్క్‌ సప్లయి చేస్తాయి. పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలూ చూస్తాయి. నిర్మాణానికి, నిర్వహణకు అయ్యే ఖర్చుల మొత్తం వినియోగదారుల నుండి పంచాయతీరాజ్‌ సంస్థలు, పురపాలక సంఘాల ద్వారా వసూలు చేసి ఇచ్చే బాధ్యత మాత్రం తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లరు కార్పొరేషన్‌ది.

స్లాబ్‌ సిస్టమ్‌
స్లాబులు 0-100 ఎల్‌పీసీడీ (వాటర్‌ పర్‌ కాపిట పర్‌ డే), 100-125 ఎల్‌పీసీడీ, 125-150 ఎల్‌పీసీడీ, 150 ఎల్‌పీసీడీి పైన వినియోగించే వారీగా నీటి వినియోగదారులను వర్గీకరణ చేయనున్నారు. రోజుకు 100 కన్నా తక్కువగా వినియోగించే వారిని అల్పాదాయ వర్గాలుగా గుర్తించి సాధారణ చార్జీల కన్నా తక్కువగా నీటి ధర నిర్ణయిస్తారు. 150 లీటర్ల కన్నా అధికంగా వినియోగించే వారికి సాధారణ చార్జీల కంటే ఎక్కువగా ధరలు నిర్ణయిస్తారు. అది కూడా తాగడానికి, వంటకు, బట్టలు ఉతకడానికి మాత్రమే నీటి సరఫరా చేస్తారు. ఇతర అవసరాలకు ప్రజలు బోర్లు, బావులను ఆశ్రయించాల్సిందే.

ధర నిర్ణయించే విధానం

మిషన్‌ భగీరథ ద్వారా ఖర్చు పెడుతున్న మొత్తం డబ్బులు రికవరీ చేయడంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా కలిపి నీటి వినియోగ చార్జీలు నిర్ణయిస్తారు. ఈ పథకం మొత్తం ఖర్చు అంచనా 42 వేల కోట్లు (అంచనా వ్యయం రెండుసార్లు మార్చి 22వేల కోట్లను 42 వేల కోట్లకు పెంచారు. కాంట్రాక్ట్‌ సంస్థల కోసం, అధికార పార్టీ ప్రయోజనాల కోసం అంచనా పెంచారన్నది బహిరంగ రహస్యం) 9 జిల్లాలోని 70 లక్షల కుంటుంబాలు, ఒక్కో కుటుంబానికి రూ.60 వేలు. వడ్డీలు కూడా కలిపితే రూ.85 వేలకు పైగానే నిర్మాణ వ్యయం అవుతుంది. సామూహికం (బల్క్‌)గా తాగునీరు అందించే ఒక పథకానికి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చూపెట్టడం దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కడా లేదు. పేరుకు టీడీడబ్ల్యూఎస్‌సీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్ధ. మిషన్‌ భగీరథ పేరుతో తాగునీటి ప్రాజెక్టులన్నీ కార్పొరేట్‌ సంస్ధలు నిర్మిస్తున్నాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. ఇప్పుడు నీటిని వ్యాపారానికి అప్పగిస్తున్నారు. నిధులను ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచడం ద్వారా కాంట్రాక్టర్లకు, కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఉద్యోగాల సంఖ్య కుదిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా పయనిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల దశా-దిశా మార్చుకోకుంటే ప్రజలు మరోసారి ఉద్యమించక తప్పదు.

Tags : KCR screen for water business!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *