KCR to Adilabad on 27th

27న అదిలాబాద్ కు కేసీఆర్

Date:26/02/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన జిల్లాకు వస్తుండడం ఇదే తొలిసారి. గతంలో పలుమార్లు సీఎం పర్యటన తేదీలు ఖరారైనప్పటికి వాయిదాపడుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో ఎన్నికల సమయంలోనే ఆయన ఆదిలాబాద్‌కు వస్తారనే ప్రచారం జరిగింది. స్థానిక మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌కు రావాలని పలుమార్లు విన్నవించడంతో సీఎం సుముఖత వ్యక్తంచేసినా పర్యటన మాత్రం వాయిదాలు పడుతూ వచ్చాయి. తాజాగా 27న జిల్లాకు వస్తుండడంతో సీఎం పర్యటనలో వరాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తుండడం ఎన్నికల సమయం దగ్గపడుతుండడంతో అధికార పార్టీ తరఫున భారీ బహిరంగకు సన్నహాలు చేస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి ఉదయం 9 గంటల సమయంలో జైనథ్‌ మండలంలోని కోర్ట-చనాక వద్ద నిర్మించే ఆనకట్టకు చేరుకుంటారు. అక్కడ ఆనకట్ట పనులను పరిశీలిస్తారు. పెన్‌గంగా నీటిని సాగుకు వినియోగించేలా చేస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్‌ వాగ్దానం మేరకు రూ.500కోట్ల వ్యయంతో 50వేల ఎకరాలకు నీరందించేందుకు జరుగుతున్న ఈ పనులపై సీఎం అధికారులతో మాట్లాడతారు. అక్కడినుంచి హెలిక్యాప్టర్‌ ద్వారా 10 గంటలకు ఆదిలాబాద్‌లోని డైట్‌ మైదానానికి  చేరుకుంటారు. దీనికోసం రెండుచోట్ల హెలిప్యాడ్లు నిర్మించనున్నారు. డైట్‌మైదానంలో దాదాపు 20వేల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. మంత్రి జోగురామన్న ఇప్పటికే నియోజకవర్గంలోని పట్టణంతోపాటు అన్ని మండలాల పార్టీ నేతలకు జనసమీకరణపై ఆదేశాలిచ్చారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచే ఎక్కువసంఖ్యలోనే జనం ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. చుట్టుపక్కల మండలాలైన బోథ్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే తలమడుగు, తాంసి, భీంపూర్‌లనుంచి సైతం జనాన్ని సమీకరించనున్నట్లు సమాచారం. సీఎం తొలిసారి ఆదిలాబాద్‌కు వస్తుండడంతో కొత్త వరాలు ప్రకటిస్తారని ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి. అభివృద్ధికోసం నిధుల ప్రకటన ఉంటుంటనుకున్నా ఆదిలాబాద్‌కు అగ్రికల్చరల్‌ బీఎస్సీ కళాశాల ఇతర వరాలు ప్రకటిస్తారనే చర్చ మొదలైంది. ముఖ్యమంత్రికి ఆదిలాబాద్‌లోనే మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేస్తుండడంతో ఆయన సభ సమయం కాస్త ఆలస్య కావచ్చని సమాచారం.
Tags: KCR to Adilabad on 27th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *