Kidnapped Murdered Sentenced to jail 

అభయ్‌ హంతకులకు బతికున్నన్నాళ్లు జైలు

సాక్షి

Date :26/01/2018

2016లో షాహినాయత్‌గంజ్‌ నుంచి అభయ్‌ కిడ్నాప్‌

గదిలో బంధించి దారుణ హత్య

సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్ద అట్టపెట్టెలో దొరికిన శవం

కేసును వేగంగా విచారించిన కోర్టు

ముగ్గురు నేరస్తులకూ యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు

తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన యువకులు

ఉద్యోగవేటలో రాంచీలో ఒకరికొకరు పరిచయం

యూట్యూబ్‌ ప్రభావంతో సినిమాల్లో నటించాలని కోరిక..

సిటీలో ఒక్కచోటకే చేరిన హంతకత్రయం

‘ఫేస్‌బుక్‌’ ద్వారా చిన్న నటుడితో పరిచయం..

డబ్బు సంపాదించాలని తీవ్ర ప్రయత్నం

అందుకు కిడ్నాప్‌ చేయాలని పన్నాగం

‘ఓ రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’ సినిమా ప్రేరణతో పక్కా ప్లాన్‌

2016 మార్చి 16.. నగరాన్ని కుదిపేసిన ఓ సంఘటన.. అభంశుభం తెలియని ‘అభయ్‌’ అనే పదోతరగతి విద్యార్థి దారుణ హత్య.. సినీ ఊహల్లో తేలియాడుతూ.. తమ కోర్కెలను నెరవేర్చుకునేందుకు ముగ్గురు యువకులు కలిసి ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. తొలుత స్నేహం చేసి.. తర్వాత మాటలతో మభ్యపెట్టి ఆ విద్యార్థిని గదికి తీసుకెళ్లి ప్రాణం తీశారు. పోలీసులకు సవాలు విసిరిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ శాఖ అధికారులు తక్కువ సమయంలోనే హత్యకు పాల్పడిన ఐ.శేషుకుమార్‌ అలియాస్‌ సాయి, పి.రవి, ఎన్‌.మోహన్‌ను అరెస్టు చేసి బోనులో నిలబెట్టారు.

2018 జనవరి 25..
అత్యంత పాశవికంగా అభయ్‌ ప్రాణం తీసిన ముగ్గురినీ నాంపల్లి న్యాయస్థానం దోషులుగా తేల్చింది. హంతకులను చచ్చేదాకా జైల్లోనే (యావజ్జీవ శిక్ష) ఉంచాలని కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.

సాక్షి,సిటీబ్యూరో: సినిమాలపై ఆసక్తితో, వాటి స్పూర్తితో పదో తరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్‌ చేసి, దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను బతికున్నన్నాళ్లు జైల్లోనే ఉంచాలని నాంపల్లి న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. సోషల్‌ మీడియా ద్వారా స్ఫూర్తి పొందిన ముగ్గురు నిందితులు సినిమాల్లో చేరాలనే ఆశతో, ఓ సినిమా ఇచ్చిన ఐడియాతో కిడ్నాప్‌ ప్లాన్‌ చేశారని పోలీసులు తేల్చా రు. అనుకోని పరిస్థితుల్లో అభయ్‌ తమ చేతిలో చనిపోవడంతో మృతదేహంతో సహా పారిపోవాలనుకున్నా సాధ్యంకాకపోవడంతో మృతదేహాన్ని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వదిలేసి రైలులో తప్పించుకున్నారని చార్జ్‌షీట్‌ లో పేర్కొన్నారు. 2016 మార్చిలో చోటు చేసుకున్న ఈ çఘాతుకానికి సంబంధించిన కేసును షాహినాయత్‌గంజ్‌ పోలీసులు ప్రత్యేక ట్రయల్‌ నిర్వహించేలా కోర్టు నుంచి అనుమతి పొం దడంతో  22 నెలల్లోనే న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

రాంచీలో కలిసిన నిందితులు…
తూర్పు గోదావరి జిల్లా కుటుకలూరు, శ్రీకాకుళం జిల్లా జడుపల్లి, రత్తకన్న ప్రాంతాలకు చెందిన ఐ.శేషుకుమార్‌ అలియాస్‌ సాయి, పి.రవి, ఎన్‌.మోహన్‌ రాంచీలోని ఓ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఉద్యోగంలో ఆశించిన సంపాదన లేకపోవడంతో ఎవరికి వారు వేర్వేరు ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. తరచు సోషల్‌ మీడియాతో పాటు యూట్యూబ్‌  చూసే వీరికి సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. రాంచీ తర్వాత ఒడిశాలోని బరంపురం, ఆదిలాబాద్‌ల్లోనూ పని చేసిన సాయి కార్తికేయ ఫౌండేషన్‌ ద్వారా హైదరాబాద్‌ వచ్చాడు. 2015 ఆగస్టులో గోషామహల్‌ జ్ఞాన్‌బాగ్‌ కాలనీకి చెందిన వృద్ధుడు హనుమాన్‌ దాస్‌కు సపర్యలు చేసేందుకు నెలకు రూ.7వేల జీతానికి కుదిరాడు. కాలనీలో పిల్లలతో కలుపుగోలుగా ఉండే సాయి రాజ్‌కుమార్‌ కుమారుడు అభయ్‌ మోదానీతో సన్నిహితంగా ఉండేవాడు.

ఫేస్‌బుక్‌ పరిచయం చూపిన ‘మార్గం’…
అతడికి ఫేస్‌బుక్‌ ద్వారా బాలు పౌల్‌ అనే నటుడితో పరిచయం ఏర్పడింది. ‘కుర్ర తుఫాన్‌’ అనే సినిమాలో నటించిన అతడిని నేరుగా కలిసిన సాయి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లే మార్గాన్ని చెప్పమని కోరారు. ఇందులో రాణించడానికి నటనతో పాటు డబ్బు కూడా ఉండాలంటూ బాలు పౌల్‌ చెప్పడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో చేరదామంటూ రవి, మోహన్‌లకు ఫోన్లు చేసిన సాయి వారిద్దరూ సైతం విశాఖపట్నం, హైటెక్‌ సిటీ సమీపంలో చేస్తున్న ఉద్యోగాలు వదిలేసేలా చేశాడు. 2016 ఫిబ్రవరి 18 నుంచి పూర్తి స్థాయిలో ‘సినిమా పని’లోనే నిమగ్నమైన వీరు హిందీ నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. సాయి అదే ఏడాది మార్చి 9న ఉద్యోగం మానేసి వారి వద్దకు చేరాడు.

‘క్రైమ్‌ కథ’ స్ఫూర్తితో స్కెచ్‌…
సినిమాల్లో చేరడానికి అవసరమైన డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తున్న వీరు 2016 మార్చి 14 రాత్రి యూ ట్యూబ్‌లో  ‘ఓ రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’ అనే సినిమా చూశారు. స్నాచింగ్స్, కిడ్నాపింగ్స్‌ ద్వారా డబ్బు సంపాదించే ఇతివృత్తంలో సాగే ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే కిడ్నాప్‌ చేయడం ద్వారా సినిమాల్లో చేరడానికి అవసరమైన డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. సాయికి అప్పటికే అభయ్‌తో పరిచయం ఉండటం, అతను తాము ధనవంతులమంటూ పలుమార్లు చెప్పడంతో సాయి.. ఈ విషయాన్ని మిగిలిన ఇద్దరికీ చెప్పి అతడిని టార్గెట్‌గా ఎంచుకున్నారు. అభయ్‌ను కిడ్నాప్‌ చేసి తమ గదిలోనే బంధించడం ద్వారా అతడి కుటుంబీకుల నుంచి డబ్బు గుంజాలని పథకం వేశారు. ఇందుకు అవసరమైన టేపు, బోగస్‌ వివరాలతో రెండు సిమ్‌కార్డులు, ఓ సెల్‌ఫోన్‌ తదితరాలను కొనుగోలు చేశారు. అభయ్‌ను అపహరించిన తర్వాత ‘క్రైమ్‌ కథ’లో చూపినట్లే టేపులతో కట్టేసి ‘పని’ పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

వద్దని వేడుకున్నా వినలేదు…
2016 మార్చి 16న టిఫిన్‌ సెంటర్‌కు వచ్చిన అభయ్‌ను అక్కడే కలిసిన సాయి.. సమీపంలో ఉన్న తన రూమ్‌ వద్ద డ్రాప్‌ చేయాల్సిందిగా కోరారు. కొద్దిదూరం వెళ్లే సరికి అభయ్‌కి ఫోన్లు రావడంతో డ్రైవింగ్‌ తీసుకున్న  సాయి అతడిని గది వద్దకు తీసుకువెళ్లాడు. అతడు వేడుకున్నా వినకుండా అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న టేపుతో బాలుడి చేతులు వెనక్కు విరిచి కట్టేసిన దుండగులు… అతడి నోటికీ ప్లాస్టర్‌ వేయాలని భావించారు. టేపు పొరపాటుగా ముక్కు మీదుగా వెళ్లడంతో ఊపిరాడక అభయ్‌ చనిపోయాడు. దీంతో నిందితులు శవాన్ని అట్టపెట్టెలో పెట్టి ఆటోట్రాలీలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్దకు వెళ్ళారు. ఆటోడ్రైవర్‌ వాహనాన్ని రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లోకి తీసుకువెళ్లడానికి నిరాకరించడంతో ‘పార్శిల్‌’తో సహా ఆల్ఫా హోటల్‌ వద్ద దిగి, అక్కడే వదిలేశారు. అక్కడి సిమ్‌కార్డు దుకాణంలో ఎక్కువ మొత్తం చెల్లించి గుర్తింపు కార్డులు లేకుండానే సిమ్‌కార్డులు తీసుకున్నారు. వీటిని ఉపయోగించి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన తర్వాత అభయ్‌ కుటుంబీకులకు ఫోన్లు చేసి బేరసారాలు ప్రారంభించిన ఈ త్రయం విజయవాడలో దిగిన తర్వాత సిమ్స్, ఫోన్లు పడేశాడు. అక్కడ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఒకరు ఇచ్ఛాపురం, ఇద్దరు బరంపురం చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేసిన హైదరాబాద్‌ పోలీసులు 2016 మార్చ్‌ 23న నిందితులను పట్టుకున్నారు. వీరిపై అదే ఏడాది సెప్టెంబర్‌లో పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులకు పై విధంగా శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *