Knife cutters are not

కత్తి కట్టారో కటకటాలే

బరులకు భూములిచ్చినా..    కోడి పందేలు వేసినా.. నేరమే
ముందస్తుగా నోటీసుల జారీ

ఈనాడు.

Date :07/01/2018

గుంటూరు: సంక్రాంతి వస్తోందంటే చాలు కోడి పందేలకు తెరలేస్తుంది. వారం రోజులు ముందుగానే వాటి నిర్వహణకు ఏర్పాట్లూ ఊపందుకుంటాయి. అయితే ఈసారి వాటి కట్టడికి ఏమి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), డీజీపీ నుంచి వేర్వేరు నివేదికలను కోరింది. వాటిని పరిశీలించి ఏమైనా పందేలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేసింది.  దాంతో జిల్లాలో ఇవి జరుగకుండా చూడటానికి గ్రామీణ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు.గతంలో పందేలను నిర్వహించిన, కోళ్లకు కత్తులు కట్టిన, పందేలు కాసిన, బరులకు భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ ఈసారి ఆ దిశగా ప్రయత్నించవద్దని నోటీసులు జారీ చేయిస్తున్నారు. ప్రతి ఠాణా పరిధిలో పందెంరాయుళ్లకు ఎన్ని నోటీసులు ఇచ్చారో ఏ రోజుకారోజు తెలియజేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులే ఈసారి ఓ అడుగు ముందుకేసి గ్రామాల వారీగా కానిస్టేబుళ్లను పంపి పందెంరాయుళ్ల వివరాలను సేకరిస్తూ వారి గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. నిబంధనలను ధిక్కరిస్తే రౌడీషీట్‌ తెరుస్తామన్న సంకేతాలను పంపుతూ భయం కలుగజేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని జిల్లాలో వీటికి కళ్లెం వేయకపోతే హైకోర్టు ఆగ్రహానికి గురికావాల్సివుంటుందని   అన్ని వర్గాలూ సహకరించాలని గ్రామీణ ఎస్పీ కోరుతున్నారు. రైతులు కూడా తమ భూములను ఇవ్వొద్దని, బరులే లేకపోతే కోడి పందేల నిర్వహణ అసాధ్యమని, అందుకే రైతులు విజ్ఞతతో అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

లంకలపై ప్రత్యేక దృష్టి..: ఉభయగోదావరి జిల్లాల తర్వాత కోడిపందేలు అత్యధికంగా జరిగేది గుంటూరు జిల్లాలోనే. రెండేళ్ల కిందట డెల్టాకు చెందిన ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి లంక గ్రామాల్లో భారీగా బరులు సిద్ధం చేసి, వాటిల్లో ఫ్లడ్‌లైట్లు, ఏసీలు బిగించి మరీ ఈ పోటీలకు తెరదీశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటి నిర్వహణతో కేవలం ఆ రెండు, మూడు రోజుల్లోనే సదరు ప్రజాప్రతినిధి రూ.కోట్లు గడించారని నిఘావర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదించాయి. ఆ ప్రజాప్రతినిధి నేతృత్వంలోనే ఈసారి కూడా పందేల నిర్వహణకు లంక గ్రామాల్లో బరులు సిద్ధం చేయటానికి సన్నాహాలు ప్రారంభించగా భూములు ఇవ్వటానికి రైతులు ఎవరూ సాహసించటం లేదు. గతంలో ఎస్పీలు వేరని, ప్రస్తుత ఎస్పీ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారని ముందుగానే హెచ్చరిస్తూ నోటీసులు పంపుతుండడంతో బరుల నిర్వహణకు తమ భూములను ఇవ్వబోమని తేల్చి చెబుతున్నట్లు పోలీసువర్గాల సమాచారం. మొత్తానికి గ్రామీణ ఎస్పీ ఈ పందేలపై ముందు నుంచే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో కోడి పుంజుల కొనుగోళ్లకు కూడా ఎవరూ సాహసం చేయడం లేదని తెలుస్తోంది. ఇక కత్తులు కట్టే వారు కనీసం వాటికి సాన కూడా పట్టించడానికి జంకుతున్నారని డెల్టా ప్రాంత పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
వెయ్యికిపైగా నోటీసులు: జిల్లాలోని అన్ని ఠాణాల పరిధిలో కోడి పందేలు నిర్వహించే, పై పందేలు కాచే, కత్తులు కట్టే, భూములు ఇచ్చేవారు ఇలా మొత్తం వెయ్యి మంది ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పటికే గ్రామాల వారీగా ఈ పందేల్లో క్రియాశీలకంగా ఉండే వ్యక్తుల వివరాలను స్పెషల్‌ బ్రాంచి, నిఘా వర్గాలతోపాటు సివిల్‌ కానిస్టేబుళ్ల నుంచి వివరాలు తెప్పించుకుని వారందరికీ నోటీసులు పంపే పనుల్లో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. తెనాలి, పొన్నూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు, రేపల్లె, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో గతేడాది కేవలం ఒక్క భోగి, కనుమ రోజునే 500 బరుల్లో పందేలు జరిగాయని పోలీసువర్గాల సమాచారం. ప్రస్తుతం వీటి పరిసరాల్లో కానిస్టేబుళ్లను అందుబాటులో ఉంచి తిరిగి ఈ ఏడాది అక్కడ బరులకు ఏర్పాట్లు చేయకుండా అడ్డుకునేలా ఇప్పటికే వ్యూహరచన చేశారు. సంప్రదాయంగా వస్తున్న వాటి నిర్వహణను ఈసారి పూర్తిస్థాయిలో కట్టడి చేస్తామని, ఎక్కడైనా అవి నిర్వహిస్తే అందుకు ఆ ప్రాంత పోలీసు అధికారులే బాధ్యత వహించాల్సివుంటుందని పోలీసు ఉన్నతాధికారవర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉమ్మడి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.

Tags : Knife cutters are not

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *