అకాల వర్షం  అపార నష్టం

Date:15/02/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
ఒడిదుడుకులను అధిగమిస్తూ, ప్రతీకూల పరిస్థితులకు ఎదురొడ్డి పంటలు సాగు చేస్తున్న జిల్లా రైతాంగానికి ప్రకృతి సహకరించక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాత వెన్ను విరిచింది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో అకాల వర్షాలు కురియడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి అసలేమాత్రం ఊహించని రీతిలో ఆదివారం రాత్రి 10గంటల నుండి అర్ధరాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అనేక మండలాల్లో బీభత్సమే సృష్టించింది. వర్షానికి తోడు వడగండ్లు కురియడంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వడగళ్ల వాన ధాటికి వేలాది ఎకరాల విస్తీర్ణంలో సాగైన ఎర్రజొన్నతో పాటు, పెద్ద ఎత్తున పసుపు నిల్వలు తడిసి ముద్దయ్యాయి. వీటితో పాటు అక్కడక్కడా మొక్కజొన్న, పత్తి, శెనగ, మిర్చి, పప్పు దినుసులు, ఆకు కూరల పంటలకు సైతం నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. చేతికందిన ఎర్రజొన్న, పసుపు నిల్వలను ఎక్కడికక్కడ ఆరబెట్టగా, ఈ పంటలు పూర్తిగా వర్షార్పణం అయ్యాయి. అసలే దిగుబడులు అంతంతమాత్రంగానే చేతికంది, ప్రస్తుతం వ్యాపారుల మార్కెట్ మాయాజాలం వల్ల మద్దతు ధరలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో వరుణుడు అకాల వర్షం రూపంలో రైతన్నను మరింతగా కుంగదీశాడు. ఒక్క వరి పంట మినహా, ఇతర పంటలన్నింటిని అకాల వర్షం దెబ్బతీసింది. నవీపేట, నందిపేట, మాక్లూర్, ఎడపల్లి, మెండోరా, ముప్కాల్ మండలాల్లో వడగళ్ల వానలు కురిసి ఎర్రజొన్న తదితర పంటలు పూర్తిగా నేలవాలాయి. బాల్కొండ, మెండోరా మండలాల్లో ఆరుబయట ఉన్న సుమారు 170వరకు గొర్రెలు వడగళ్ల ధాటికి తాళలేక మృతి చెందాయి. భారీ ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో  అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యధికంగా నవీపేట మండలంలో 33.2మి.మీ వర్షపాతం నమోదైంది. బాల్కొండలో 18.4మి.మీ, నందిపేటలో 18, కోటగిరిలో 14.4, బోధన్‌లో 10.6, ఎడపల్లిలో 8.6, మాక్లూర్‌లో 5.0మి.మీ వర్షం కురిసింది. వర్షపాతం తక్కువగానే నమోదైనప్పటికీ, పై మండలాల్లో దాదాపుగా అరగంటకు పైగా ఏకధాటిగా వడగండ్లు కురియడం భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చినట్లయ్యింది. చేతికందిన ఎర్రజొన్న, మొక్కజొన్న పంట వడగళ్ల ధాటికి పూర్తిగా నేలవాలింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం వివరాలను అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో సుమారు 10వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే తాజాగా కురిసిన వర్షం వల్ల వరి పైరుకు నీటి తడి అందడంతో పాటు, చీడపీడల బెడద దూరమవుతుందని ఈ పంటను సాగు చేస్తున్న రైతులు పేర్కొంటున్నారు. ఈ ఒక్క ప్రయోజనాన్ని మినహాయిస్తే, అధిక విస్తీర్ణంలో వేసిన ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లింది. ఏమాత్రం ఊహించని రీతిలో కురిసిన అకాల వర్షం తమ ఆశలను ఆవిరిచేసిందని బాధిత రైతులు కంటతడి పెడుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు తడిసి ముద్దవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈసారైనా పరిస్థితి అనుకూలిస్తుందని ఆశించగా, పంట చేతికందిన మీదట వర్షార్పణం అయ్యిందని బాధిత రైతులు విలవిల్లాడుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు పెద్ద ఎత్తున పసుపు పంటను తరలించారు. శివరాత్రి వేడుకల సందర్భంగా  క్రయవిక్రయాలను నిలిపివేయడంతో రైతులు తమ పంటను యార్డులో ఆరు బయటే ఉంచి స్వగ్రామాలకు వెళ్లిన తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల పసుపు నిల్వలన్నీ తడిసిపోయాయి. తమ ఇళ్ల వద్ద ఉంచిన నిల్వలతో పాటు పంట కళ్లాల్లో ఆరబెట్టిన పసుపు కూడా అకాల వర్షంతో తడిసిపోయింది. తడిసిన పంటలకు వ్యాపారులు ధరను మరింతగా తగ్గించే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags: Lack of premature rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *