17న పల్నాడులో జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన

Date:13/02/2018
గుంటూరు ముచ్చట్లు:
నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తం కుదిరింది. మూడేళ్ల క్రితమే మంజూరైన ఈ సంస్థ నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు తలెత్తగా వాటిని అధిగమించిన ప్రభుత్వం ఈనెల 17న భూమిపూజ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌కు సమాచారం అందింది.ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్న్‌లాజికల్‌ విశ్వవిద్యాలయం, కాకినాడ (జేఎన్‌టీయూకే) సంస్థ జిల్లాలో ఇంజనీరింగ్‌ కళాశాల స్థాపించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం సుమారు 100ఎకరాల భూమిని ఆ సంస్థ కోరగా పల్నాడు ప్రాంతంలో ఏర్పాటుచేస్తేనే ప్రయోజనం ఉంటుందన్న భావనతో నరసరావుపేటని ఎంపికచేశారు. కాకాని గ్రామంలోని సర్వే నెంబర్‌లు 283-ఏ, 286/2, 288/బిలలో 85.94 ఎకరాల భూమిని జేఎన్‌టీయూకేకి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ రికార్డులలో అసెస్డ్‌ వేస్టు (ఏడబ్ల్యూ)గా ఉన్న ఈ భూమిని ఇచ్చేందుకు గత కొన్ని నెలలుగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేసింది. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ లెక్కల ప్రకారం ఎకరం రూ. 6 లక్షలు ఉండగా బయట రూ. 20 లక్షలు నడుస్తోన్నది. ఈ నేపథ్యంలో రూ. 17 కోట్ల 18 లక్షల 80 వేలకు భూమిని కేటాయించేందుకు అప్పటి కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే గతేడాది నవంబర్‌ ఏడో తేదీ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ వద్ద జరిగిన సమావేశంలో కలెక్టర్‌ హాజరుకాగా భూమి కేటాయింపుపై చర్చించారు. ప్రభుత్వ అవసరాలకు సంబంధించినది అయినందున భూమిని ఉచితంగానే కేటాయించాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా కొన్ని షరతులను మాత్రం పెట్టారు. మూడేళ్ల వ్యవధిలో కళాశాల నిర్మాణం పూర్తిచేయాలి. ఒకవేళ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయలేకపోతే భూమిని స్వాధీనం చేసుకొంటాం. కేటాయించిన భూమిలో చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు, బావులు ఉంటే వాటిని కదిలించరాదు. ఇప్పటికే ఏర్పాటై ఉన్న రోడ్లను కూడా కదిలించరాదని స్పష్టంచేశారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా భూమిని కేటాయించడంతో సాధ్యమైనంత త్వరగా భవన నిర్మాణాలు ప్రారంభించి పూర్తిచేసేందుకు జేఎన్‌టీయూకే సంస్థ సంసిద్ధతను తెలిపింది. ఈ నేపథ్యంలో 17న శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.
Tags: Laid the foundation stone of JNTU buildings in Palnadu on 17th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *