Land delusion

భూ మాయ

Date:19/06/2018
నల్గొండ  ముచ్చట్లు:
నల్గొండజిల్లా మిర్యాలగూడ పరిసరాల్లో భూ మాయ సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మడానికి వీల్లేని భూములను కొందరు విక్రయించేందుకు ట్రై చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. 781 సర్వే నెంబరు భూమిని క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 1972లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. నివేశన స్థలాల కోసం ఉద్యోగ సంఘాల పక్షాన సర్కారుకు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి స్పందించిన సర్కార్ మిర్యాలగూడ శివారులో 24 ఎకరాల భూమిని నామమాత్ర ధరకు విక్రయించింది. అప్పట్లో ఈ ప్రాంతం పట్టణానికి దూరంగా ఉండేది. దీంతో ఈ స్థలాలపై ఉద్యోగులు ఆసక్తి చూపలేదు. భవన నిర్మాణ కార్యకలాపాలేవీ చేపట్టలేదు. ఏదైతేనేం కాలక్రమంలో తమకు ప్రభుత్వం ఇక్కడ స్థలం కేటాయించిందన్న విషయమే ఉద్యోగులు మరచిపోయారు. చాలామందికి తమకు ప్రభుత్వం స్థలం ఇచ్చిందన్న సంగతీ తెలీదు. ప్రస్తుతం సీన్ మారింది. స్థానికంగా అభివృద్ధి నెలకొనడంతో పాటూ స్థిరాస్థి వ్యాపారం ఊపందుకుంది. దీంతో కొందరు అక్రమార్కులు ఈ భూమిపై కన్నేశారని.. ఈ భూమికి సంబంధించిన రికార్డులు సంపాదించి.. గోల్ మాల్ చేసేందుకు ట్రై చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లేఅవుట్‌లో స్థలాలు పొంది మర్చిపోయిన వారి ప్లాట్లను, రోడ్లు, ఖాళీ స్థలాలను, పార్కుకు కేటాయించిన స్థలాలను విక్రయిస్తున్నారని స్పష్టంచేస్తున్నారు.వాస్తవానికి 781 సర్వేనంబరు భూమిలో స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేసింది. అవి రిజిస్ట్రేషన్‌ కాకుండా బ్యాన్ చేసింది. అయితే అక్రమార్కులు బాండ్‌ పేపర్లే రిజిస్ట్రేషన్‌ పత్రాలుగా మభ్యపెట్టి అందులోని ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారని సమాచారం. దీంతో నిజమైన వారసుల ఇళ్ల స్థలాలతోపాటు లేఅవుట్‌లోని ప్రజోపయోగ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మారిపోతున్నాయి. బాండ్‌ పేపర్‌పై రాసుకునే ఒప్పంద పత్రం కావడంతో అక్రమార్కుల పని సులువుగా సాగిపోతోంది. రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైనట్లు ఫొటోలు, వేలిముద్రలు, ఆధార్‌ లాంటి ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉండదు. దీంతో అక్రమార్కులు ధైర్యంగా ఈ దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా సంగతి తెలిసినా సంబంధిత అధికార యంత్రాంగం అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే ఈ ఆరోపణలపై తాజాగా అధికార యంత్రాంగం స్పందించింది. నిరుపేదలకు, సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల విక్రయాలు చెల్లవని తేల్చిచెప్పింది. బాండ్‌ పత్రాలతో కొనుగోలు చేసినా వాటికి యాజమాన్య హక్కు రాదని స్పష్టంచేసింది. ఇలాంటి స్థలాలను కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రధానంగా 781 సర్వేనెంబరు భూమిలో కొనుగోళ్లు, అమ్మకాలు నిషేధించామని పేర్కొంది.
Tags: Land delusion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *