అదిలాబాద్ లో భూ వివాదం

Date:19/06/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కానుకుర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత కొంత కాలంగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు మోహరించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం కానుకూర్‌ గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులకు అటవీశాఖ పోలీసుల చర్యలకు నిరసనగా గ్రామస్తులు నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. కాన్కూర్ రైతులు గత 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా తమకు  న్యాయం దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానుకూర్ గ్రామంలో సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో హరితహారం మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారుల ట్రాక్టర్ లతో చదును చేయడానికి రావడంతో గ్రామస్తులు ఎదురు తిరగారు. దీంతో అధికారులకు, గ్రామస్తులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో పోలీసులు అడ్డుకున్న వారిని వ్యాన్లలో జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానుకూర్  గ్రామ శివారులో ఉన్న 1600 ఎకరాలను అటవి భూమిగా తేలుస్తూ అటవీ అధికారులు బోర్డులు పెట్టడంతో రైతులు పోరాటానికి దిగారు.
కానుకూరు గ్రామంలోని ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా 2 వేల ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు రైతులు తెలిపారు. మరో పక్క అటవీశాఖ అధీనంలో 2 వేల 400 ఎకరాలు ఉన్నట్లు అధికారులు చెప్తుండగా 700 ఎకరాలు మాత్రమే అటవీశాఖ పరిధిలో భూములు ఉన్నాయని మిగితా1600 ఎకరాల మిగులు భూములపై తమకే హక్కు ఉందని  కానుకూరు వాసులు పోరాటం చేస్తున్నారు. 1996 నుంచి 22 ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నా.. ప్రభుత్వ పెద్దలు ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారు కానీ తమకు న్యాయం చేయడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దశాబ్దాలుగా ఈ భూసమస్య కొలిక్కిరావడం లేదని పలుమార్లు జాయింట్‌ సర్వేలు నిర్వహించినా మిగులు భూముల లెక్క తేలలేదని చెప్తున్న… మరో పక్క అటవీశాఖ అధికారులు మాత్రం ఆ భూములపై గ్రామస్తులకు ఎలాంటి అధికారం లేదని తేల్చేస్తున్నారు..ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను హరిత హారం అంటూ అధికారులు స్వాధీనం చేసుకోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:Land dispute in Adilabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *