నవ్వడం భోగం… నవ్వించడం యోగం…

-అభిమానుల ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల

Laughing ... laughing yo ...

Laughing … laughing yo …

Date: 13/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల! అన్నట్టు జంధ్యాల గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. మనిషి జీవితం బాధల, సమస్యల మయమై ఉంటుంది. అలాంటి మనిషి థియేటరుకు వచ్చినపుడు అతనికి కాస్త నవ్వులు పంచి నవ్వించాలన్నదే నా ధ్యేయం. అందుకే నేను ఎక్కువగా హాస్యరస ప్రధానమైన చిత్రాలు రూపొందించడానికే ఇష్టపడతాను. రచయితగా నేను హాస్యమే రాశాను. దర్శకుడుగా హాస్యాన్నే పంచుతున్నాను. అయితే హాస్యం రాయడం, హాస్య చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పనులు. కొంచెం శృతి మించితే హాస్యం అపహాస్యమవుతుంది. హాస్యానికి, అపహాస్యానికీ మధ్య రేఖా మాత్రమైన భేదం మాత్రమే ఉంటుంది. నేను నా శక్తివంచన లేకుండా హాస్యాన్ని హాస్యంగా ఉంచడం కోసమే ప్రయత్నిస్తున్నాను అంటారు తెలుగుచిత్ర సీమలో 1976 నుంచి 2000 వరకూ రారాజుగా వెలిగిన నవ్వులరాజు జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రి! ఆయనకి రచయితగా మూడువందల యాభై చిత్రాలు, దర్శకుడిగా 39 చిత్రాలు ఆయన సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలుగా నిలిచి వెలుగుతున్నాయి. నవ్వుకోసమే జీవించిన జంధ్యాల, మచ్చుతునకల్లాంటి ఎన్నో హాస్యగుళికలు అందించారు. వాటిల్లో జీవిత సత్యాలు, బోలెడు ప్రాసలు, సినిమా నటీనటులకు సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. తెనాలి రామలింగ కవి హాస్యాన్ని పోలిన హాస్యోక్తులు మనకు ఎన్నో కనిపిస్తాయి. ఊరికే హాస్యం కోసమే హాస్యస్ఫోరక ప్రయోగాలు చెయ్యటం కాక అంతర్లీనంగా ఆయనలోని పాండితి, ఆవేదన అన్నీ తెలిసేవి జంధ్యాల రచనలో, చిత్రాల్లో. ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. ‘క’తో ఇస్తా ఏకాకి… కాకీక కాకికకాక కోక… ఆ కాకీక కాకికి కాక కోకికా కుక్కకా!? ఇందులో 24 ‘క’లున్నాయి… ఎలా ఉంది? పోనీ ఇంకోటిస్తా ‘న’ మీద ‘నాని నాని… నీనూనె నీనూనె నానూనె నూనె… నేనై నేను నీనూనె నా నూనేనని, నానూనె నీనూననీ నిన్న నేనన్నానా… నోనో… నేన్నానా నున్నని నాన్నా… నెననై… ఇందు లో 56 ‘నా’లున్నాయి లెక్కచూసుకో కావాలంటే. అని సవాల్‌ విసరగల దమ్మున్న రచయిత జంధ్యాల. తెలుగు భాషకు, అధ్యాపకులకు పడుతున్న దుస్థితిని హై హై నాయకా! చిత్రంలో నరేశ్‌ పాత్ర ద్వారానూ, చూపులు కలసిన శుభవేళ చిత్రంలో కోట శ్రీనివాసరావు పాత్ర ద్వారానూ చూపించినా, ఫక్తు హాస్యచిత్రంగా సాగే చంటబ్బాయ్‌ చిత్రంలో అనాథలుగా వదిలివేయబడుతున్న బిడ్డల గురించిన ఆవేదనను జొప్పించినా, రకరకాల వ్యాపకాలతో, తదనుగుణమైన సాధనలతో శ్రీలక్ష్మి పాత్రల ద్వారా హాస్యం తుళ్ళించినా, ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూ ఉండే వాళ్ళని దెప్పుతూ హై హై నాయకా! చిత్రంలో కోట శ్రీనివాసరావును, మొగుడూ పెళ్ళాలు చిత్రంలో సుత్తి వీరభద్రరావును మలచినా అది జంధ్యాలకే చెల్లు! కృష్ణ గోదావరుల్లో ప్రవహించది నీరుకాదు, కన్నీరు కట్నమిచ్చు-కోలని కన్నెపలల కన్నీరు. అని తన ఆక్రందనను వినిపించిన సమాజవాది. అసలు జంధ్యాల మన పక్క ఇంట్లో ఉండి మన ఇంట్లో జరిగేవన్నీ వ్రాసుకుని తన సినిమాలలో పెట్టేస్తాడేమో! అని హాస్యప్రియులకే కాక అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుమానం వచ్చే ఉంటుంది కొన్ని పాత్రలు తెర మీద చూస్తున్నప్పుడు! కాఫీకి స్పెల్లింగ్‌ రాసిన తీరు… ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి సంబంధం లేకుండా చెప్పడం వేరొకరికి సాధ్యం కాదేమో! అంతగా మన మనసుల్లో దూరి గిలిగింతలు పెట్టే ఆరోగ్యకరమైన హాస్యం కమర్షియల్‌ మూసలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమాకి కొత్త ఊపిరులూదిందంటే కాదనేదెవరు! మొదటి ముద్దమందారం చిత్రం విడుదల సమయానికి ముసలివారి పడుచు ప్రేమలు చూసి విసుగెత్తిన అప్పటి జనాలకి అది చల్లని జంధ్యామారుతంలా అనిపించింది. నాలుగు స్తంభాలాట మొదలు తీసిన చిత్రాలలో పుష్కలంగా సెంటిమెంట్‌ ఉన్నా కాని హాస్యం బాగా పండింది. దానికి తోడు అహ… నా పెళ్ళంట! వసూళ్ళలో పెద్ద చిత్రాలని మించిపోవడంతో . హాస్యంగా సాగిన, ఆనందభైరవి, రెండు జెళ్ళసీత, లేడీస్‌ స్పెషల్‌, నెలవంక, సత్యాగ్రహం లాంటి చిత్రాలు జంధ్యాల ఎంతటి ఆలోచనా-పరుడో, ఎంతటి సెన్సిటివ్‌ వ్యక్తో తెలుస్తుంది. శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయ్‌, పడమటి సంధ్యారాగం లాంటి చిత్రాలని ఆయన తప్ప ఇంకొకళ్ళు తీయలేరు అని అనడం అతిశయోక్తి కాబోదు. ఆయన పరిచయం చేసిన కొత్త నటీనటుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. నరేశ్‌, ప్రదీప్‌, పూర్ణిమ, రాజేష్‌, సుత్తి జంట, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం… ఇలా ఒక పెద్ద జాబితానే అవుతుంది! పొట్టి ప్రసాద్‌, శ్రీలక్ష్మి వంటి నటీనటులని ఒకే రకమైన పాత్రికేయంతోనే మళ్ళీ మళ్ళీ వాడుకున్నా, కోట శ్రీనివాసరావుతో రకరకాల హావభావాలను చేయించినా ఎన్నో చిత్రాలలో వాడుకున్నా ఒక్క సారైనా విసుగు తెప్పించకుండా చిత్రాలని మలచగల నేర్పరితనం జంధ్యాలకే సొంతం! రాజేంద్రప్రసాద్‌, చంద్రమోహన్‌, నరేశ్‌ వంటి వారిని చిత్రరంగానికి తానుగా పరిచయం చేయకున్నా కథానాయకులుగా వారికి కొత్త బాణీ కల్పించి, బాలకృష్ణ, చిరంజీవి వంటి కమర్షియల్‌ హీరోలతో కూడా హాస్యప్రధానమైన చిత్రాలు తీసి, ఆఖరికి తెరంగేట్రం చేస్తున్న అమెరికన్‌ నటుడితోనూ,స్వతహాగా నటుడు కాని డ్రమ్మర్‌ శివమణితోనూ కూడా హాస్యాన్ని పండించి సినిమాలలో హాస్యం అన్న మాటకే సరికొత్త నిర్వచనం కల్పించిన హాస్యబ్రహ్మ వారి చిత్రంలో పాటలు కూడా ఒక్కొక్కటి ఒక ఆణిముత్యంల తీర్చిదిద్దించుకునేవారు. తాను తీసినవి హాస్య చిత్రాలయినా, మరే రకమైన కోవకు చెందినవైనా జంధ్యాల చిత్రాలలో పాటలను ఎవరూ మరువలేరు! ముద్దుకే ముద్దొచ్చే సింగారం… (ముద్దమందారం), తొలి చూపు తోరణమాయె, కళ్యాణ కారణమాయె…, సన్నజాజి తీవెలలోనే సన్నాయి… (మల్లె పందిరి), మందారంలో ఘుమఘుమనై… (రెండు జెళ్ళ సీత), పిలచిన మురళికి… (ఆనందభైరవి), కాస్తందుకో, దరఖాస్తందుకో… (రెండు రెళ్ళు ఆరు)… ఇలా ఎన్నని చెప్పగలం! ఆనందభైరవి చిత్రంలో ఒక్కో పాట ఒక్కో అణిముత్యమే. చైత్రము కుసుమాంజలి…, పిలచిన మురళికి…, కొలువైతివా రంగశాయి… ఇలా ఒక్కో పాట చిత్రీకరణలో అయన వాడిన శైలి ఎన్ని సంవత్సరాలైనా మరపు రాదు! ఆనందభైరవిలో ఒక్కో సన్నివేశం వెనుక ఎంత అర్థం ఉన్నదో చెప్పలేము! విడుదలయ్యాక ఘనవిజయం సాధించిన ఆ చిత్రానికి మొదట విడుదల హక్కులు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని (శంకరాభరణం చిత్రం లాగా) తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది! కళాతపస్వి విశ్వనాథ్‌ తీసిన శంకరాభరణం మార్కు చిత్రమైన ఆనందభైరవి జంధ్యాల సినిమానా? అని ఆశ్చర్యపోయేవారికి శంకరభరణం చిత్రానికి కూడా జంధ్యాల మాటలు రాసారని తెలియకపోవచ్చు! అటువంటి కళాత్మక చిత్రాలకూ, తానే బాటే వేసిన హాస్యచిత్రాలకు మాత్రమే కాదు… జంధ్యాల కలం వేటగాడు లాంటి కమర్షియల్‌ చిత్రాలలోనూ తన వాడిని నిరూపించుకుంది! సినిమా రచయితకి స్టార్‌ స్టేటస్‌ తెచ్చి హాస్యాభిమానుల మనసుల్లో ఎంతో ఎత్తున స్థిరత్వాన్ని సంపాదించిన జంధ్యాల చిన్న వయసులోనే అందుకోలేని స్వర్గాలను చేరుకుని నేటికి సరిగ్గా ఎనిమిది సంవత్సరాలు. రచయితగానూ, ఉత్తమ సంగీతాభిరుచినీ, హాస్యాభిరుచీనీ కలిగిన దర్శకుడిగానూ, ఆపద్బాంధవుడు చిత్రంలో నటుడిగానూ కూడా తన బహుముఖప్రజ్ఞను ప్రదర్శించిన గురించి మన జంధ్యాల ఎంత రాసిన తక్కువే.

Tags: Laughing … laughing yo …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *