రాజ్యసభ పై నేతల ఆశలు

Date:14/02/2018
విజయవాడ ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు రాజ్యసభ సీట్లు త్వరలో ఖాళీ కానున్నాయి. ఇందులో మూడు ఏపీవి కాగా.. మరో మూడు తెలంగాణవి. తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే రాజ్యసభ ఎన్నికలలో మూడు స్థానాలను కైవసం చేసుకోనుంది. ఈ స్థానాలకు అభ్యర్దులు ఎవరా అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి. యాదవ సామాజిక వర్గానికి ఒక సీటు ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఫలితంగా ఆ వర్గంలోని సీనియర్ నేతలైన నోముల నరసింహయ్య, రాజయ్య యాదవ్, ఏ నాగేశ్వర యాదవ్, లింగమయ్య యాదవ్ లు పోటీ పడుతున్నారు. మిగతా సీట్ల కోసం సి.ఎం కేసిఆర్ తన సమీప బంధువు అయిన సంతోష్ ను ఎంపిక చేయవచ్చనే చర్చ సాగుతోంది. అంతే కాదు తెలంగాణ కోసం పాటుపడిన దామోదరరావు, మీడియా రంగానికి చెందిన సి.ఎల్ రాజం వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మూడో సీటును మైనార్టీలకు ఇవ్వొచ్చని అంచనా. ఎం.ఐ.ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సలహాను కేసీఆర్ తీసుకున్నారని తెలుస్తోంది. మైనార్టీకి కాకపోతే ఎస్సీలకు ఆ సీటును ఇస్తారంటున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే వీలుంది. రాజ్యసభ సీట్ల విషయంలో కేసీఆర్ పక్కా ప్లాన్ తో ఉన్నారు. అదే ఏపీ విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు మినహా మిగతా వారి విషయంలో ఇంకా తేలలేదంటున్నారు. వైకాపాకు ఒక సీటు వచ్చే వీలున్నా.. ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచన చేస్తుండటం ఇబ్బంది కలిగించే అంశమే. మరోవైపు పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయలేదు. అయినా సరే స్పీకర్, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు నైతికతపై అనుమానాలు వచ్చాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఇది మంచి పద్దతి కాదని హితవు పలకడం తప్ప ఏం చేయలేకపోయారు. గతంలో టిజి వెంకటేష్ రూ.70 కోట్లతో రాజ్యసభ సీటు కొనుగోలు చేశారనే ప్రచారం వచ్చింది. రూ.25 కోట్లను ఎరగా వేసి వైకాపా ఎమ్మల్యేలతో ఆయన మంతనాలు ఆడారనే ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా రాజ్యసభ సీట్ల వ్యవహారం మరోసారి రచ్చ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags: Leaders’ hopes on the Rajya Sabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *