Natyam ad

అభివృద్ధి కోసం ఎదురు చూపులు

జనగామ ముచ్చట్లు:
 
1976లో  ఏర్పాటు చేసిన జనగామ ఆర్టీసీ బస్టాండ్ కు ఘనమైన చరిత్ర కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి మాత్రం దీనంగా ఉంది. జనగామ బస్టాండ్ నుంచి ప్రతి రోజూ 50 వేల మందికి పైగా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ డిపోలో ఒక సూపర్ లగ్జరీ, ఐదు డీలక్స్ బస్సులు, 31 ఎక్స్ ప్రెస్ బస్సులు, 75 పల్లె వెలుగు బస్సులు, 5 మినీ పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. వీటికి ప్రతిరోజూ ఐదు వేల లీటర్ల డీజిల్ తో పాటు 40 నుంచి 50 వేల కిలోమీటర్లు తిరిగి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తున్నా.. ప్రయాణికులకు బస్టాండ్ లో సరైన వసతులు కల్పన లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.జిల్లాలో ఏకైక ఆర్టీసీ డిపో జనగామ. ఈ డిపో, బస్టాండ్ అభివృద్ధికి కావాల్సినంత హంగులు ఆర్భాటాలు ఉన్న అధికారులు చూసీచూడనట్లు ఉండటంతో 12 ప్లాట్ ఫామ్ లకు పరిమితమైంది. సాధారణ సమయంలోనే బస్సులు బస్టాండ్ లో పట్టక రోడ్డుపైనే ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక పండుగలు, శుభకార్యాల సమయాల్లో బస్టాండ్ లోపలికి వెళ్లే బస్సు బయటికి రావాలంటే సుమారు 30 నిమిషాలు పడుతుంది. ఇలా బస్టాండ్ లో ప్లాట్ ఫామ్స్ అభివృద్ధి చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో జనగామ బస్టాండ్ విస్తరణ చేపడతామని ఆర్టీసీ అధికారులు తెలిపిన నేటికీ విస్తరణ జరగకపోవడంతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.జిల్లాలో చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద దిక్కుగా ఉన్న జనగామ బస్టాండ్ అభివృద్ధికి నోచుకోక పోగా..
 
 
 
కనీస మౌలిక వసతులు సైతం కరువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం వల్ల జనగామ బస్టాండ్ లో నేడు ప్రయాణికులు కూర్చునేందుకు సైతం సరైన కుర్చీలు లేవు. అలాగే తాగునీరు, భద్రత సౌకర్యాలు లేవు. బస్సు ఎక్కి దిగేందుకు కూడా సరైన ఫుట్పాత్ లేకపోవడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పారిశుద్ధ్య విషయానికి వస్తే బస్టాండ్ లో ఎక్కడ చూసినా కోతులు, దోమలు, కుక్కలు ఏకంగా బస్సుల కిందే తిరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో ఉండేవి మరి హీనంగా ఉంటాయని వాపోతున్నారు. బస్టాండ్ ప్రాంగణం అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు వెనకాడుతున్నారు. దీంతో ఆర్టీసీకి ఎంతగానో నష్టం వాటిల్లుతోంది. కనీస నిర్వహణ కరువై బస్టాండ్ ఆవరణంతా చెత్తాచెదారం తో పాటు మూత్ర విసర్జనలతో నిండిపోతుంది. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు. దగ్గరలోని కురగాయాలు, పూలు, పండ్ల దుకాణాల నిర్వహకులు వ్యర్థాలను తెచ్చి ఇక్కడే పారేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడుగా బస్టాండ్ లో సీసీ రోడ్డు సక్రమంగా లేకపోవడం తో చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు నిలిచి అపరిశుభ్రంగా మారుతోంది. మంచి నీటి కుళాయి వద్ద కూడా పరిశుభ్రత పాటించకపోవడంతో ప్రయాణికులు రూ.20 నుంచి రూ.30 వెచ్చించి తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా బస్టాండ్ ను అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 
Tags: Looking forward to the development