Natyam ad

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభ‌వంగా మహాశివరాత్రి వేడుకలు

తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి  వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఏకాంతంగా భోగితేరు ఆస్థానం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం భోగితేరు ఆస్థానం జరిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో  ఏకాంతంగా నిర్వ‌హించారు.  ఆత్మ రథికుడు. శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.
వేడుకగా స్నపనతిరుమంజనం
ఆ తరువాత అర్చకులు స్నపన తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించారు. శ్రీస్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఏకాంతంగా నంది వాహ‌నం ఆస్థానం నిర్వ‌హిస్తారు. మార్చి 2వ తేదీ బుధవారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
శ్రీవారి సేవకుల విశేష సేవలు
ఆలయానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణతో పాటు భక్తులు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా సూచనలు చేశారు. భక్తులందరికీ శానిటైజర్ స్ప్రే చేశారు.
మార్చి 2న శివపార్వతుల కల్యాణం :
శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన బుధవారం సాయంత్రం శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, ఎఈఓ  సత్రేనాయక్, సూపరింటెండెంట్‌  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  రెడ్డిశేఖ‌ర్‌,  శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
 
Tags: Mahashivaratri celebrations in grand style at Sri Kapileshwara Temple